సర్కారు చేతిలో ‘సినిమా’!

ABN , First Publish Date - 2021-11-25T08:00:39+05:30 IST

థియేటర్లలో సినిమా చూడాలంటే ఇకపై రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్‌ ద్వారానే టికెట్‌ కొనాలి. థియేటర్‌కు వెళ్లో... ...

సర్కారు చేతిలో ‘సినిమా’!

సినిమాటోగ్రఫీ చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం 

ఇష్టానుసారం ఆరేడు షోలు... బెనిఫిట్‌ షోల బాదుడు

అందుకే ఆన్‌లైన్లో సినిమా టికెట్ల విక్రయం 

ఇక మేం చెప్పిన సమయాల్లోనే థియేటర్లలో షోలు

శాసనసభలో మంత్రి పేర్ని నాని వెల్లడి 


అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి):  థియేటర్లలో సినిమా చూడాలంటే ఇకపై రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్‌ ద్వారానే టికెట్‌ కొనాలి. థియేటర్‌కు వెళ్లో... ఆన్‌లైన్‌లో ఇతర యాప్స్‌ ద్వారానో కొనుగోలు చేయడానికి కుదరదు. ఇకపై ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానమే అమల్లో ఉంటుందని, ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే టికెట్లు అమ్మాలని పేర్కొంటూ సినిమాటోగ్రఫీ చట్టంలో చేసిన సవరణలకు శాసనసభ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఈ సవరణ బిల్లును మంత్రి పేర్ని నాని సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా థియేటర్లలో రోజుకు 4 ఆటలే వేయాల్సి ఉండగా.. ఇష్టానుసారంగా ఆరేడు షోలు వేస్తున్నారని ఆక్షేపించారు.


బెనిఫిట్‌ షోల పేరిట టికెట్‌కు రూ.500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారన్నారు. వీటికి ఆన్‌లైన్‌ ప్రక్రియ ద్వారా అడ్డుకట్ట వేయొచ్చన్నారు. ఇకపై ప్రభుత్వం చెప్పిన సమయాల్లోనే షోలు ప్రదర్శించాలని, నిబంధనలకు లోబడే టికెట్‌ ధరలు నిర్ణయించాలని స్పష్టం చేశారు. బస్సు, రైలు, విమాన టికెట్లలాగే ఇంటి నుంచే సినిమా టికెట్లనూ ఆన్‌లైన్లో కొనుగోలు చేయొచ్చన్నారు. 


‘బెనిఫిట్‌’ లేదు 

సినిమా టికెట్‌ రేట్లను రేపో, మాపో ప్రభుత్వం సవరిస్తుందనీ, అదనపు ఆటలు, బెనిఫిట్‌ షోలు వేసుకోవడానికి కూడా జగన్‌ సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందన్న ఆశతో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమకు మంత్రి నాని పిడుగులాంటి వార్త వినిపించారు. ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం అనేది సినిమాటోగ్రఫీ చట్టంలో లేదు. అందుకే సవరణలు చేసి ఆ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. పెద్ద సినిమా విడుదలైనప్పుడు తొలివారం అదనపు రేట్లకు టికెట్లు అమ్ముకొనే అవకాశాన్ని గత ప్రభుత్వాలు కల్పించేవి. ఈ సవరణ బిల్లుతో ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. 


చిత్ర పరిశ్రమ వర్గాల్లో ఆందోళన

వాస్తవానికి ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం ఉండాలని చిత్ర పరిశ్రమ ఎప్పటినుంచో ప్రభుత్వాన్ని అడుగుతోంది. ఇటీవల మంత్రి పేర్నితో పలుసార్లు సమావేశమైన పరిశ్రమ పెద్దలు ఆన్‌లైన్‌ విధానానికి మద్దతు పలికారు. అయితే రాష్ట్రంలోని థియేటర్లన్నీ కంప్యూటరైజ్‌ చేసి, ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెడితే పారదర్శకత ఉంటుందనీ, ప్రభుత్వం కూడా లింక్‌ ఇవ్వడం వల్ల ఏ సినిమాకు ఎంత వసూలు అయింది, పన్ను ఎంత వచ్చిందనేది స్పష్టంగా తెలుస్తుందని మంత్రికి సూచించారు. అవేమీ పట్టించుకోకుండా రైల్వే, ఆర్టీసీల్లాగా ఎఫ్‌.డి.సి. ద్వారా ప్రభుత్వమే ఆన్‌లైన్‌ వ్యాపారం చేస్తుందని ప్రకటించడంతో పరిశ్రమ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిన తర్వాత న్యాయపరంగా దాన్ని ఎలా ఎదుర్కొవాలో ఆలోచిస్తామని ఓ చిత్ర ప్రముఖుడు తెలిపారు.


అందులో కొన్నే... 

ఏపీలో 1,100 థియేటర్లు ఉన్నాయి. వాటిలో 500కి పైగా థియేటర్లలో ఆన్‌లైన్‌ విధానం ఇప్పటికే అమల్లో ఉంది. బుక్‌ మై షో, పేటీమ్‌, జస్ట్‌ టికెట్స్‌ వంటి ప్రైవేట్‌ సంస్థలు.. ప్రతి టికెట్‌ మీద సెంటర్‌ను బట్టి, థియేటర్‌ను బట్టి అదనంగా సర్వీస్‌ చార్జీ వసూలు చేసి కొంత ఎగ్జిబిటర్‌కు ఇస్తున్నాయి. రూ.13 సర్వీస్‌ చార్జీ వసూలు చేస్తే అందులో రూ.6 థియేటర్‌కు ఆన్‌లైన్‌ సంస్థ ఇస్తోంది. ఈ లెక్కన ఏడాదికి ఎంత ఇవ్వాల్సి వస్తుందో లెక్కలు వేసి ముందే ఎగ్జిబిటర్‌కు ఇస్తున్నారు. మూడేళ్ల మొత్తాన్ని ముందే ఇవ్వడం, దీనిపై వడ్డీ లేకపోవడంతో ఎగ్జిబిటర్లు ఆ సంస్థలతో చేతులు కలుపుతున్నారు. ఈ విధానంలో కోట్లు ఆర్జిస్తున్న ఆన్‌లైన్‌ సంస్థలు ఇప్పుడు ప్రభుత్వం రంగప్రవేశం చేయడంతో సైలెంట్‌గా పక్కకు తప్పుకుంటాయో, లీగల్‌గా పోరాడతాయో చూడాలి.


పెద్ద సినిమాలకు దెబ్బే 

టికెట్‌ రేట్ల పెంపు, బెనిఫిట్‌ షోలపై గంపెడాశతో ఉన్న పెద్ద సినిమాల పరిస్థితి ఏమిటనే చర్చ మొదలైంది. ‘అఖండ’ డిసెంబరులో విడుదల కానుంది. తర్వాత ‘పుష్ప’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘భీమ్లా నాయక్‌’, ‘రాధే శ్యామ్‌’, ‘ఆచార్య’... అన్నీ భారీ బడ్జెట్‌ చిత్రాలే. ఆన్‌లైన్‌ విధానం వెంటనే అమలులోకి వస్తే వ్యాపారపరంగా ఈ చిత్రాలకు పెద్ద దెబ్బేనని పరిశీలకులు భావిస్తున్నారు.

Updated Date - 2021-11-25T08:00:39+05:30 IST