Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 23 Jan 2022 03:11:55 IST

విషం చిమ్మే వ్యూహం!

twitter-iconwatsapp-iconfb-icon
విషం చిమ్మే వ్యూహం!

సర్కారు వారి ఉద్యోగుల వ్యతిరేక ప్రచారం

జీతం పెరిగిందంటూ కరపత్రాల ముద్రణ

వలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ

సోషల్‌ మీడియాలోనూ ఉద్యోగులు టార్గెట్‌

పనిచేయని, లంచావతారాలుగా చిత్రీకరణ

వారికెందుకు ఇంత జీతమని ప్రశ్నలు

దీటుగా బదులిస్తున్న ఉద్యోగులు

తప్పుడు ప్రచారం నమ్మొద్దని ప్రజలకు వినతి


(అమరావతి - ఆంధ్రజ్యోతి): ‘మేం ఇచ్చినంత తీసుకోవాలి. మీరు అడిగినంత మేం ఇవ్వం’ అంటున్న వైసీపీ సర్కారు ఉద్యోగులకు వ్యతిరేకంగా వ్యూహాత్మక ప్రచారం ప్రారంభించింది. ఇందుకు వలంటీర్లతోపాటు సోషల్‌ మీడియానూ విస్తృతంగా వాడుకుంటోంది. ‘ఉద్యోగులకు జీతాలు తగ్గవు. పెరుగుతాయి. వాళ్లు అబద్ధాలు చెబుతున్నారు. ప్రజల్లోకి వెళ్లండి. మన వాదన వినిపించండి’ అని స్వయానా ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం తన మంత్రివర్గ సహచరులను ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. ‘ఉద్యోగులు కోరినట్లుగా హెచ్‌ఆర్‌ఏ ఇస్తే, ఏదైనా పథకాన్ని ఆపాల్సి ఉంటుంది’ అని కూడా అన్నారు. వెరసి... ఉద్యోగుల ప్రయోజనాలకు వారి ఇవ్వడం పేదల వ్యతిరేక చర్యగా చిత్రీకరించారు. ఇప్పుడు ఉద్యోగులపై కరపత్రాల యుద్ధం కూడా మొదలైంది. ఉద్యోగులకు కొత్త పీఆర్సీతో జీతాలు ఎలా పెరుగుతాయంటే... అంటూ ఒక పట్టికతో కరపత్రాలు ముద్రించారు. వాటిని వలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంచడం మొదలుపెట్టారు. ఐఆర్‌ కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ ఇచ్చి, హెచ్‌ఆర్‌ఏ తగ్గించి, సీసీఏ ఎత్తివేసినప్పటికీ జీతాలు పెరుగుతాయా? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పడంలేదు. ‘ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న డీఏలను ఒకేసారి కలిపేసి... జీతం పెరిగిందంటే ఎలా? అలా చూసినా జీతం తగ్గుతుందే తప్ప పెరగదు’ అని ఉద్యోగులు చెబుతున్నారు. అయినా సరే... జనవరి 1వ తేదీన తీసుకున్న జీతం, ఫిబ్రవరి 1న తీసుకోబోయే జీతం అంటూ ప్రభుత్వం ఒక కరపత్రాన్ని రూపొందించింది. ‘‘మొత్తంగా జీతాలు పెరుగుతున్నాయా? లేదా? అదే చూసుకోవాలి. బేసిక్‌ పెరగడం ద్వారా అదివరకు అందే గ్రాస్‌ శాలరీకన్నా, పీఆర్సీ తర్వాత అందుతున్న గ్రాస్‌ శాలరీ పెరగడం లేదా? అంటే జీతాలు పెరుగుతున్నాయా, లేవా అనే విషయాన్ని గమనించాలి. కొత్త పీఆర్సీతో జీతాల కోత అవాస్తవం. అడగకపోయినా ఉద్యోగుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్న మాట నిజం కాదా?’’ అని ఈ కరపత్రంలో ప్రశ్నించింది. వీటిని ఇంటింటికీ పంచుతూ... జీతాలు తగ్గాయన్న ఉద్యోగుల వాదనలో నిజం లేదని ప్రచారం చేయాలని వలంటీర్లను ఆదేశించింది.


సోషల్‌ మీడియాలోనూ...

ఉద్యోగులపై బురదజల్లేందుకు సోషల్‌ మీడియాను కూడా వైసీపీ వాడుకుంటోంది. తన సోషల్‌ మీడియా సైన్యాన్ని ఉద్యోగులపైకి ఉసి గొల్పుతోంది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లలో ఉద్యోగులకు వ్యతిరేకంగా భారీగా ప్రచారం జరుగుతోంది. ఉద్యోగులు ఇప్పటికే ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారని, లంచావతారాలని... ఇంకా ఎందుకు జీతాలు పెంచాలని పోస్టులు పెడుతున్నారు. ఇక... టీచర్లను మరింతగా టార్గెట్‌ చేస్తున్నారు. ‘‘టీచర్లు చేసేది ఎమిటి? ఎన్ని సెలవులు? ఎన్ని రోజులు పని చేస్తున్నారు? ఎంత జీతం? రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేసే ఉపాధ్యాయులకు వేతనాల పెంపు ఎందుకు? ప్రభుత్వ టీచర్ల జీతమెంత... ప్రైవేటు స్కూలు టీచర్లకు జీతమెంత?’’ అని ప్రశ్నిస్తున్నారు. ఇక... ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగుల వేతనాలను బహిరంగంగా ప్రదర్శించాలన్నది కొందరి డిమాండ్‌! ఇలా రకరకాల పోస్టులతో ఉద్యోగులను ఆత్మరక్షణలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘ఉద్యోగులూ ఆలోచించండి’ అంటూ ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు చెప్పిన వివరాలతో సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.


అదే అస్త్రం... ఇప్పుడు ఉద్యోగులపైకి!

వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చాక సోషల్‌ మీడియాను రెండు రకాలుగా ఉపయోగించుకుంటోంది. ఒకటి... తాము తీసుకోబోయే నిర్ణయాలకు అనుకూలంగా ముందుగానే ప్రచారం చేయడం. రెండు... గతంలోలాగా తమను వ్యతిరేకించే వారిపై విమర్శలు గుప్పిస్తూ, వారిని ఆత్మరక్షణలోకి నెట్టడం. తాజాగా... సినిమా టికెట్ల వివాదంపైనా ఇలాగే చేశారు. ‘సినిమా వాళ్లు కోట్లు సంపాదిస్తున్నారు కదా! వాళ్లేమైనా సమాజ సేవ చేస్తున్నారా?’ అని దుమ్మెత్తి పోశారు. అమరావతి రైతుల పాదయాత్రపైనా సోషల్‌ మీడియా వేదికగా వ్యతిరేక ప్రచారానికి దిగారు. ఇప్పుడు... ప్రభుత్వ ఉద్యోగులపైనా పడ్డారు.


దీటుగా ఉద్యోగుల అస్త్రాలు...

‘ఉద్యోగులకు జీతాలు తగ్గవు. పెరుగుతాయి’ అంటూ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రకటనలతోపాటు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఉద్యోగులూ దీటుగా స్పందిస్తున్నారు. ‘కొత్త పీఆర్సీతో జీతాలు పెరుగుతాయి అంటున్నారు కదా! మాకు అది వద్దు. ఐదు డీఏలు కలిపేసి... 27 శాతం ఐఆర్‌ ఉన్న పాత జీతమే ఇవ్వండి. డబ్బులు ఆదా చేసుకోండి’ అని చురకలు అంటిస్తున్నారు. కొత్త పీఆర్సీతో తమకు జరిగే నష్టాన్ని లెక్కకట్టి వివరిస్తున్నారు. ‘‘రివర్స్‌ పీఆర్సీ ఇచ్చారు. ఐదు డీఏలు కలిపేసి.. జీతం తగ్గకపోవడమే మహాభాగ్యం అంటున్నారు. గత ప్రభుత్వాలు అందించిన ప్రయోజనాలకూ కోత పెడుతున్నారు. ఇదేం న్యాయం అని అడిగిన మాకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఇది పద్ధతి కాదు’’ అని ఉద్యోగులు ఆక్రోశిస్తున్నారు.


రెచ్చగొట్టడం సరికాదు

‘‘న్యాయంగా దక్కాల్సిన ప్రయోజనాలు, హక్కుల కోసం సమాజంలోని వివిధ వర్గాలు పోరాటాలు చేయడం సహజం. వీరిపై విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రభుత్వం సమాంతర ప్రచారం చేయడం తగదు. ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు. ఉద్యోగులకు, ప్రజలకు మధ్య విద్వేషాలు సృష్టించడం మానుకోవాలి. ప్రభుత్వానికి మేమూ సమాధానం ఇస్తాం. బహిరంగంగానే స్పందిస్తాం!’’       

 - హృదయరాజ్‌, ఏపీ జేఏసీ 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.