సమస్యలపై గళమెత్తిన ఆదివాసీలు

ABN , First Publish Date - 2021-10-28T08:29:19+05:30 IST

సమస్యలపై గళమెత్తిన ఆదివాసీలు

సమస్యలపై గళమెత్తిన ఆదివాసీలు

అధికార పార్టీ ప్రజా ప్రతినిధులపై ఆగ్రహం 

రాజీనామాకు డిమాండ్‌.. పాడేరులో భారీ ర్యాలీ.. 


పాడేరు (విశాఖపట్నం జిల్లా), అక్టోబరు 27: రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలకు అన్ని విధాలా అన్యాయం చేస్తోందని, అయినా ఏజెన్సీలో అధికార పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆదివాసీ జేఏసీ కన్వీనర్‌ రామారావుదొర, ఇతర నేతలు ధ్వజమెత్తారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో ఎస్‌టీ తెగల పేర్లు తొలగించిన వారిపై చర్యలు, జీవో-3 పునరుద్ధరణ, 1/70 చట్టం పటిష్ఠ అమలుకు డిమాండ్‌ చేస్తూ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరుపై ఆదివాసీలంతా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఆదివాసీల సమస్యలపై స్పందించడంలేదని, పరిష్కారానికి కనీస చర్యలు చేపట్టడం లేదని, వారు పదవుల్లో ఉండేందుకు అనర్హులని, రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల నిర్లక్ష్యంతో ఏజెన్సీలో 139 ఏకోపాధ్యాయ పాఠశాలలు మూతపడ్డాయని, జీవో-3 పునరుద్ధరణ, ఎస్‌టీ తెగల పేర్లు తొలగింపు గురించి పట్టించుకోని వీరిని ఏ చెట్టుకు కట్టి కొట్టాలని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు, అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-28T08:29:19+05:30 IST