Abn logo
Sep 20 2021 @ 03:32AM

వాల్మీకి, బోయలకు ఎస్టీ హోదా ఇవ్వాలి

జాతీయ సదస్సులో మాజీ మంత్రి కాల్వ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ర్టాల్లో ఉన్న వాల్మీకి, బోయ కులస్థులను ఎస్టీలుగా గుర్తించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న వాల్మీకి నేతలతోపాటు కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే సహకరించాలని టీడీపీ సీనీయర్‌ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు కోరారు. ఆదివారం ఇక్కడ మహారాష్ట్ర భవన్లో జరిగిన అఖిల భారత వాల్మీకి ప్రతినిధుల సదస్సులో ఆయన మాట్లాడారు. వాల్మీకి, బోయలను ఎస్టీలుగా గుర్తించాలని నాలుగేళ్ల క్రితం తమ నేత చంద్రబాబు కేంద్రాన్ని కోరినప్పటికీ, దీనిపై నేటివరకూ విధాన నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఈ నేపథ్యంలో జాతి జాగృతానికి జాతీయస్థాయిలో ఓ ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు అవసరమని సూచించారు. కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే మాట్లాడుతూ వాల్మీకి సామాజిక వర్గాల్లో అంతరాలుండటం విచారకరమని, వీరికి న్యాయం చేయడానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఏపీ వాల్మీకి, బోయ ప్రతినిధులు త్వరలో తనను కలవాలని సూచించారు. కార్యక్రమంలో చరణ్‌జిత్‌ అత్వాల్‌, సతీశ్‌ జర్కుహొళితోపాటు.. బీజేపీ జాతీయ బీసీ మోర్చా కార్యదర్శి డాక్టర్‌ పి.పార్థసారథి, వాల్మీకి జేఏసీ నేతలు ప్రొఫెసర్‌ జగదీశ్వరరావు, పొగాకు రామచంద్ర పాల్గొన్నారు.