1 నుంచి ‘గౌరవ’ సభలు

ABN , First Publish Date - 2021-11-27T08:58:32+05:30 IST

ప్రధాన ప్రతిపక్షం టీడీపీ డిసెంబరు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలు, పట్టణాల్లో ‘గౌరవ’ సభలు నిర్వహించాలని నిర్ణయించింది.....

1 నుంచి ‘గౌరవ’ సభలు

 అసెంబ్లీని కౌరవ సభగా మార్చడం

 ఆడపడుచుల గౌరవంపై చైతన్యం

 టీడీపీ పొలిట్‌ బ్యూరో నిర్ణయం 


అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): ప్రధాన ప్రతిపక్షం టీడీపీ డిసెంబరు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలు, పట్టణాల్లో ‘గౌరవ’ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రజాస్వామ్య సౌధమైన శాసనసభను అధికార పక్షం మంత్రులు, ఎమ్మెల్యేలు ఏవిధంగా కౌరవ సభగా మార్చారో, మహిళల వ్యక్తిత్వంపై ఏవిధంగా దాడిచేశారో ప్రజలకు వివరించి, ఆడపడుచుల గౌరవంపై చైతన్యం కల్పించనుంది. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం పొలిట్‌బ్యూరో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మొత్తం 17 అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశానికి సంబంధించిన వివరాలను మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మీడియాకు వివరించారు. ఇటీవల అసెంబ్లీలో జరిగిన ఘటన నేపథ్యంలో కౌరవ సభలోకి అడుగు పెట్టనంటూ చంద్రబాబు చేసిన శపథానికి పొలిట్‌బ్యూరో ఏకగ్రీవంగా మద్దతు తెలిపినట్టు చెప్పారు. ఇటీవల రాయలసీమలో సంభవించిన వరదలు, మరణాలపై న్యాయ విచారణ జరిపించాలని పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేసినట్టు తెలిపారు. వరదల్లో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, వరి పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.25 వేల నష్టపరిహారం చెల్లించాలని సమావేశం డిమాండ్‌ చేసిందన్నారు.


రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్‌ సీరియస్‌ వ్యాఖ్యలు చేసిందని, అప్పులు విపరీ తం.. ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైన విషయాన్ని పేర్కొందని.. దీనిపై పొలిట్‌ బ్యూరో చర్చించినట్టు కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. రాజధానిని మూడు ముక్కలు చేయడం వికేంద్రీకరణ కాదని, రెండున్నరేళ్లలో మూడు ప్రాంతాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని సమావేశం అభిప్రాయపడిందన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని పొలిట్‌ బ్యూరో డిమాండ్‌ చేసిందన్నారు. బీసీ జనగణన చేయాలని.. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం ఈ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని సమావేశం డిమాండ్‌ చేసినట్టు కాలవ తెలిపారు. పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరల వల్ల ప్రజలపై విపరీతమైన భారం పడుతోందని పెట్రోల్‌ఫై రూ.16, డీజిల్‌పై రూ.17 ధర తగ్గించాలని డిమాండ్‌ చేసినట్టు వివరించారు. పంచాయతీల నిధులను వెంటనే జమ చేయాలని సమావేశం డిమాండ్‌ చేసినట్టు తెలిపారు. మరోవైపు 1983 నుంచి ఉన్న ఇళ్లకు డబ్బులు చెల్లించాలంటూ ప్రభుత్వం సామాన్యుల్ని ఒత్తిడి చేయడాన్ని ఖండించామన్నారు. వరి వేయకూడదన్న ప్రకటనను కూడా ఖండించామని తెలిపారు.  


వివేకా నిందితుల్ని రక్షిస్తున్న జగన్‌

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో అసలు నిందితుల్ని రక్షించేలా ముఖ్యమంత్రి జగన్‌ చర్యలున్నాయని పొలిట్‌బ్యూరో అభిప్రాయపడినట్టు శ్రీనివాసులు తెలిపారు. ఈ కేసులో నిందితులెవరైనా శిక్షపడేలా చేయాలని సీబీఐకు విజ్ఞప్తి చేశామన్నారు. పురపాలక సంఘాలు, మిగిలిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందని అంచనా వేశామన్నారు. కాగా, శాసనమండలి మాజీ చైర్మన్‌, పొలిట్‌బ్యూరో సభ్యుడు షరీ్‌ఫను చంద్రబాబు అభినందించినట్టు కాలవ శ్రీనివాసులు చెప్పారు. మండలిలో ఆయన తీసుకున్న సరైన నిర్ణయం అమరావతికి అనుకూలంగా మారిందని కొనియాడారన్నారు. ఇదిలావుంటే, శుక్రవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యా లయంలో నేతలు అంబేడ్కర్‌కు ఘననివాళులర్పించారు. 


జంపింగులను రానివ్వం!

పనిచేసే వారికే పార్టీలో పదవులు దక్కుతాయని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీలు మారి వచ్చేవాళ్లకు అవకాశం ఉండబోదని స్పష్టం చేశారు. పార్టీకోసం ఎవరు పనిచేస్తున్నారు? ఎవరు చేయడం లేదనేది రాసిపెడుతున్నానని తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేశ్‌రెడ్డిలు శుక్రవారం చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. జమ్మలమడుగు టీడీపీకి కంచుకోట అని తెలిపారు. అక్కడ పార్టీకోసం పనిచేస్తున్న అందరికీ గుర్తింపు ఉంటుందన్నారు. భూపేశ్‌రెడ్డికి జమ్మలమడుగు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. 

Updated Date - 2021-11-27T08:58:32+05:30 IST