రీసర్వేలో కన్సల్టెంట్లు!

ABN , First Publish Date - 2021-09-18T09:37:42+05:30 IST

రీసర్వేలో కన్సల్టెంట్లు!

రీసర్వేలో కన్సల్టెంట్లు!

ప్రచారం కోసం ఒకరు... పర్యవేక్షణకు మరొకరు 

సొంత వనరులున్నా ప్రైవేటు సేవలకే మొగ్గు 

ఆయా శాఖల్లో సమర్థులున్నా బేఖాతరు 

ప్రభుత్వం నుంచి లక్షన్నర తీసుకుంటున్న వ్యక్తికే బాధ్యత  

కన్సల్టెంట్‌ నియామకానికి స్టీరింగ్‌ కమిటీ ఆమోదం 


పరిశీలన, పర్యవేక్షణకు 2 ఏజెన్సీలు 

రీసర్వే అమలులో ఎదురయ్యే సవాళ్లు, లోపాలు(బాటిల్‌నెక్స్‌), వాటికి తక్షణ పరిష్కారాలు సూచించేందుకు, ఎప్పటికప్పుడు అప్రైజల్‌ నివేదికలు రూపొందించేందుకు రెండు కన్సల్టెన్సీలను ఎంపిక చేసుకోవాలని నిర్ణయించారు. ఇందుకు స్టీరింగ్‌ కమిటీ ఆమోదం తీసుకున్నారు. కానీ అంతకుముందే హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ(ఆస్కీ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్మార్ట్‌ గవర్నమెంట్‌ (ఎన్‌ఎ్‌సఐజీ) నుంచి డీపీఆర్‌లు తీసుకున్నారు. తొలుత ఆస్కీకి ఒక అంశంపై గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పుడు స్టీరింగ్‌ కమిటీతో ఎన్‌ఎ్‌సఐజీ సేవలకు కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇప్పించారు. అయితే రీసర్వే ప్రాజెక్టులు చేసిన అనుభవం ఈ సంస్థకు ఉందా? ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారన్న చర్చ సాగుతోంది. 


భూముల సమగ్ర సర్వేలో మరో కొత్త కోణం. రీసర్వేకి ప్రచారం పేరిట ప్రైవేటు కన్సల్టెంట్లకు రూ.కోట్లు చెల్లించడానికి సర్కారు సిద్ధమైంది. ఇందుకు స్టేట్‌ లెవల్‌ స్టీరింగ్‌ కమిటీతో ఆమోదముద్ర కూడా వేయించేశారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి జీతం, పారితోషికం రూపంలో రూ.లక్షన్నర పొందుతున్న వ్యక్తికే మరింత ముట్టజెప్పేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే ప్రభుత్వ పనికి సొంత అధికారులు సరిపోరా? కన్సల్టెంట్లపై ఉన్న నమ్మకం వారిపై లేదా? అనే ప్రశ్నలు అధికార వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

రీసర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెద్దఎత్తున అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నారు. రూ.కోట్లు ఖర్చుపెట్టి కార్స్‌ టెక్నాలజీని కూడా సమకూర్చుకున్నారు. అయినా కోట్లాది రూపాయలు చెల్లించి ప్రైవేటు కన్సల్టెంట్ల సేవలు పొందేందుకు సర్కారు సిద్ధమైంది. భూముల సమగ్ర సర్వే గురించి బలంగా ప్రచారం చేయాలనుకుంటున్నామనే పేరుతో ప్రైవేటు వ్యక్తిని మీడియా కన్సల్టెంట్‌గా తీసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి జీతం, పారితోషికం రూపంలో లక్షన్నర రూపాయలు పొందుతున్న వ్యక్తికే మరింత డబ్బు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. అలాగే రీసర్వే పర్యవేక్షణ, పరిశీలన, లోపాలను గుర్తించి తక్షణ పరిష్కారాలు చూపడం వంటి సేవల కోసం మరో రెండు కన్సల్టెన్సీలను తీసుకోనుంది. 


అనుభవజ్ఞులను తోసిరాజని... 

సర్వే ఆఫ్‌ ఇండియా(ఎ్‌సవోఐ) సహకారంతో భూముల సర్వేకు గత ఏడాది డిసెంబరులో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ముందస్తు వ్యూహం లేకుండా హడావుడిగా ప్రారంభించిన ఫలితంగా ఇప్పుడు 9నెలల తర్వాత ఈ కార్యక్రమం మొదటికొచ్చింది. ఎస్‌ఓఐ ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని 17వేల గ్రామాల్లో డ్రోన్‌ సర్వేకు కొత్తగా టెండర్లు పిలిచారు. ఇప్పుడు కన్సల్టెన్సీ సేవలను తెరపైకి తెచ్చారు. వాస్తవానికి భూముల సర్వే చేపట్టే బాధ్యత రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్‌ శాఖలది. ఈ మూడు శాఖల్లో కలిపి క్షేత్రస్థాయి సిబ్బందే దాదాపు లక్ష మంది వరకు ఉంటారు. ఐఏఎస్‌, గ్రూప్‌-1, గ్రూప్‌-2, ఇతర అధికారులు ఇందుకు అదనం. ఎలాంటి సమస్యనయినా పరిష్కరించగలిగే సమర్థులైన, అనుభవం ఉన్న అధికారులు పుష్కలంగా ఉన్నారు. ఇదే అంశం గురించి విస్తృత ప్రచారం నిర్వహించడానికి సమాచార శాఖ కూడా ఉంది. పబ్లిసిటీ కార్యక్రమాల రూపకల్పనలో నిపుణులైన అధికారులు ఆ శాఖలో ఎంతోమంది ఉన్నారు. ఈ ప్రత్యామ్నాయాలను తోసిరాజని బంపర్‌ ఆఫర్‌తో ప్రైవేటు కన్సల్టెంట్‌ను తెచ్చిపెట్టుకోవడంలోని ఆంతర్యం ఏమిటని అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇలాంటి అనుభవజ్ఞులను కాదని.... ప్రచారం, పర్యవేక్షణ, పరిశీలన కోసం కన్సల్టెన్సీ సేవలు తీసుకోవాలని రాష్ట్రస్థాయి స్టీరింగ్‌ కమిటీతో ఆమోదముద్ర వేయించారు. అయితే, ఏ పనిని, ఎవరికి అప్పగించాలన్న దానిపై ముందుగానే మౌఖిక ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తోంది. 


ముందస్తు వ్యూహంతోనే... 

రీసర్వే ప్రచారం కోసం కన్సల్టెంట్లను తీసుకోవాలన్న ప్రతిపాదనకు స్టీరింగ్‌ కమిటీ ఆమోదం తెలిపింది. కానీ అంతకుముందే ఓ సర్వే అధికారి తనకు బాగా సన్నిహితుడైన వ్యక్తి నుంచి దరఖాస్తు తెప్పించుకున్నారు. కన్సల్టెంట్‌ పద్ధతిలో నియామకం కాబట్టి రూ.లక్షన్నర వేతనం ఇవ్వాలని దరఖాస్తులో కోరారు. సదరు వ్యక్తి రాజ్‌భవన్‌ సెక్రటేరియట్‌లో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నవారే. ఆయన పేరుకే కన్సల్టెంట్‌... నిర్వహించేది పీఆర్‌వో విధులు. కొలువు రాజ్‌భవన్‌లో... వేతనం తీసుకొనేది గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ మిషన్‌లో. అక్కడ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ హోదాలో 2019 ఆగస్టు నుంచి పనిచేస్తున్నారు. మరో వ్యక్తిని కూడా ఇదే తరహాలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా నియమించారు. గిరిజన ఉప ప్రణాళిక నిధుల నుంచి ఒక్కొక్కరికి నెలకు రూ.1.10లక్షల వేతనం చెల్లిస్తున్నారు. ఈ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా నియమించాలంటే సదరు వ్యక్తి కనీసం అదే పోస్టులో ప్రభుత్వంలో, ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల్లో పనిచేసిన అనుభవం ఉండాలి. బీఈడీతో పాటు పీహెచ్‌డీ పట్టా ఉండాలి. అవేమీ లేకుండానే నాటి గిరిజన శాఖ ముఖ్య అధికారి తన సొంత పని అన్నట్లుగా వారిని భారీ వేతనానికి కన్సల్టెంట్లుగా నియమించుకున్నారు. ఆ తర్వాత వీరిని డిప్యుటేషన్‌పై రాజభవన్‌ సెక్రటేరియట్‌లోకి తీసుకొచ్చారు. ఇందులో పనిచేసే వ్యక్తే రీసర్వే కన్సల్టెంట్‌గా దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు ఎంత జీతం చెల్లించాలన్నదానిపై త్రిసభ్య కమిటీతో పరిశీలన చేయిస్తున్నట్లు తెలిసింది. రీసర్వే కన్సల్టెంట్‌గా ఆయన చేసేపని ఆ ప్రాజెక్టుకు ప్రచారం కల్పించడమే. ఇదే పని చేయడానికి సమాచార శాఖ ఉంది. అందులో సీనియర్‌ అధికారులు ఎంతోమంది ఉన్నారు. వారిని డిప్యుటేషన్‌పై రీసర్వేకు తీసుకుంటే వారి అనుభవం పనికొస్తుంది. రీసర్వే గురించి అవగాహన ఉన్న ఎందరో సీనియర్‌, జూనియర్‌ అధికారులు సర్వే శాఖలోనే ఉన్నారు. వారి సేవలను కూడా ఉపయోగించుకోవచ్చు. ఆ పనెందుకు చేయడం లేదని సర్వే అధికారులు గగ్గోలు పెడుతున్నారు. నిజానికి, ప్రభుత్వ శాఖలో ప్రచార బాధ్యతలు, పీఆర్‌వో విధుల కోసం ఎవరైనా ప్రైవేటు వ్యక్తిని తీసుకోవాలంటే రూ.40 వేలకు మించిన వేతనం ఇవ్వడం లేదు. కాబట్టి వ్యూహాత్మకంగానే వారిని గిరిజనశాఖలో కన్సల్టెంట్ల రూపంలో అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా నియమించారని, ఆర్థికశాఖ నుంచి కొర్రీలు రాకుండా నాటి గిరిజనశాఖ ముఖ్య అధికారి చక్రం తిప్పారని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 


Updated Date - 2021-09-18T09:37:42+05:30 IST