దోపిడీతో ఖజానా ఖాళీ

ABN , First Publish Date - 2022-01-23T09:09:18+05:30 IST

దోపిడీతో ఖజానా ఖాళీ

దోపిడీతో ఖజానా ఖాళీ

ప్రభుత్వ ఉద్యోగులతో ఆడుకుంటున్నారు

ఓటు బ్యాంకు రాజకీయాలు మానేయాలి

లేకుంటే వచ్చే ఎన్నికల్లో మూల్యం చెల్లించక తప్పదు 

సీఎం జగన్‌కు బీజేపీ ఎంపీ అరుణ్‌సింగ్‌ హెచ్చరిక 

పోలీసుల్ని కార్యకర్తల్లా వాడుకుంటున్నారు: సీఎం రమేశ్‌ 

కర్నూలులో కమలనాథుల ప్రజా నిరసన సభ


 కర్నూలు, జనవరి 22(ఆంధ్రజ్యోతి): ‘ఏపీలో బీజేపీ కార్యకర్తలపై జరిగే దౌర్జన్యాలను అడ్డుకునేందుకు దేశంలో 17కోట్ల మంది కార్యకర్తలు అండగా ఉన్నారు. మద్యం, ఇసుక మాఫియాల దోపిడీతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది. ఎన్ని నేరాలు చేసినా ముస్లింలపై చర్యలు తీసుకోవద్దన్న యూపీ మంత్రి అజాంఖాన్‌ జైల్లో ఉన్నారు. బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలు మానకుంటే ఎవరికైనా ఆ పరిస్థితే వస్తుంది. ప్రజల మధ్య ఉంటానని పాదయాత్రలో హామీ ఇచ్చిన జగన్‌ ఇవాళ ప్రజల్నే కాదు కనీసం ఆ పార్టీ ప్రజా ప్రతినిధులను కూడా కలవడంలేదు. మోదీ ప్రభుత్వ పథకాలపై స్టిక్కర్లు అంటించుకుని మీ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు’ అని సీఎం జగన్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అరుణ్‌సింగ్‌ మండిపడ్డారు. హిందూ, ముస్లింలను సమాన స్థాయిలో చూసే మోదీని చూసి జగన్‌ పాలన నేర్చుకోవాలని, లేకుంటే రాబోయే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కర్నూలులో శనివారం జరిగిన ప్రజా నిరసన సభలో ఆయన మాట్లాడారు. ఆత్మకూరులో జనవరి 8న జరిగిన మత విద్వేషాల వివాదంలో వైసీపీ తీరుపై బీజేపీ అధిష్ఠానం సీరియ్‌సగా ఉందన్నారు. బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డిపై కేసులు మోపడాన్ని ఆయన ఖండించారు. తక్షణమే శ్రీకాంత్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆత్మకూరు ఘటన వెనుక పీఎ్‌ఫఐ, ఎస్డీపీఐ పనిచేశాయన్నారు. ఇలాగే ప్రవర్తించిన కారణంగా కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చి పడేసిన విషయం జగన్‌ గుర్తుపెట్టుకోవాలన్నారు. యూపీలో సమాజ్‌వాదీ ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో తెలుసుకోవాలన్నారు. ఏపీలో పింఛన్లు, రేషన్‌ కార్డులు వంటి పలు పథకాలకు కేంద్రం సహకరిస్తుంటే వాటిపై వైసీపీ స్టిక్కర్లు అంటించుకుని ప్రచారం చేసుకుంటోందన్నారు. ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వలేకపోతున్నారని, పెన్షన్లు కూడా సకాలంలో అందించలేకపోతున్నారన్నారు. దేశంలో ఎక్కడైనా పీఆర్సీ పెంచితే జీతాలు పెరుగుతాయని, ఏపీలో మాత్రం వింతగా జీతాలు తగ్గించడం చోద్యంగా ఉందన్నారు. బీజేపీ కార్యకర్తలను హింసించిన ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డిని భగవంతుడు శిక్షిస్తాడన్నారు. తల్లిదండ్రులు పెట్టిన పేరును చెడగొట్టేలా ఆయన వ్యవహరిస్తున్నారని అరుణ్‌సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఈ ప్రభుత్వానికి సమయం దగ్గరపడింది: ఎంపీ సీఎం రమేశ్‌ 

ఏపీలో హిందువులపై ఎలాంటి అరాచకాలు జరిగినా వైసీపీ స్పందించడంలేదని, పోలీసులను ఆ పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటోందని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ ఆరోపించారు. ఆత్మకూరు ఘటన తర్వాత తాము అక్కడకు వెళ్తే 144 సెక్షన్‌ ఉందని, సున్నితమైన అంశం పెద్దదవుతుందని చెప్పి పోలీసులు వెనక్కు పంపారన్నారు. మరి వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషాను ఎలా పంపారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ జగన్‌ మతతత్వ వైఖరిని ఖండిస్తున్నామన్నారు. హిందువుల న్యాయం కోసం ప్రశ్నించిన శ్రీకాంత్‌రెడ్డిపై కేసులు పెట్టించిన సీఎం జగన్‌ ఒక దేశద్రోహి అని విమర్శించారు. కేసినో ఆడిస్తోన్న మంత్రిని తక్షణమే సస్పెండ్‌ చేయాలన్నారు. కర్నూలు వేదికగా సమర శంఖం పూరిస్తున్నామన్నారు.


జైల్‌ భరోకు సిద్ధం: పరిపూర్ణానంద 

సభకు నేరుగా హాజరుకాలేక పోయిన శ్రీ పీఠం పరిపూర్ణానంద స్వామి ఆన్‌లైన్లో మాట్లాడారు. ఆత్మకూరు ఘటనను ఖండిస్తూ సీఎం జగన్‌ను తుగ్లక్‌ సుల్తాన్‌గా అభివర్ణించారు. జగన్‌ పాలనలోకి వచ్చాక దేవాలయాలపై దాడులు, విధ్వంసాలు పెరిగాయని ఆరోపించారు. బీజేపీ తరఫున జైల్‌భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తే శ్రీకాంత్‌రెడ్డికి మద్దతుగా నిలబడి జైలుకు వెళ్లేందుకు కూడా తాను సిద్ధమన్నారు. సభలో రాజ్యసభ ఎంపీ సీఎం రమేశ్‌, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌, ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-23T09:09:18+05:30 IST