YS Jagan ఢిల్లీకి ఎందుకొచ్చారు.. ఏం అడిగారు..?

ABN , First Publish Date - 2022-01-04T08:33:06+05:30 IST

బిగుసుకుంటున్న ఈడీ కేసుల విచారణ ఉచ్చు! వివేకానంద హత్య కేసులో చురుగ్గా సాగుతున్న సీబీఐ దర్యాప్తు! ఆర్థికంగా రోజురోజుకూ కష్టాల ఊబిలో కూరుకుపోతున్న రాష్ట్రం! ఇలా ఎన్నెన్నో కష్టాలు! వీటి నుంచి కాపాడగలిగేది ఒకే ఒక్కరు! ఆయనే......

YS Jagan ఢిల్లీకి ఎందుకొచ్చారు.. ఏం అడిగారు..?

  • సీఎం జగన్‌ పర్యటనపై ఉత్కంఠ
  • చుట్టుముడుతున్న అనేక కష్టాలు..
  • అదే సమయంలో హస్తిన పర్యటన
  • 20 నిమిషాలపాటు మోదీతో భేటీ..
  • అవినాశ్‌ రెడ్డితో కలిసి ఢిల్లీకి రాక
  • కాపాడాలని ప్రధానిని కోరారా?


(న్యూఢిల్లీ - ఆంధ్రజ్యోతి)


బిగుసుకుంటున్న ఈడీ కేసుల విచారణ ఉచ్చు! వివేకానంద హత్య కేసులో చురుగ్గా సాగుతున్న సీబీఐ దర్యాప్తు! ఆర్థికంగా రోజురోజుకూ కష్టాల ఊబిలో కూరుకుపోతున్న రాష్ట్రం! ఇలా ఎన్నెన్నో కష్టాలు! వీటి నుంచి కాపాడగలిగేది ఒకే ఒక్కరు! ఆయనే... ప్రధాని నరేంద్ర మోదీ! సోమవారం సీఎం జగన్‌ ఢిల్లీలో మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్ర సమస్యలపై వినతిపత్రం ఇచ్చుకోవడంతోపాటు... సొంత సమస్యలను ఆయన బాగా ఏకరువు పెట్టుకున్నారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.  వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్‌ రెడ్డితోపాటు జగన్‌ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. జగన్‌  సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకున్నప్పటికీ... ప్రధాని అధికారులతో సమావేశంలో ఉండడంతో 4.40 వరకు వేచి ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత మరో 20 నిమిషాలు మోదీతో సమావేశం జరిగింది. అక్రమాస్తులపై ఈడీ కేసుల విచారణతోపాటు, వివేకా హత్య కేసులో అవినాశ్‌ రెడ్డిపై ఆరోపణలు - సీబీఐ దర్యాప్తు... ఈ రెండూ జగన్‌ను బాగా కలవర పెడుతున్నాయి. అవినాశ్‌ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తే రాజకీయంగా తీవ్ర నష్టం జరగడం ఖాయం. ఈ నేపథ్యంలో... ప్రధాని మోదీతో భేటీలో ఈ అంశాలను ప్రస్తావించి శరణు కోరారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు... సొంత పార్టీలోనే ఉంటూ రెబల్‌గా మారిన ఎంపీ రఘురామకృష్ణ రాజు అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు సమాచారం. ఆయనను బీజేపీలో చేర్చుకోరాదని కోరినట్లు తెలుస్తోంది. ప్రధానితో భేటీ తర్వాత రాత్రి 8.30 గంటల ప్రాంతంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను జగన్‌ కలుస్తారని ముందుగా అధికారులు చెప్పినప్పటికీ ఈ అపాయింట్‌ మెంట్‌ మంగళవారం ఉదయం 9.30 గంటలకు మారిందని సమాచారం. కేంద్ర మంత్రి గడ్కరీని కూడా మంగళవారం కలిసే అవకాశముంది. మరికొందరు కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్ల కోసం ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది.


ప్రత్యేక విమానంలో...

గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఎంపీ అవినాశ్‌ రెడ్డి, ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌, ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్‌ దాస్‌తో కలిసి జగన్‌ ఢిల్లీకి వచ్చారు. సోమవారం ఉదయమే ఢిల్లీకి చేరుకున్న పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయి రెడ్డి, వైసీపీ లోక్‌సభ నేత మిథున్‌ రెడ్డి, ఎంపీలు బాలశౌరి, ఎంవీవీ సత్యనారాయణ, గోరంట్ల మాధవ్‌, నందిగం సురేశ్‌, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, ఆళ్ల అయోఽధ్య రామిరెడ్డి, మార్గాణి భరత్‌ తదితరులు జగన్‌ను విమానాశ్రయంలో, నివాసంలోనూ కలుసుకున్నారు. 


జగన్‌తో ఆమ్రపాలి భేటీ

ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న కాటా ఆమ్రపాలి ముఖ్యమంత్రి జగన్‌ను ఆయన నివాసంలో కలుసుకుని చర్చలు జరిపారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన ఆమ్రపాలి ఆంధ్రా కేడర్‌ నుంచి తెలంగాణ కేడర్‌కు మారిన విషయం తెలిసిందే. ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ గత ఏడాది పీఎంఓలో ఆమ్రపాలిని కలుసుకుని, ఆమెతో ఫోటో దిగడంతోపాటు ఆమె ఆంధ్రప్రదేశ్‌ కు గర్వకారణమని ట్వీట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కీలక విషయాల గురించి తెలుసుకునేందుకు ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఆమె సహకారం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నేపథ్యంలో ఆమ్రపాలి నేరుగా జగన్‌తో భేటీ కావడం విశేషం. నిజానికి... తన కార్యాలయంలో అధికారులు ఇలా బయటకు వచ్చి ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ నేతలు, జర్నలిస్టులను కలుసుకోవడం  ప్రధానమంత్రి ఇష్టపడరని ఒక అధికారి చెప్పారు.

Updated Date - 2022-01-04T08:33:06+05:30 IST