Simhachalam Video: సింహాచలం అప్పన్న ఆలయంలో అపచారం

ABN , First Publish Date - 2022-05-03T23:37:11+05:30 IST

స్మార్ట్‌ఫోన్స్ అందరికీ అందుబాటులోకి వచ్చాక కొందరు విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు. ఫొటోలు, సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో..

Simhachalam Video: సింహాచలం అప్పన్న ఆలయంలో అపచారం

సింహాచలం: స్మార్ట్‌ఫోన్స్ అందరికీ అందుబాటులోకి వచ్చాక కొందరు విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు. ఫొటోలు, సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అదేదో గొప్ప విషయంగా, ఏదో సాధించినట్టుగా భావిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. సింహాచలం (Simhachalam) అప్పన్న సన్నిధిలో ఇలాంటి అత్యుత్సాహపరులే అపచారం చేశారు. చాలా ఆలయాల్లో గర్భగుడిలోకి కెమెరాలు అనుమతించరు. ఫొటోలు తీయడం నిషేధం. అయితే.. కొందరు ఆలయ భద్రతా సిబ్బంది కళ్లుగప్పి స్మార్ట్‌ఫోన్‌ను లోపలికి తీసుకెళ్లి ఫొటోలు, వీడియోలు తీస్తుంటారు. సింహాచలంలో ఓ ఆకతాయి అదే పని చేశాడు. స్వామి అంతరాలయాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కెమెరాలు, స్మార్ట్‌ఫోన్‌లు అనుమతి లేని అప్పన్న అంతరాలయంలోకి వెళ్లి వీడియో తీయడం, ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేయడంతో పెను దుమారం రేగింది.



భక్తులు ఈ ఘటనపై మండిపడుతున్నారు. ఆ వీడియో (video) తీసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని తగిన బుద్ధి చెప్పాలని.. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు. సింహాచలం ఆలయంలో స్వామివారి చందనోత్సవం (chandanothsavam) జరుగుతున్న రోజే ఇలాంటి ఘటన జరగడంతో ఆలయంలో భద్రతా సిబ్బంది ఏమేరకు పనిచేస్తున్నారో ఈ ఘటనే రుజువు చేస్తోందని భక్తులు మండిపడుతున్నారు. గతంలో తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి కూడా ఒక వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. శ్రీవారి గర్భగుడి ఇదేనంటూ ఆ వీడియో నెట్‌లో చక్కర్లు కొట్టింది. అయితే.. చివరకు తేలిన నిజం ఏంటంటే.. ఆ వీడియో వెంకటేశ్వరస్వామి సినిమా కోసం అచ్చం తిరుమల ఆలయ సెట్ వేసి చిత్రీకరించిన ఒక సీన్ అని తేలింది.



చాలా ఆలయాల్లోకి స్మార్ట్‌ఫోన్స్, కెమెరాలు అనుమతించరు. కానీ.. సింహాద్రి అప్పన్న ఆలయంలోనే ఇలాంటి ఘటన జరిగిందంటే.. కొందరి ఫొటోల పిచ్చి, సోషల్ మీడియాలో తామేదో గొప్ప పని చేశామని చెప్పుకోవాలన్న ఆసక్తి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. దేవుడి గర్భగుడిలోకి పవిత్రంగా వెళ్లి నిర్మలమైన మనసుతో ఆ దేవుడిని దర్శించుకుని ఆలయంలో నుంచి బయటకు రావాలన్న ఆలోచన లేని కొందరు ఇలా అపచారం చేసి ఆలయ పవిత్రతను మంటగలుపుతుండటం దురదృష్టకరం. ఇక మీదటైనా ఇలాంటి ఘటనలు జరగకుండా ఆలయాల్లో భద్రతా సిబ్బంది ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసి, స్మార్ట్‌‌ఫోన్స్, కెమెరాలు లేవని నిర్ధారించుకున్న తర్వాతే ఆలయాల్లోకి అనుమతించాలని భక్తులు కోరుతున్నారు.



Read more