వింటారా విన్నపాలు

ABN , First Publish Date - 2022-03-06T08:29:48+05:30 IST

వింటారా విన్నపాలు

వింటారా విన్నపాలు

కొత్త జిల్లాల కూర్పుపై 8వేల అభ్యంతరాలు

పరిశీలిస్తారా.. బుట్టదాఖలు చేస్తారా?

మన్యం పేరొద్దంటూ భారీగా వినతులు

కందుకూరు, ధర్మవరం డివిజన్ల రద్దుపై భారీగా అభ్యంతరాలు

మండలాల మార్పుపైనా పెద్ద సంఖ్యలో సూచనలు

మండలాలపై కమిటీల వద్దే నిర్ణయం

జిల్లాల పేర్లపై సీఎందే తుది నిర్ణయం


‘‘హేతుబద్ధమైన అభ్యంతరాలను నిశితంగా పరిశీలించాలి. నిర్ణయం తీసుకునే ముందు ప్రజలతో మాట్లాడటం చాలా ముఖ్యం. దీనికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి’’... కొత్త జిల్లాల కూర్పుపై  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులకు ఇచ్చిన ఆదేశం ఇది! మరి నిజంగానే... హేతుబద్ధమైన అభ్యంతరాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటారా? లేక... ‘సొంత’ పంథాలోనే వెళతారా?


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ప్రజలు, ప్రజాప్రతినిధులతో చర్చించలేదు. అఖిలపక్ష సమావేశాలు నిర్వహించలేదు. కనీసం... సొంతంగా ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ నివేదికనూ పరిగణనలోకి తీసుకోలేదు.   జిల్లాలు, రెవెన్యూ డివిజన్లను ఇష్టానుసారంగా ప్రతిపాదించారు. కొన్ని జిల్లాల కేంద్రాల విషయంలో ‘ప్రతి లోక్‌సభ నియోజకవర్గం ఒక కొత్త జిల్లా’ అనే ప్రాతిపదికనూ విస్మరించారు. దీంతో  ప్రజలు భగ్గుమన్నారు. సొంత పార్టీ నుంచీ సెగ తగిలింది. ఈ నేపథ్యంలో... ‘హేతుబద్ధమైన అభ్యంతరాలను పరిశీలించండి’ అని సీఎం గత నెలలో అధికారులకు సూచించారు. కొత్త జిల్లాల ప్రతిపాదనలపై సుమారు 8000 అభ్యంతరాలు, సూచనలు వచ్చాయి. అందులో హేతుబద్ధమైనవి అనేకం ఉన్నాయి.  వాటిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే... జిల్లాల కూర్పులో రెవెన్యూ శాఖ పాత్ర కీలకం. కానీ... అభ్యంతరాల పరిశీలనలో ఆ శాఖ ప్రమేయాన్ని బాగా తగ్గించేశారు. కీలకమైన శాఖలు, విభాగాధిపతులతో సంబంధం లేకుండా... సర్కారుకు ప్రీతిపాత్రమైన అధికారి ఒకరు ఈ మొత్తం వ్యవహారాన్ని తనకు నచ్చిన పద్ధతిలో ముందుకు తీసుకెళ్తున్నారని చెబుతున్నారు. 


మూడు రకాలుగా... 

కొత్త జిల్లాలపై ఫిబ్రవరి 27వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని ప్రభుత్వం తొలుత తెలిపింది. ఆ తర్వాత దీనిని మార్చి 3వరకు పొడిగించింది. ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రజా ప్రతినిధుల నుంచి సుమారు 8వేల సూచనలు/అభ్యంతరాలు అందాయి. వీటిని ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. జిల్లాలు, రెవెన్యూ డివిజన్‌లు, మండలాలు... ఇలా మూడు కేటగిరీలుగా అభ్యంతరాలను క్రోడీకరించారు. సర్కారు ప్రతిపాదించిన జిల్లాలకు తోడుగా... ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, చిత్తూరు జిల్లాలోని మదనపల్లిని కొత్త జిల్లాలుగా ప్రతిపాదించాలని భారీగా వినతులు వచ్చాయి. ఇక, ప్రతిపాదిత జిల్లాల పేర్ల మార్పుపై కూడా పలు డిమాండ్లు,  అభ్యంతరాలు వచ్చాయి. 


జిల్లాలపై అభ్యంతరాలు ఇలా..


‘మన్యం జిల్లా’ పేరును పార్వతీపురంగా మార్చాలని  ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు, ప్రజలు బలంగా కోరుతున్నారు. దీనిపై 70కిపైగా విన్నపాలు వచ్చాయి. మన్యం పేరు ఉంటే జిల్లా మొత్తం గిరిజన జిల్లాగా ముద్రపడిపోతుందని, భూ బదలాయింపు నిరోధక చట్టం (ఎల్‌టీసీ, 1/70 రూల్స్‌) వర్తిస్తుందన్న భయాందోళనలే దీనికి కారణం.

రాయచోటి కేంద్రంగా అన్నమయ్యను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసి... రాజంపేటను కొత్తగా జిల్లాగా ప్రకటించాలని 34కుపైగా వినతులు వచ్చాయి.

రాజంపేట కేంద్రంగానే అన్నమయ్య జిల్లాను కొనసాగించాలని 22 విన్నపాలు వచ్చాయి.

చిత్తూరు జిల్లా మదనపల్లె రెవెన్యూ డివిజన్‌ను ప్రత్యేకంగా ఓ జిల్లాగా ఏర్పాటు చేయాలని 25కు పైనే వినతులు వచ్చినట్లు తెలిసింది. 

నెల్లూరు జిల్లాలోని గూడూరు, నాయుడుపేట డివిజన్‌లను తిరుపతి కేంద్రంగా శ్రీబాలాజీ జిల్లాలో విలీనం చేయాలన్న ప్రతిపాదనలపై 40కిపైగా అ భ్యంతరాలు వచ్చాయి. వాటిని నెల్లూరులోనే కొనసాగించాలని కోరారు.

ప్రస్తుతమున్న కృష్ణా జిల్లా విషయంలో విభిన్నమైన ప్రతిపాదనలు వచ్చాయి.  ఎన్టీఆర్‌ పేరును మచిలీపట్నం జిల్లాకు పెట్టాలన్న సూచనలు వచ్చాయి. కృష్ణాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని రెండు రాజకీయ పార్టీలు కూడా కోరినట్లు తెలిసింది. భోగరాజు పట్టాభి సీతారామయ్య, పింగళి వెంకయ్య పేర్లు కూడా పరిశీలించాలన్న విన్నపాలు వచ్చాయి.


రెవెన్యూ డివిజన్లు...

ప్రకాశం జిల్లా కందుకూరు, అనంతపురం జిల్లా ధర్మవరం రెవెన్యూ డివిజన్లను కొనసాగించాలని భారీగా వినతులు వచ్చాయి. కందుకూరు డివిజన్‌పై వైసీపీ నేతల నుంచే 34 విన్నపాలు వచ్చాయి. ఇందులో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. ఎటపాక డివిజన్‌ను కూడా కొనసాగించాలని కోరారు.  అనంతపురం జిల్లాలో తొలుత కదిరి డివిజన్‌ రద్దుకు ప్రతిపాదించారు. తీవ్ర విమర్శలు రావడంతో ఆ డివిజన్‌ను కొనసాగించాలని, ధర్మవరాన్ని రద్దుచేయాలని నిర్ణయించారు. 


మండలాలు...

మండలాలకు సంబంధించి ఏజెన్సీలోని రంపచోడవరం, ఎటపాకలను పాడేరు హెడ్‌క్వార్టర్‌గా ఉండే అల్లూరి సీతారామ రాజు జిల్లాలో కలపాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇవి రెండూ పాడేరుకు బాగా దూరంగా ఉన్నాయని, వాటిని  తూర్పు గోదావరిలో కలపాలని... అది కుదరని పక్షంలో ఆ రెండు ప్రాంతాలతో కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వచ్చాయి.

కోనసీమ జిల్లాలో భాగంగా ప్రతిపాదించిన మండపేట, రామచంద్రాపురం మండలాలను కాకినాడలో కలపాలని భారీ సంఖ్యలో అభ్యర్థనలు అందాయి. ఆ రెండు మండలాలు అమలాపురానికి దూరంగా ఉన్నాయని, కాకినాడకు దగ్గరగా ఉన్నాయని విన్నపాల్లో పేర్కొన్నారు. 

విశాఖ జిల్లాలో ఉన్న పెందుర్తి మండలాన్ని అనకాపల్లి జిల్లాలో కలపాలన్న ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విశాఖ నగరంలో భాగమైన పెందుర్తిని అనకాపల్లిలో కలపడం ఏమిటంటూ ప్రజలు, పార్టీల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. 

ద్వారకా తిరుమలను తిరిగి ఏలూరు జిల్లాలోనే కొనసాగించాలన్న డిమాండ్‌పై 22 విన్నపాలు వచ్చాయి.

కొత్తవలస మండలం విశాఖకు సమీపంలోనే ఉందని, దానిని విశాఖ జిల్లాలో కలపాలని,  మెంటాడ మండలాన్ని విజయనగరంలోనే కొనసాగించాలన్న అభ్యర్థనలు వచ్చాయి. 


జిల్లాలపై సీఎందే నిర్ణయం

జిల్లాల పేర్లు ఖరారు, కొత్త ప్రతిపాదనలపై తుది నిర్ణయం ముఖ్యమంత్రిదే. మండలాలను డివిజన్‌లలో కలపడంపై అధికారుల కమిటీనే నిర్ణయం తీసుకోనుంది. అయితే, రెవెన్యూ డివిజన్‌ల కొనసాగింపుపై అధికారుల కమిటీ సీఎంకు ఓ నివేదిక ఇవ్వనుంది. దీని ఆధారంగా సీఎం నిర్ణయం తీసుకుంటారా? లేక జనవరిలో ఇచ్చిన ప్రతిపాదనలనే కొనసాగిస్తారా? అన్నది మరి కొద్ది రోజుల్లో తేలనుంది.

Updated Date - 2022-03-06T08:29:48+05:30 IST