‘ఏప్రిల్‌ 2’ విడుదల!

ABN , First Publish Date - 2022-01-28T08:56:07+05:30 IST

‘ఏప్రిల్‌ 2’ విడుదల!

‘ఏప్రిల్‌ 2’ విడుదల!

ఆ రోజు నుంచే అమలులోకి కొత్త జిల్లాలు


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఉగాది పండగ నుంచే కొత్త జిల్లాలు అమలులోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. అంటే.. ఏప్రిల్‌ 2వ తేదీ నుంచే! అటూ ఇటుగా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఈలోపే కొత్త జిల్లాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని పునర్‌వ్యవస్థీకరణ కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలకు సర్కారు దిశానిర్దేశం చేసింది. ఉద్యోగుల సర్దుబాటుపై ఇప్పటికే ఆర్థిక, ప్రణాళిక, సాధారణ పరిపాలన శాఖలు నివేదికలు సిద్ధం చేశాయి. కొత్త జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలను సిద్ధం చేయడమే ప్రధానమైనదని అధికారవర్గాలు చెబుతున్నాయి. 13 జిల్లాల పరిధిలో కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలతోపాటు ప్రతీ శాఖకు ఓ జిల్లా ఆఫీసును సమకూర్చాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వానికి ఆ స్థాయిలో సొంత భవనాలు లేవు. దీంతో అద్దె భవనాలపైనే ఆధారపడాల్సి ఉంటుందని అధికారులు ఇప్పటికే సర్కారుకు నివేదించారు. వీలైనమేరకు కలెక్టరేట్‌తోపాటు ప్రభుత్వ ఆఫీసులన్నీ ఒకే వద్ద ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఇదివరకు సీఎంవో సూచించినట్లు తెలిసింది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే మౌలిక సదుపాయాలు, భవనాల విషయంలో సర్కారుకు ఓ స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వ భవనాల్లోనే కలెక్టరేట్లకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తామని, ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో కొత్తగా భవనాల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని సూచించినట్లు సమాచారం. జిల్లాస్థాయి కార్యాలయాలకు అవసరమైన ఫర్నీచర్‌తోపాటు, మౌలిక సదుపాయాలు అవసరం. వీటికోసం 65 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.


ఐఏఎస్‌... ఐపీఎస్‌...

అన్ని ప్రభుత్వ శాఖలు విధిగా కొత్త జిల్లాలో తన విభాగాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. కొత్తగా 13 మంది కలెక్టర్లు, 26 మంది జాయింట్‌ కలెక్టర్లు ఐఏఎస్‌ కేడర్‌లో అవసరం. స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ కేడర్‌లో మరో 13మంది జేసీలు అవసరం. ఇంకా 13 మంది రెవెన్యూ డివిజనల్‌ అధికారులు కావాలి. డిప్యూటీ కలెక్టర్ల స్థాయిలో మరో 52 మంది కొత్త జిల్లాలకు అవసరమని అంచనావేశారు. ఐపీఎ్‌సల నుంచి 13 మందిని కొత్తగా ఎస్పీలుగా నియమించాలి. ప్రతిపాదిత జిల్లాలపై అభ్యంతరాలు, సూచనలు తెలిపేందుకు ప్రభుత్వం నెలరోజులు గడువు ఇచ్చింది. కలెక్టర్లు ఇచ్చే నివేదికల ఆధారంగానే రెవెన్యూశాఖ తదుపరి నిర్ణయాలు తీసుకుని సవరణ ప్రతిపాదనలను పంపిస్తుం ది. దీనిపై ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకుంటుంది. 


కొత్త పేరు... వాటి తీరు

రాయలసీమలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న నాలుగు జిల్లాల్లో మూడు ‘ఆధ్యాత్మిక’ కేంద్రాలు కావడం విశేషం. తిరుపతి కేంద్రంగా ‘శ్రీబాలాజీ,’ పుట్టపర్తి జిల్లా కేంద్రంగా శ్రీసత్యసాయి, రాయచోటి కేంద్రంగా ‘అన్నమయ్య’ జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. తెలంగాణలో గోండు వీరుడు కొమురం భీమ్‌ పేరిట ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేశారు. ఇక్కడా అదే ఒరవడి కొనసాగించి... శ్రీ అల్లూరి సీతారామరాజు (పాడేరు) పేరుతో ఓ జిల్లాను ఏర్పాటు చేశారని చర్చ జరుగుతోంది.


తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు పేరుతో జిల్లా ఏర్పాటు చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

Updated Date - 2022-01-28T08:56:07+05:30 IST