హోరెత్తిన నిరసనలు

ABN , First Publish Date - 2021-11-21T07:24:00+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, శ్రేణులు రోడ్డెక్కాయి. అసెంబ్లీలో వైసీపీ నేతలు, మాజీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వ్యక్తిత్వ హననాని కి పాల్పడ్డారంటూ కార్యకర్తలు..

హోరెత్తిన నిరసనలు

సీఎం జగన్‌ సహా పలువురి 

దిష్టి బొమ్మలు దహనం

పోలీసులను ప్రతిఘటించి రోడ్డెక్కిన మహిళలు

పలువురు టీడీపీ నేతల గృహ నిర్బంధం

నిరసనకారులపై నిర్బంధ కాండ 

సభలో అవమానం చూసి ఆగిన గుండె


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, శ్రేణులు రోడ్డెక్కాయి. అసెంబ్లీలో వైసీపీ నేతలు, మాజీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వ్యక్తిత్వ హననాని కి పాల్పడ్డారంటూ కార్యకర్తలు మండిపడ్డారు. శనివారం రెండోరోజూ పెద్ద ఎత్తున సాగిన నిరసనలను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. చాలా చోట్ల వాగ్వివాదాలు, తోపులాటలు చోటు చేసుకున్నాయి. నిర్బంధాన్ని తోసిరాజంటూ తెలుగు మహిళలు, తమ్ముళ్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం జగన్‌, మంత్రి కొడాలి, ఎమ్మెల్యే అంబటి చిత్రపటాలను తగులపెట్టారు. చెప్పులతో కొట్టారు. వివిధ ప్రాం తాల్లో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మహిళలు పెద్ద సంఖ్యలో పార్టీలకు అతీతంగా ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో ఉన్నవారిని పోలీసులు పక్కకు ఈడ్చేశారు. టీడీపీ కార్యాల యం వద్దే అడ్డుకొని ప్రధాన గేటును మూసివేశారు. నరసాపురంలో పోలీసులను ధిక్కరించి మరీ ముందుకుసాగారు. పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నేతృత్వంలో మోకాళ్ల మీద నిలబడి నిరసన తెలిపారు. తణుకులో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను అరెస్టు చేశారు. ఉండిలో చంద్రబాబు, భువనేశ్వరి దం పతుల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. విశాఖలో టీడీపీ నగర కార్యాలయ ఆవరణలో టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మతో శవ యాత్ర చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పాడెకు నిప్పు పెడతారని భా వించిన పోలీసులు... నీళ్లనుకొని అక్కడున్న సీసాలోని పెట్రోల్‌ను పోశారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. కొందరు వెంటనే అప్రమత్తమై విద్యార్థి నాయకుడిని పక్కకు లాగేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు సాగాయి. నం ద్యాలలో ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌ ఆధ్వర్యం లో శనివారం ర్యాలీ నిర్వహించారు.


ఫరూక్‌ మాట్లాడుతూ విలువలు, క్రమశిక్షణ, హుందాతనానికి నందమూరి కుటుంబం మారుపేరన్నా రు. ఆత్మకూరులో సీఎం జగన్‌ చిత్రపటాన్ని టీడీపీ శ్రేణులు దహనం చేస్తుండగా పోలీసు లు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలు చిత్రపటాలను చెప్పులతో కొడుతుండగా పోలీసులు స్టేషన్‌కు తరలించేందుకు యత్నించారు. గూడూరులో టీడీపీ నేతలు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. ఆలూరులో ‘చిత్రపటాల’ను చెప్పులతో కొట్టి దహనం చేశారు. కాకినాడలో మాజీ ఎమ్మెల్యే కొండబా బు ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయం ఎదు ట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగుమహిళ విభాగానికి చెందిన ఓ నేత శునకాన్ని అక్కడకు తీసుకువచ్చారు. దాని మెడలో ‘సీఎం భౌభౌ.. మంత్రుల కంటే మేమే నయం’’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతపురంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణస్వామి ఆధ్వర్యంలో శిరోముండనం చేయించుకొని నిరసన తెలిపారు. చిత్తూరులో రాస్తారోకోకు దిగిన టీడీపీ శ్రేణులపై పోలీసు లు లాఠీఛార్జి చేశారు. జీడీనెల్లూరు నియోజకవర్గంలో టీడీపీ కో ఆర్డినేటర్‌ చిట్టిబాబు సహా పలువురు నాయకులను పోలీసులు హౌస్‌ అరె స్టు చేశారు. బి.కొత్తకోటలో కార్యకర్తలు అంబటి రాంబాబు, కొడాలి నానీల చిత్రపటాలకు పిండ ప్రదానం చేశారు. ప్రకాశం జిల్లాలో కొవ్వొత్తులు, కాగడాల ప్రదర్శనలు నిర్వహించారు. ఒంగోలు టీడీపీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ నేతృత్వంలో చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. 


వైసీపీని వీడుతున్నా

భువనేశ్వరిని నిండు సభలో వైసీపీ నేతలు అవమానించడం భరించలేక అధికార పార్టీని వీడుతున్నట్లు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ ప్రకటించారు. ఇక మీదట ఏ రాజకీయ పార్టీలో కొనసాగేది లేదన్నారు. కాగా, నాగరత్నమ్మ 1998-99లో టీడీపీ తరఫున తంబళ్లపల్లె ఎంపీపీగా పనిచేశారు. 


అందరి దృష్టినీ ఆకర్షించిన తెలుగు యువత బ్యానర్‌

విశాఖ(గాజువాక), నవంబరు 20: చంద్రబాబు కుటుంబాన్ని ఉద్దేశించి వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం విశాఖపట్నం జిల్లా గాజువాక టీడీపీ నేతలు ప్రదర్శన నిర్వహించారు. తెలుగు యు వత ఆధ్వర్యంలో మంత్రి కొడాలి నాని, వైసీపీ ఎమ్మెల్యేల ఫొటోలతో ఏర్పాటు చేసిన బ్యానర్‌ అందరి దృష్టినీ ఆకర్షించింది. దున్నపోతు ముఖానికి కొడాలి నాని చిత్రాన్ని, కుక్కలకు ఎమ్మెల్యేలు వంశీ, అంబటి, చంద్రశేఖర్‌రెడ్డి ఫొటోలను మార్ఫింగ్‌ చేసి ముద్రించారు. 


ఆవేదన మింగేసింది

తిరుమలగిరి: ఏపీ అసెంబ్లీలో మాజీ సీఎం చంద్రబాబుకు జరిగిన అవమానాన్ని భరించలేక పోయాడు. కంటికిమింటిగా ఏడుస్తూ, టీవీ చూస్తూ గుండెపోటుతో కు ప్పకూలిపోయాడు. హైదరాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంతం బొల్లారంకు చెందిన టీడీపీ సీనియర్‌ నాయకు డు దర్శనం యాదయ్య శుక్రవారం రాత్రి మృ తి చెందారు. ఎన్‌టీఆర్‌ పార్టీ స్థాపించినప్పటి నుండి యాదయ్య టీడీపీలో ఉన్నారు.


మూత్ర విసర్జన చేసి నిరసన

కడప, నవంబరు 20(ఆంధ్రజ్యోతి):  చం ద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిని బర్తరఫ్‌ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్థన్‌రెడ్డి, పీరయ్య ఆధ్వర్యంలో శనివారం కడప నగరంలోని అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద  నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొడాలి నాని, అంబాటి రాంబాబు, వల్లభనేని వంశి చిత్రపటాలపై చిన్నపిల్లాడితో మూత్ర విసర్జన చేయించి నిరసన తెలిపారు.





Updated Date - 2021-11-21T07:24:00+05:30 IST