ఎరువుల ధరలు పైపైకి..

ABN , First Publish Date - 2021-09-18T09:41:54+05:30 IST

ఎరువుల ధరలు పైపైకి..

ఎరువుల ధరలు పైపైకి..

నెలనెలా నిలకడ లేకుండా పెరుగుదల

గత నెలతో పోలిస్తే 50-100 అదనం

రాష్ట్రంలో ప్రైవేటు డీలర్లకు తగ్గిన సరఫరా


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

రసాయన ఎరువుల ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఎరువుల తయారీకి వాడే ముడిసరుకుతో పాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడం వలన రేట్లు పెరిగిపోతున్నాయి. గత నెలతో పోలిస్తే ఈ నెల కొన్ని రకాల ఎరువులు బస్తాకు రూ.50 నుంచి రూ.100 వరకు పెరిగాయి. ఎరువుల అమ్మకపు ధరపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్లే కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ సమస్య దేశవ్యాప్తంగా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మరో రకమైన పరిస్థితి నెలకొంది. రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకే)కు ఎరువుల్ని విరివిగా తెప్పించుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రైవేటు డీలర్లకు ఇండెంట్‌ ప్రకారం ఎరువులు సరఫరా చేయడం లేదు. దీంతో యూరియా, డీఏపీ కొరత ఏర్పడుతోంది. ప్రస్తుతం డీలర్ల వద్ద ఈ రకాలు చాలా తక్కువగా ఉన్నాయి. జిల్లాల వారీగా ప్రణాళికల ప్రకారం ఎరువుల సరఫరా జరగడం లేదు. ఆర్బీకేలకు తప్ప.. డీలర్లు డిమాండ్‌ ప్రకారం ఇండెంట్‌ పెట్టినా కంపెనీలు సరఫరా చేయడం లేదు. మరోవైపు యూరియా, డీఏపీ అమ్మితే బస్తాకు రూ.45-60 దాకా నష్టం వస్తోందని కొందరు డీలర్లు స్టాక్‌ లేదంటున్నారు. పలువురు డీలర్లు యూరియా బస్తాకు రూ.100, డీఏపీ బస్తాకు రూ.200 వరకు అదనంగా డిమాండ్‌ చేస్తున్నట్లు రైతుల నుంచి ఆరోపణలున్నాయి. అయితే నష్టాన్ని భరించలేక ఎక్కువ ధరకు అమ్మితే, స్టాక్‌ సీజ్‌ చేయడం, కేసులు పెట్టి జరిమానాలు విధించడం చేస్తున్నారని వ్యాపారులు వాపోతున్నారు. తనిఖీల పేరిట ఒక్క కర్నూలు జిల్లాలోనే ఈ సీజన్‌లో దాదాపు రూ. కోటి విలువైన ఎరువుల అమ్మకాన్ని అధికారులు నిలుపుదల చేశారు. ఈ సమస్యతో డీలర్లు సతమతమవుతుంటే.. ప్రస్తుతం ఆర్థిక సమస్యల కారణంగా రైతులు ఎరువులు అరువుకు తీసుకునే పరిస్థితి ఉండటం లేదు. ఆర్బీకేల్లో సొమ్ము చెల్లిస్తేనే ఎరువులు ఇస్తున్నారు. మార్క్‌ఫెడ్‌ బఫర్‌ స్టాక్స్‌ నుంచి ఆర్బీకేలకు ఎరువులు సరఫరా అవుతున్నందున అక్కడ సమస్య ఉత్పన్నం లేదు. కానీ డీలర్లే సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉదారహణకు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ నెల 14 నాటికి కర్నూలు జిల్లాకు 2,85,990 మెట్రిక్‌ టన్నుల ఎరువులు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 2,49,141 టన్నులు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ ఏడాది ఆ జిల్లాలో విరివిగా వర్షాలు కురవడంతో యూరియా, డీఏపీ వినియోగం ఎక్కువగా ఉంది. కానీ యూరియా 98,410 మెట్రిక్‌ టన్నులకు 70,378 మెట్రిక్‌ టన్నులు మాత్రమే వచ్చింది. డీఏపీ 29,345మెట్రిక్‌ టన్నులకు 24,478 టన్నులు వచ్చింది. ఇదే పరిస్థితి అన్ని జిల్లాల్లో ఉందంటున్నారు. కానీ వ్యవసాయశాఖ అధికారులు  మాత్రం ఎరువుల కొరత లేదని చెబుతున్నారు.




Updated Date - 2021-09-18T09:41:54+05:30 IST