Advertisement
Advertisement
Abn logo
Advertisement

సన్యాసుల వేషంలో ‘ఎర్ర’ తమిళ కూలీలు

అనంతలో తనిఖీ.. 40 మంది పరార్‌ 

నల్లమలలో తమిళ స్మగ్లర్ల హల్‌చల్‌

ఐషర్‌ వాహనంలో దుంగల తరలింపు

అడ్డుకోబోయిన అటవీ అధికారిపై దాడి

స్మగ్లర్ల వాహనం కిందపడి కూలీ మృతి

ఐచర్‌ వాహనంలో దుంగల తరలింపు

అడ్డుకోబోయిన అటవీ అధికారిపై దాడి

స్మగ్లర్ల వాహనం కిందపడి తమిళ కూలీ మృతి 


ప్రొద్దుటూరు(క్రైం)/చిలమత్తూరు, నవంబరు 26: ఎర్రచందనం అక్రమ రవాణా ఆగడం లేదు. తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. కడప జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో రాత్రి వేళ స్మగ్లర్లు చెట్లను నరికి, తరలించేస్తున్నారు. ఇలా.. ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తున్న ఐచర్‌ వాహనాన్ని అటవీ అధికారులు వెంటాడారు. వీరి నుంచి తప్పించుకునే క్రమంలో ఓ తమిళ కూలీ ఐచర్‌ వాహనం కిందపడి మృతిచెందాడు. మరో ఇద్దరు పరారయ్యారు. నలుగురిని మాత్రం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు రూరల్‌ సీఐ కథనం మేరకు.. ఖాజీపేట మండలం నల్లమల్ల అటవీ ప్రాంతం నుంచి కొందరు స్మగ్లర్లు, తమిళ కూలీలు ఎర్రచందనం దుంగలను ఐచర్‌ వాహనంలో తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో గురువారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఖాజీపేట అటవీశాఖ సెక్షన్‌ ఆఫీసర్‌ ఖాజావలి సిబ్బందితో కలిసి ఆ వాహనాన్ని వెంటాడారు. ఆ మినీలారీ ప్రొద్దుటూరు వైపు మళ్లించడంతో అటవీ అధికారులు తమ వాహనంతో వెంబడించారు.


ఈ క్రమంలోనే ఎర్రస్మగ్లర్లు అధికారులపై దాడికి యత్నించారు. బొజ్జవారిపల్లె క్రాస్‌ సమీపంలో, ఓ తమిళ కూలీ పట్టు కోల్పోయి అదే వాహనం కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో స్మగ్లర్లు వాహనం ఆపారు. అటవీ అధికారులు అక్కడకు చేరుకుని నలుగురు తమిళ కూలీలను పట్టుకోగా, మరో ఇద్దరు పారిపోయారు. కూలీల దాడిలో గాయపడ్డ సెక్షన్‌ ఆఫీసర్‌ ఖాజావలిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రూరల్‌ ఎస్‌ఐ సంజీవరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.  వాహనాన్ని, అందులో ఉన్న ఐదు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ప్రొద్దుటూరు అటవీ కార్యాలయానికి తరలించారు.  


సన్యాసుల వేషంలో ‘ఎర్ర’ తమిళ కూలీలు

అనంతలో తనిఖీ.. 40 మంది పరార్‌ 

దాదాపు 40 మందికి పైగా ఎర్ర చందనం కూలీల ముఠా సన్యాసుల మాదిరిగా కాషాయ వస్త్రాలు ధరించి అనంతపురంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. అయితే, చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండడంతో పరారయ్యారు. బెంగళూరు నుంచి అనంతపురం వైపు వస్తున్న హెచ్‌ఆర్‌-55 ఎస్‌ 6796 లారీని కొడికొండ చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీ కోసం ఆపారు. వెంటనే డ్రైవర్‌తో పాటు 40 మంది కాషాయ వస్త్రధారణలో ఉన్న వ్యక్తులు లారీలో నుంచి దూకి పరుగులు తీశారు. పోలీసులు వారిని వెంబడించి 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారు తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలుగా చిలమత్తూరు ఎస్‌ఐ రంగడు తెలిపారు.

Advertisement
Advertisement