ఇక గంజాయిపై యుద్ధం

ABN , First Publish Date - 2021-10-27T09:02:10+05:30 IST

ఇక గంజాయిపై యుద్ధం

ఇక గంజాయిపై యుద్ధం

నెల రోజులుగా అధ్యయనం.. ఏవోబీలోనే ఎక్కువ సాగు 

ముంద్రా పోర్టు హెరాయిన్‌తో, నరసాపురం

కేసుతో ఏపీకి సంబంధం లేదు: డీజీపీ 


రాజమహేంద్రవరం, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ‘‘ఇక గంజాయిపై యుద్ధం మొదలెట్టాం. మీరే చూస్తా రు. భవిష్యత్‌లో కూడా గంజాయి ఉండకుండా చేస్తాం. సీఎం ఆదేశాలతో సెప్టెంబరు నుంచి దీనిపై లోతైన అధ్యయనం చేశాం. ఆంధ్ర, ఒడిశా బోర్డర్‌లోనే ఇది సాగవుతోంది. అక్కడినుంచి అనేక ప్రాంతాలకు సరఫరా అవుతోంది. బోర్డర్‌లో నక్సలైట్ల సమస్యను ఎదుర్కొంటున్నట్టు ఆంధ్ర, ఒడిశా సమన్వయంతో గంజాయి సమస్య విషయంలోనూ వ్యవహరిస్తాం’’ అని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు. రాజమహేంద్రవరంలో మంగళవారం ఆయన పోలీసు ఉన్నతాధికారులతో కలసి ఎన్‌డీపీఎస్‌ స్ర్టేటజీపై రాష్ట్ర స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడారు. ‘‘గంజాయిపై వ్యూహం, యాక్షన్‌ప్లాన్‌పై చర్చించాం. రేపటినుంచి అమలు చేస్తాం. 4,500 ఎకరాల్లో గంజాయి ధ్వంసం చేయడమే లక్ష్యం. ఇది కొత్త సమస్యేమీ కాదు. దశాబ్దాల నాటిది. ఆంధ్ర, ఒడిశా బోర్డర్‌లో మాడుగుల తదితర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. దీనిపై ఒడిశా డీజీపీతోనూ చర్చించాను. జాయింట్‌ కోఆర్డినేషన్‌తో సమస్యను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. ఇప్పటికే అన్ని విభాగాల్లో కమిటీలు ఏర్పాటు చేసి, ఇంటిల్జెన్స్‌ నివేదికలు కూడా తెప్పించుకున్నాం. దీనిగురించి నార్కోటిక్‌ డీజీ, ఎన్‌సీబీ డైరెక్టర్‌, తెలంగాణ డీజీపీతో కూడా మాట్లాడాను. ఇదో ట్రేడ్‌. బయట రాష్ర్టాలకు కూడా వెళుతోంది. ఇతర రాష్ర్టాలకు సంబంధించిన వ్యక్తులు 470మంది దొరికారు. గత నెలలో 3వేల కిలోల గంజాయి దొరకడం రాజకీయ ఆయుధంగా మారింది. ముంద్రా పోర్టులో దొరికిన హెరాయిన్‌తో, నర్సాపురం కేసుతో ఏపీకి  సంబంధం లేదు. ఒట్టి ఆరోపణలతో రాష్ట్రాన్ని బద్నాం చేస్తున్నారు. పోలీసులపై కూడా విమర్శలు చేయడం సరికాదు. డీఆర్‌ఐ అధికారులూ దీనిపై క్లారిటీ ఇచ్చా రు. ఎన్‌ఐఏ కూడా సంబంధం లేదని చెప్పింది. సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్‌ చేస్తోంది కదా, ఏమైనా ఆధారాలు ఉంటే వారొచ్చి యాక్షన్‌ తీసుకుంటారు కదా’ అని అన్నారు. ఇటీవల ప్రతిపక్షాల కార్యాలయాలు, ఇళ్లపై దాడుల గురించి మాట్లాడానికి డీజీపీ నిరాకరించారు. రాష్ట్రంలో అన్ని శాఖల సమన్వయంతో గంజాయి అరికట్టడంపై వ్యూహం పన్నినట్టు చెప్పారు. కాగా, కొవిడ్‌తో మృతిచెందిన రాజమహేంద్రవరానికి హెడ్‌ కానిస్టేబుల్‌ కట్టా వీరవెంకటరమణ కుటుంబాన్ని డీజీపీ పరామర్శించారు. 

Updated Date - 2021-10-27T09:02:10+05:30 IST