ఏపీ ఎన్జీవో సంఘాన్ని దెబ్బతీసే కుట్ర!

ABN , First Publish Date - 2020-02-24T09:08:24+05:30 IST

ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్ల పక్షాన పోరాడే అతిపెద్ద సంఘమని.. దానిని దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు

ఏపీ ఎన్జీవో సంఘాన్ని దెబ్బతీసే కుట్ర!

  • తప్పుడు ఫిర్యాదులతో ఇటుక కూడా పీకలేరు
  • ఆ వ్యక్తికి సభ్యత్వమే లేదు
  • జీఏడీ అధికారులది అత్యుత్సాహం 
  • మా సంఘం రాజకీయాలకు అతీతం
  • ‘గే’ తాటాకు చప్పుళ్లకు బెదరం
  • కడపలో చంద్రశేఖరరెడ్డి, శ్రీనివాసరావు స్పష్టీకరణ


కడప (కలెక్టరేట్‌), ఫిబ్రవరి 23: ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్ల పక్షాన పోరాడే అతిపెద్ద సంఘమని.. దానిని దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. అయినా ఇటుక కూడా పీకలేరని అన్నారు. సంఘ రాష్ట్ర ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన కార్యవర్గం ఆదివారం కడపలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొంది. ఈ సందర్భంగా నేతలు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘ఏపీ ఎన్జీవోపై అటాక్‌.. సంఘాన్ని ఎందుకు రద్దు చేయొద్దు?’ శీర్షికన వచ్చిన కథనం గురించి ప్రస్తావించగా.. 70 ఏళ్ల క్రితం ఉద్యోగుల హక్కుల కోసం ఉద్యమాలతో ఏపీ ఎన్జీవో సంఘం పుట్టిందని సంఘ నేతలు తెలిపారు. ‘రాజకీయాలకు అతీతంగా ఉద్యోగుల కోసం పనిచేస్తోంది. మా సంఘంలో సభ్యత్వం లేని కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి.. ఎన్జీవో సంఘం నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తోందని, గతంలో తిరుపతిలో జరిగిన కౌన్సిల్‌ సమావేశానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును పిలిచారని, సంఘంపై చర్యలు తీసుకోవాలని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) అధికారులకు ఫిర్యాదుచేశారు. సంఘంలో సభ్యత్వంలేని వ్యక్తి ఫిర్యాదు చేస్తే జీఏడీ అధికారులు అత్యుత్సాహం చూపడం దురదృష్టకరం. వారడిగిన రిమార్కులకు కర్నూలు జిల్లా ఎన్జీవో నేతలు సమాధానమిస్తారు. అయితే ఎన్జీవో సంఘం రద్దు కానుందంటూ బురద జల్లేందుకు గే (గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌) సంఘం కంకణం కట్టుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైన ఇలాంటి సంఘాల తాటాకు చప్పుళ్లకు బెదిరేవాళ్లు లేరు’ అని తేల్చిచెప్పారు. తమ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలకు సంఘం ఏర్పాటు జరిగిన నాటినుంచి దాదాపు 10 మంది ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారని.. ఇది ఆనవాయితీ అని తెలిపారు. త్వరలో జరగనున్న కౌన్సిల్‌ సమావేశాలకు ముఖ్యమంత్రి జగన్‌ను కూడా పిలుస్తామని చెప్పారు. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. 70 ఏళ్ల మర్రి చెట్టులాంటి సంఘమని, వేరు కూడా పీకలేరని కొన్ని సంఘాలకు సవాల్‌ విసిరారు. కాగా, సీఎం జగన్‌ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు తీర్చేందుకు సుముఖంగా ఉన్నారని ఎన్జీవో నేతలు తెలిపారు. ‘రెండు సార్లు కలిశాం. 3 డీఏలతో పాటు పీఆర్సీ గురించి కూడా అడిగాం. ఆయన సానుకూలంగా స్పందించారు’ అని చెప్పారు. 

Updated Date - 2020-02-24T09:08:24+05:30 IST