ఇళ్ల పథకం అప్పీల్‌లో ప్రతివాదిగా కేంద్రం

ABN , First Publish Date - 2021-10-27T09:23:51+05:30 IST

ఇళ్ల పథకం అప్పీల్‌లో ప్రతివాదిగా కేంద్రం

ఇళ్ల పథకం అప్పీల్‌లో ప్రతివాదిగా కేంద్రం

వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలన్న ఏఎస్‌జీ

రేపు విచారిస్తామన్న హైకోర్టు ధర్మాసనం


అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం విషయంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌లో ప్రతివాదిగా చేరేందుకు అనుమతివ్వాలని కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ హరినాథ్‌ హైకోర్టును అభ్యర్థించారు. సింగిల్‌ జడ్జి పరిగణనలోకి తీసుకోని అంశాలు ధర్మాసనం దృష్టికి తీసుకురావాల్సి ఉందన్నారు. వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి స్పందిస్తూ.. ఇళ్ల నిర్మాణం విషయంలో పీఎంఏవై పథకం ఇమిడి ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ప్రతివాదిగా చేరడం సరైనదే అన్నారు. ఆ వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం అప్పీల్‌పై ఈ నెల 28న విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. పేదలందరికీ ఇళ్ల పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు ప్రమాణాలకు అనుగుణంగా లేవని, నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా పథకాన్ని ఖరారు చేయాలని అప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టవద్దని సింగిల్‌ జడ్జి ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌ దాఖలు చేసింది. మంగళవారం జరిగిన విచారణలో అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు ప్రతిని ధర్మాసనం ముందు దాఖలు చేశామని తెలిపారు.

Updated Date - 2021-10-27T09:23:51+05:30 IST