ఆర్థిక సంఘం నిధుల మాయంపై క్రిమినల్‌ కేసు పెడదాం!

ABN , First Publish Date - 2021-11-27T08:47:11+05:30 IST

కేంద్ర ప్రభుత్వం పంచాయతీకి ఇచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధుల మాయంపై కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం బొడ్డపాడు గ్రామం భగ్గుమంది....

ఆర్థిక సంఘం నిధుల మాయంపై  క్రిమినల్‌  కేసు పెడదాం!

కృష్ణా జిల్లాలో బొడ్డుపాడు గ్రామం నిర్ణయం

తోట్లవల్లూరు, నవంబరు 26: కేంద్ర ప్రభుత్వం పంచాయతీకి ఇచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధుల మాయంపై కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం బొడ్డపాడు గ్రామం భగ్గుమంది. పంచాయితీ ఖాతాలోని రూ.9.80 లక్షలను సర్పంచ్‌, కార్యదర్శి సంతకాలు లేకుకుండా ఎవరు వెనక్కు తీసుకున్నారో తెలీదని, దీన్ని తీవ్రమైన ఆర్థిక నేరంగా భావిస్తూ.. ఈ నిధులు తీసుకున్న వారిపై క్రిమినల్‌ కేసు పెట్టాలని ఆ పంచాయతీ గ్రామసభ తీర్మానం చేసింది. సర్పంచ్‌ మూడే శివశంకర్‌ అధ్యక్షతన శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా శివశంకర్‌ మాట్లాడుతూ.. రూ.9.80 లక్షల నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో, కేంద్ర ప్రభుత్వం తీసుకుందో తెలీదన్నారు. నిధులు డ్రా అయినట్టు పంచాయతీ కార్యదర్శి ఫోన్‌కి ఈనెల 21న మెసేజ్‌ వచ్చిందని చెప్పారు. నిబంధనల ప్రకారం సర్పంచ్‌, కార్యదర్శి జాయింట్‌ సంతాకాలు లేకుండా రూపాయి కూడా బయటకు తీయడానికి వీల్లేదన్నారు. తమకు తెలీకుండా రూ.9.80 లక్షలు తీసుకోవడం ఆర్థిక నేరం కాబట్టి దీనిపై క్రిమినల్‌ కేసు పెట్టాలని గ్రామసభలో తీర్మానించారు. అలాగే కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించుకునేందుకు రాత్రి 10 గంటల తర్వాత వీధి లైట్లు ఆపివేయాలని కూడా నిర్ణయించారు.

Updated Date - 2021-11-27T08:47:11+05:30 IST