Abn logo
Sep 27 2021 @ 03:15AM

అటకెక్కిన పర్యాటకం!

పండగలు లేవు.. ఉత్సవాలూ లేవ్‌

ఎక్కడికక్కడ నిలిచిపోయిన ప్రాజెక్టులు

అప్పుల కోసం ఎదురుచూస్తున్న ఏపీటీడీసీ

ఆస్తుల తాకట్టుతో రూ.147 కోట్ల అప్పులు

తూతూ మంత్రంగా ‘టూరిజం డే’ నిర్వహణ

మంత్రి కోసం రెండేళ్లుగా విశాఖలోనే నిర్వహణ


ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకం అటకెక్కింది. రాష్ట్ర విభజన తర్వాత 2019 వరకు ఒక వెలుగు వెలిగిన రాష్ట్ర పర్యాటకం.. ఇప్పుడు పూర్తిగా పడకేసింది. ఫెస్టివల్స్‌ లేవు.. ఉత్సవాల్లో పాల్గొనే పరిస్థితీ లేదు. కొవిడ్‌తో కొంత ఇబ్బంది వచ్చినా.. జగన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మరింతగా పర్యాటక రంగంపై ప్రభావాన్ని చూపాయి. 


ఒకవైపు పాపి కొండలు, మరోవైపు భవానీ ఐలాండ్‌, ఇంకో వైపు అరకులోయ అందాలు.. వేటికవే పర్యాటలను రా.. రమ్మని ఆహ్వానిస్తున్నట్టుగా ఉంటాయి. దీంతో ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు.. ఏపీకి క్యూ కడుతుంటారు. అయితే.. ఇప్పుడు ఆయా పర్యాటక ప్రాంతాలు బోసిపోతున్నాయి. నిర్వహణ లేక, నిధులు సరిపోక ఆకర్షణ కోల్పోతున్నాయి. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర పర్యాటక రంగం కేవలం రాష్ట్రంలోని ప్రజలనే కాకుండా దేశ, విదేశీ పర్యాటకుల్ని సైతం ఆకర్షించడంలో ముందుంది. 2019 వరకు దేశంలోని పర్యాటక రంగంలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఏపీ పర్యాటక శాఖ ఇప్పుడు ఆ స్థాయిని, స్థానాన్ని కూడా కోల్పోయింది. రెండేళ్ల కిందటి వరకు దేశంలో పర్యాటకుల్ని ఆకర్షించడంలో ఉత్తరప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉండేది. ఆ తర్వాత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు రెండో స్థానం కోసం పోటీపడేవి. కొవిడ్‌ కారణంగా పర్యాటకుల రాక తగ్గినా ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల స్థానం పదిలంగానే ఉంది. కానీ, ఏపీ పరిస్థితి దారుణంగా మారింది. రెండేళ్ల నుంచి ఏపీకి వచ్చే పర్యాటకుల సంఖ్య 30 శాతానికి పడిపోయింది. దీనికి ప్రధాన కారణం.. బడ్జెట్‌ కేటాయింపులు తగ్గిపోవడమేనని తెలుస్తోంది. 2018-19లో అప్పటి ప్రభుత్వం పర్యాటక శాఖకు రూ.212 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. తర్వాత సంవత్సరం 2019-20లో రూ.279 కోట్లకు పెంచింది. అయితే.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌.. ఊహించని రీతిలో ఈ బడ్జెట్‌ను కుదించారు. 2020 వరకు రూ.200 కోట్లున్న బడ్జెట్‌ను 2020-21లో రూ.10.50 కోట్లు, 2021-22లో రూ.10.75 కోట్లుగా మార్చారు. దీంతో పర్యాటక అభివృద్ధి కొడిగట్టిందనే వాదన వినిపిస్తోంది. 


గత సర్కారు హయాంలో రూ.200 కోట్లపైన బడ్జెట్‌తో కళకళలాడిన పర్యాటక శాఖని ప్రస్తుత ప్రభుత్వం అప్పుల ఊబిలోకి దించుతోంది. పర్యాటక శాఖ బడ్జెట్‌ని అమాంతం తగ్గించడంతో ఎక్కడి ప్రాజెక్టులు అక్కడ నిలిచిపోయాయి. టెంపుల్‌ టూరిజం అభివృద్ధి కోసం చేపట్టిన ప్రాజెక్టుల పనులు గత రెండేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ కేటాయించిన ‘ప్రసాద్‌ స్కీమ్‌’ నిధులతో చేపట్టిన ప్రాజెక్టుల పనులు మాత్రమే నడుస్తున్నాయి. ప్రస్తుతం ప్రసాద్‌ స్కీమ్‌ను శ్రీశైలం, అన్నవరం, సింహచలం వంటి ప్రధాన ఆలయాలకు సంబంధించిన పర్యాటకాభివృద్ధి పనులకు వర్తింపజేస్తున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం సొంతగా అమరావతి, దుర్గగుడి, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల్లో పర్యాటకాభివృద్ధి పనులు ప్రారంభించింది. కానీ, ఇవ్వన్నీ గత రెండేళ్ల నుంచి నిధులు లేక అల్లాడుతున్నాయి. ఈ ప్రాజెక్టులతో పాటు లంబసింగి, కోటప్పకొండ రోప్‌వే, అరకులో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. 


అంతర్జాతీయ ఖ్యాతి ఏదీ?

ఏపీ టూరిజానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు గత ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. ఇతర దేశాల్లో ఉత్సవాలు, పండగలు నిర్వహించి ఏపీ టూరిజంపై విదేశీ పర్యాటకులకు ఆసక్తి పెంచేది. ప్రత్యేక స్టాల్స్‌ ఏర్పాటు చేసి ఏపీలోని పర్యాటక ప్రాంతాలపై వివరించేవారు. అరకు కాఫీ ఉత్పత్తులు, కొండపల్లి బొమ్మల మార్కెటింగ్‌ వంటి కార్యక్రమాలు నిర్వహించేవారు. 2019లో ఏపీలో నిర్వహించిన ఎఫ్‌1హెచ్‌2వో కార్యక్రమంలో ఏపీ పర్యాటకానికి అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఆ హంగులు, ఆర్భాటాలు కనిపించడం లేదు. 


అప్పు తెచ్చుకో.. పండగ చేసుకో!

ఏపీ టూరిజం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(ఏపీటీడీసీ) పర్యాటక శాఖకు వెన్నుముక. ఏపీటీడీసీ లాభాల బాటలో నడిస్తేనే పర్యాటక శాఖ అభివృద్ధి చెందుతుంది. ఏపీటీడీసీకి లాభాలు వస్తేనే కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు టూరిజానికి అంతర్జాతీయంగా ప్రచారం లభిస్తుంది. అయితే, బడ్జెట్‌ కేటాయింపులు తగ్గిపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఏపీటీడీసీ తీవ్ర నష్టాల్లో నడుస్తోంది. ఇలాంటి సమయంలో పర్యాటకాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఏపీటీడీసీని అదుకోవాలి. కానీ, ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. ఏపీటీడీసీని అప్పుల ఊబిలోకి దించుతోంది. ఆస్తులను తాకట్టు పెట్టి రూ.147 కోట్ల అప్పులు తెచ్చుకోవాలని ప్రోత్సాహిస్తుండడం గమనార్హం. దీంతో పర్యాటకశాఖ ఉన్నతాధికారులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే ఏపీటీడీసీకి చెందిన కొన్ని ఆస్తులు బ్యాంకుల్లో తాకట్టు పెట్టేందుకు పర్యాటకశాఖ సిద్ధమైంది. తొలుత రూ.70 కోట్లు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వచ్చినట్లు సమాచారం. వాస్తవానికి ఇప్పటి వరకు ఏపీటీడీసీ కొత్త ప్రాజెక్టుల కోసం ఆస్తులు సంపాదించడమే తప్ప అప్పుల కోసం ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టిన దాఖలాలు లేవు. వైసీపీ ప్రభుత్వం పుణ్యమా అని ఆస్తులు తాకట్టు పెట్టే స్థాయికి కార్పొరేషన్‌ దిగజారిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


మంత్రి ఇలాకాలోనే టూరిజం డే 

పర్యాటక దినోత్సవం వచ్చిందంటే ప్రతి జిల్లాలో పండగ వాతావరణం కనిపించేది. ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేవారు. అయితే, రెండేళ్ల నుంచి ‘టూరిజం డే’ ఎక్కడ జరుగుతోందో కూడా తెలియని విధంగా చేస్తున్నారు. ఆ శాఖ మంత్రి అవంతి శ్రీనివా్‌సకి అనుకూలంగా ఉంటుందని రెండేళ్ల నుంచి ఆయన సొంత జిల్లా విశాఖలోనే ‘టూరిజం డే’ను నిర్వహిస్తున్నారు. అది కూడా తూతూ మంత్రంగా కానిచ్చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. టూరిజం డేకు నిధుల కొరతే ప్రధాన కారణమని ఉద్యోగులు చెబుతున్నారు. 

క్రైమ్ మరిన్ని...