Advertisement
Advertisement
Abn logo
Advertisement

సుప్రీం మార్గదర్శకాలను మేజిస్ట్రేట్లు పాటించాల్సిందే!

లేదంటే శాఖాపరమైన విచారణ!!

రిమాండ్‌ విధించేటప్పుడు..  వ్యక్తిగత స్వేచ్ఛను గుర్తుంచుకోవాలి

41ఏ నిబంధనల అమలులో న్యాయస్థానాలకే ఎక్కువ బాధ్యత

హైకోర్టు స్పష్టీకరణ.. తీర్పు వాయిదా 


అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): పోలీసులు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌ కోసం మేజిస్ట్రేట్‌ ముందు ప్రవేశపెట్టినప్పుడు.. అర్నేశ్‌కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను మేజిస్ట్రేట్లు పాటించాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. అలా పాటించని మేజిస్ట్రేట్లపై శాఖాపరమైన విచారణకు ఆదేశించిన సందర్భాలున్నాయని గుర్తుచేసింది. రిమాండ్‌ విధించే సమయంలో వ్యక్తుల స్వేచ్ఛకు సంబంధించిన అంశాన్ని పరిశీలిస్తున్నామనే విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని పేర్కొంది. సుప్రీం మార్గదర్శకాలు ఏపీలోనే కాదు.. ఇతర ప్రాంతాల్లోనూ పాటించడంలేదని.. పాటించేలా తగిన ఉత్తర్వులిస్తామని పేర్కొం టూ తీర్పును రిజర్వు చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది. మీడియా ప్రతినిధులు, సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌లు పెట్టేవారిపై నిబంధనలకు విరుద్ధంగా సీఐడీ పోలీసులు కేసు నమోదు చేయడాన్ని సవాల్‌ చేస్తూ టీవీ5 న్యూస్‌ చానల్‌ చైర్మన్‌ బొల్లినేని రాజగోపాల్‌నాయుడు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై మంగళవారం ధర్మాసనం ముందు విచారణ జరిగింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపించారు. కొన్ని కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సీఐడీ పోలీసులు పాటించడం లేదన్నారు. ఏడేళ్ల జైలుశిక్ష విధించడానికి అవకాశమున్న కేసుల్లోనూ.. 41ఏ కింద నోటీసు ఇచ్చి వివరణ తీసుకోకుండా నేరుగా అరెస్టు చేస్తున్నారని తెలిపారు. ‘సుప్రీంకోర్టు అర్నేశ్‌కుమార్‌ కేసులో ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా.. ఏడేళ్లలోపు జైలు శిక్ష వేసేందుకు అవకాశం ఉన్న కేసుల్లో సైతం వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌ నిమిత్తం మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరుస్తున్నారు. మేజిస్ట్రేట్లు కూడా సుప్రీం మార్గదర్శకాలు పాటించకుండా రిమాండ్‌ విధిస్తున్నారు. అలాగే పోలీసు అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఏపీపోలీ్‌ససేవా యాప్‌లో ఎఫ్‌ఐఆర్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే వ్యక్తిగత సమాచారం కోరుతున్నారు. వ్యక్తిగత సమాచారం కోరడం గోప్యత హక్కును హరించడమే. మేం దాఖలు చేసిన రిప్లై కౌంటర్‌లో పేర్కొన్న అంశాలను ప్రతిబింబించేలా తగిన ఆదేశాలివ్వండి’ అని అభ్యర్థించారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘మీరు కోరిన అభ్యర్థనలు పరిష్కరిస్తూ వివిధ వ్యాజ్యాల్లో సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. ఏపీలోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లో కూడా పోలీసుల తీరు ఇలాగే ఉంది. 41ఏ నిబంధనల అమలు విషయంలో పోలీసుల కన్నా న్యాయస్థానాలకే ఎక్కువ బాధ్యత ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రస్తుత వ్యాజ్యంలో కూడా తగిన ఆదేశాలిస్తాం’ అని తెలిపింది.

Advertisement
Advertisement