4 రద్దు.. 14 ఏర్పాటు

ABN , First Publish Date - 2022-01-28T08:51:51+05:30 IST

4 రద్దు.. 14 ఏర్పాటు

4 రద్దు.. 14 ఏర్పాటు

మొత్తంగా 62 రెవెన్యూ డివిజన్లు


అమరావతి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): మొత్తంగా 26 జిల్లాలు...  62 రెవెన్యూ డివిజన్లు! ఇది... సర్కారు ప్రతిపాదించిన రాష్ట్ర స్వరూపం. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో 14 కొత్త రెవెన్యూ డివిజన్లను ప్రతిపాదించారు. ఇప్పటికే అమలులోకి వచ్చిన బద్వేలును కూడా కలిపి... ప్రభుత్వం 15 కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతోంది. ఇక... ఇప్పుడు కొనసాగుతున్న నాలుగు రెవెన్యూ డివిజన్లను తొలగించారు. వెరసి... రాష్ట్రంలో మొత్తం 62 రెవెన్యూ డివిజన్లు ఉంటాయి.  రద్దయిన డివిజన్లలో... ఎటపాక, కుకునూరు, ధర్మవరం, కందుకూరు ఉన్నాయి. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ నుంచి ఏపీలో విలీనమైన ఎటపాక, కుకునూరులను అప్పట్లో డివిజన్‌ కేంద్రాలుగా మార్చారు. ఇప్పుడు ఈ రెండు డివిజన్లలోని మండలాలను ప్రతిపాదిత అరకు,  ఏలూరు జిల్లాల్లోని డివిజన్లలో విలీనం చేశారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా పరిధిలోని ధర్మవరం డివిజన్‌ను రద్దుచేసి... పుట్టపర్తి డివిజన్‌లో విలీనం చేయాలని ప్రతిపాదించారు. 


1. బొబ్బిలి. 2. భీమునిపట్టణం, 2. భీమవరం, 

3. నందిగామ, 4. తిరువూరు, 5. బాపట్ల, 6. చీరాల, 

7. కనిగిరి, 8. ఆత్మకూరు, 9. డోన్‌, 10. గుంతకల్లు, 11. పుట్టపర్తి, 

12. రాయచోటి, 14. పలమనేరు. (గత డిసెంబరులోనే ఏర్పాటైన బద్వేలును కూడా కలిపితే 15 డివిజన్లు అవుతాయి.)


సీమలో 11 జిల్లాలు ఏర్పాటు చేయాలి-సాగునీటి సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి 

రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన అశాస్త్రీయంగా ఉందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి విమర్శించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత జిల్లా కేంద్రాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలను దూరంగా కొత్త జిల్లాలో చేర్చడం, నూతన జిల్లా కేంద్రాలకు సమీపంలో ఉన్న ప్రాంతాలను ప్రస్తుత జిల్లాలోనే కొనసాగించడం సబబు కాదన్నారు. వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి తోడ్పడేలా నూతన జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలో దాదాపు 40 శాతం భూభాగం ఉన్న రాయలసీమలో కనీసం 10 నుంచి 11 జిల్లాలను ఏర్పాటు చేయాలన్నారు. తాగు, సాగునీరు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ ప్రక్రియతో వలసలు శాశ్వతంగా ఆగిపోతాయన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాయలసీమలో ఇప్పుడు ప్రకటించిన జిల్లాలకు అదనంగా ఆదోని, మదనపల్లె, గుంతకల్లు జిల్లాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లాల హద్దుల నిర్ణయంలో రాజకీయ ప్రయోజనాలు కాకుండా, ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

Updated Date - 2022-01-28T08:51:51+05:30 IST