చిప్ప కూడా లాక్కుంటున్నాడు

ABN , First Publish Date - 2022-01-23T09:15:48+05:30 IST

చిప్ప కూడా లాక్కుంటున్నాడు

చిప్ప కూడా లాక్కుంటున్నాడు

పూటగడవని పరిస్థితిలో ఓటీఎస్‌ కట్టాలా?

ఎన్నికల సమయంలో ఎందుకు చెప్పలేదు 

అవసరమైతే ‘పైవాడి’తో కూడా మాట్లాడుతా

ఉద్యోగులపై వృద్ధురాలు మండిపాటు

సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌


రాజానగరం, జనవరి 22: ఓటీఎస్‌ బకాయిలు వసూలు చేసేందుకు వచ్చిన ఉద్యోగులకు ఓ వృద్ధురాలు చుక్కలు చూపించింది. ఇల్లు కట్టుకుని పదేళ్లయిందని, ఇప్పుడొచ్చి పదివేలు కట్టాలంటే ఎక్కడి నుంచి తెస్తామని నిలదీసింది. ఎన్నికల సమయంలో ఈ విషయం ఎందుకు చెప్పలేదని ప్రశ్నించింది. ఏరోజు కారోజు కష్టపడితే కాని పూటగడవని పరిస్థితిలో రూ.10 వేలు చెల్లించడం తనవల్ల కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం తోకాడ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. మన్యం సూర్యకాంతం ఇంటికి పంచాయతీ అధికారులు పలుమార్లు వచ్చి ఒత్తిడి చేయడంతో ఆమె ఎదురు తిరిగారు. ఓటీఎస్‌ పేరుతో ఇబ్బందులకు గురిచేయడం తగదంటూ ఆ వృద్ధురాలు అధికారులను నిలదీసినప్పటి వీడియో వైరల్‌ అయింది. ‘‘రూ.10వేలు కట్టాలని ఎన్నికల సమయంలో ఎందుకు చెప్పలేదు? పైవాడు అడుక్కునే వాడి దగ్గర సైతం చిప్పను కూడా లాగేసుకుంటున్నాడు. నిన్న, మొన్న పుట్టినవారికి అమ్మఒడి, బాబొడి.. ఐదు, పది చదువుకున్నవాడికి ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు. ఉద్యోగస్తులకు జీతాలు సులువుగా వచ్చేస్తాయి. కష్టపడేవారికి ఎక్కడి నుంచి డబ్బులొస్తాయి? ఒంట్లో బాగాలేకున్నా ఇంటి తలుపులు తట్టి ఇబ్బందులు పెట్టడం సరికాదు’’ అని ఆమె మండిపడ్డారు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? అని సిబ్బంది ప్రశ్నించారు. అవసరమైతే పైవాడితో కూడా మాట్లాడగలనని ఆమె ఎదురు తిరగడంతో ఉద్యోగులు వెనుతిరిగారు. 


Updated Date - 2022-01-23T09:15:48+05:30 IST