Abn logo
Nov 25 2021 @ 03:09AM

నిన్న ‘కోనసీమ’.. నేడు కన్నీటికోన

మందపల్లె అందాలన్నీ మటుమాయం

‘అన్నమయ్య’ చెంత చెయ్యేరు ఉరకలు

కట్ట తెగిన వరదకు గుర్తుపట్టలేనివిధంగా.. 

కడ..గండ్లలో కడపజిల్లా బాధితులు

డ్యామ్‌ గేట్లు పూర్తిస్థాయిలో తెరవలేదా?

కమిటీ, బాధితులకు ఇదే సందేహం


రాజంపేట/ కడప, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జన్మస్థలి ప్రాంతాన్ని కడప జిల్లా కోనసీమగా పిలుస్తారు. ఇక్కడి చెయ్యే రు నదీ పరివాహక ప్రాంతం వందల సంవత్సరాలుగా పచ్చదనంతో ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉంటుంది. సుమారు 30 కిలోమీటర్ల మేర రాజంపేట, పెనగలూరు, నందలూరు మండలాల్లో నది ప్రవహిస్తుంది. నదిలో పుష్కలమైన నీరు, అందుకు తగ్గట్లు ఎప్పుడూ పచ్చగా ఉండే పంటలు అందాల్లో పోటీపడుతుంటాయి. ఇక్కడి సుమారు 50 గ్రామాలకు ఈ నదే ఆధారం. ఈ ప్రాంతానికి ఎగువనే అన్నమయ్య ప్రాజెక్టు ఉంది. శుక్రవారం ఆ ప్రాజెక్టు తెగిపోవడంతో పచ్చదనం ఒక్కసారిగా మటుమాయమైంది. ఏకంగా ఐదు అడుగుల పైబడి ఇసుక మేట వేసి... అదంతా ఇప్పుడు ఎడారిని తలపిస్తోంది. ఎవరి భూమి ఏదో ఎవరూ కనుక్కోలేని విధంగా పొలాల గట్లను వరద పూడ్చివేసింది. పంటలన్నీ ఇసుకతో పూడిపోయాయి. మందపల్లె గ్రామ పొలాలను చూస్తే వరదకు ముందు.. వరద తర్వాత జరిగిన విధ్వంసం అర్థమవుతుంది.


వచ్చే వరదను వదిలేయలేదా?

అన్నమయ్య ప్రాజెక్టు కట్ట కొట్టుకుపోవడానికి పోటెత్తిన వరదతోపాటు..మానవ తప్పిదం కూడా కారణమైందా?  ఉప్పెనై ముంచేసిన వరదకు సర్వం కోల్పోయిన బాధితులు అవుననే అంటున్నారు. దీనిపై సీబీఐ, సెంట్రల్‌ విజిలెన్స్‌ ద్వారా సమగ్ర విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని డిమాండ్‌ చేస్తున్నారు. స్పిల్‌వే గేట్లను పూర్తిగా ఎత్తలేదని, 14 మీటర్లు ఎత్తాల్సి ఉంటే.. 9.7 మీటర్లే ఎత్తారని బుధవారం నిపుణుల కమిటీ గుర్తించినట్లు సమాచారం. అంతేకాదు.. ఎగువ నుంచి వస్తున్న వరద అంచనా వేసి దిగువ స్థాయి అధికారులను అప్రమత్తం చేయడంలో ఎస్‌ఈ స్థాయి అధికారులు వైఫల్యం చెందారనే ఆరోపణలూ బలంగా ఉన్నాయి. ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల కమిటీ పలు సూచనలతో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. చెయ్యేరు నదిపై నిర్మించిన అన్నమయ్య ప్రాజెక్టు కట్ట కొట్టుకుపోయి రాజంపేట మండలం పులపుత్తూరు, తోగూరుపేట, మందపల్లి, గండ్లూరు, నందలూరు మండలం పాటూరు, నందలూరు గ్రామాల్లో వరద విధ్వంసం సృష్టించి.. వందల కుటుంబాల్లో విషాదం నింపిన విషయం తెలిసిందే. ఈ నెల 18, 19 తేదీలలో వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లాలో కురిసిన వర్షాలకు పింఛాకు భారీగా వరద పోటెత్తింది. ఆ వరద చెయ్యేరుకు చేరింది. ఆ వరద ఉధృతికి అన్నమయ్య డ్యామ్‌ కట్ట తెగి.. గ్రామాలకు గ్రామాలు మునిగాయి. ఈ ప్రాజెక్టును బుధవారం రాష్ట్ర జలవనరుల శాఖ నిపుణుల కమిటీ సభ్యులు గిరిధర్‌రెడ్డి,రౌతు సత్యనారాయణ, శ్రీనివాసులు పరిశీలించి.. నివేదిక తయారుచేశారు. 


ఇంకా చీకట్లోనే.. 

వరదకు గురైన పులపుత్తూరు గ్రామంలో 150 ఇళ్లు కూలి రాళ్ల కుప్పగా మారాయి. కరెంటు లేని ఊళ్లో రాత్రి పడుకోవడానికి నీడే లేనంతగా నీళ్లు నిండిపోయాయి. ఆ నీళ్లలో నాని కుళ్లిన వస్తువులు దుర్గంధం వేస్తున్నాయి. రాత్రి ఎత్తు ప్రదేశంలో మిగిలిన ఇళ్లపైకి వెళ్లి కునుకుతీసి.. మళ్లీ వస్తున్నామని శ్రీను అనే యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానపు గదులు ఏర్పాటు చేసి.. నీటి వసతి కల్పించకపోవడంతో రాత్రి పూట చీకట్లో బహిర్భూమికి కొండలు, పొదల చాటుకు వెళ్లాల్సి వస్తోందని, విషకీటకాల భయం వెంటాడుతోందని తోగూరుపేటకు చెందిన లక్ష్మి, పులపుత్తూరుకు చెందిన రాజేశ్వరి అనే మహిళలు వాపోయారు. ఇప్పుడిప్పుడే ఇక్కడ ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇంటికి 25 కిలోల బియ్యం, పప్పు, నూనె చొప్పున పంపిణీ చేశారు. అయితే, గ్యాస్‌ సిలిండర్లు వరదకు కొట్టుకుపోవడం వల్ల వంట ఎలా చేసుకుకోవాలని బాధితులు ప్రశ్నిస్తున్నారు.


చావలేక బతుకీడుస్తున్నాం

‘వరదొచ్చి ఇన్నిరోజులైనా కనీసం తాగునీరు ఇవ్వడం లేదు. దాతలు ఇచ్చే నీటి ప్యాకెట్లతోనే దాహం తీర్చుకుంటు న్నాం. ప్రభుత్వం ట్యాంకరు ద్వారా నీళ్లు ఇస్తున్నా.. అని వాడుకోవడానికే సరిపోవడం లేదు. బురద, కూలిపోయిన ఇళ్ల రాళ్లకుప్పలు, దుర్గంధం మధ్య చావలేక బతుకీడుస్తున్నాం. ప్రభుత్వ అధికారులు స్పందించి మాకు శాశ్వత పరిష్కారం తక్షణమే చూపించాలి’’

- జయరామయ్య, పులపుత్తూరు, వరద ముంపు గ్రామం