నమ్మండి.. ఇది రోడ్డేనండీ!

ABN , First Publish Date - 2021-10-27T09:31:18+05:30 IST

నమ్మండి.. ఇది రోడ్డేనండీ!

నమ్మండి.. ఇది రోడ్డేనండీ!

అడుగడుగునా గోతులతో అవస్థలు

స్కూల్‌ బస్సు దిగబడితే ఆరోజుకు సెలవే

నిత్యం వాహనదారుల అగచాట్లు


కొయ్యలగూడెం, అక్టోబరు 26: సాధారణంగా వాహనాల్లో ప్రయాణించే వారు రోడ్డుపై గోతులు ఎక్కడున్నాయో చూసుకుని ప్రయాణిస్తారు. కానీ పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం పొంగుటూరు-యాదవోలు రహదారిపై ప్రయాణించే వారు మాత్రం గోతుల్లో రోడ్డు ఎక్కడుందో వెతుక్కుని మరీ వెళతారు. ఇదీ ఈ రోడ్డు ప్రత్యేకత! ఈ రోడ్డుపై సోమవారం ఎదురెదురుగా వచ్చిన రెండు లోడు లారీలు దిగబడిపోయాయి. వాటిని బయటికి తీసేందుకు డ్రైవర్లు విశ్వప్రయత్నం చేశారు. ఫలితం లేక.. ఇద్దరూ చెరో ఐదు వేలు ఖర్చు చేసి ఓ జేసీబీని తెప్పించి బయటకు లాగించారు. ఓ స్కూల్‌ బస్సు కూడా సోమవారం గోతుల్లో దిగబడిపోయింది. దీంతో అందులో ఉన్న విద్యార్థులను వారి తల్లిదండ్రులే వచ్చి స్కూళ్లకు తీసుకుని వెళ్లారు. ఇలా ఈ ప్రాంత గ్రామాల ప్రజలు, విద్యార్థులు నిత్యం నరకం చూస్తున్నారు. ఈ రోడ్డు మీదుగా రాజమహేంద్రవరం, నిడదవోలు, జంగారెడ్డిగూడెం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అడుగడుగునా భారీ గోతులు ఉండడంతో భారీ వాహనాలు, స్కూలు వాహనాలు గోతుల్లో దిగబడి కదలక మెరాయిస్తుండడంతో వేరే వాహనాల సాయంతో బయటకు తీస్తుంటారు. ఇక స్కూలు, కాలేజీల వాహనాలైతే గోతుల్లో దిగబడితే ఆ రోజు అప్రకటిత సెలవుగానే విద్యార్థులు భావిస్తారు. వర్షాలు కురిసిన సందర్భాలలో, రాత్రి వేళల్లో గోతులు ఎక్కడున్నాయో తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక అధికారులకు ఫిర్యాదు చేయడం వేస్టని చాలా మంది.. ఏం చేయలేక నిస్సహాయంగా తమ ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్డు బాగుచేయాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2021-10-27T09:31:18+05:30 IST