ఆర్టీపీసీఆర్‌ టెస్టులు పెంచండి

ABN , First Publish Date - 2021-11-29T09:05:32+05:30 IST

ఆర్టీపీసీఆర్‌ టెస్టులు పెంచండి

ఆర్టీపీసీఆర్‌ టెస్టులు పెంచండి

కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు తగ్గుముఖం

ఇలాగైతే ఇన్ఫెక్షన్ల వ్యాప్తిపై అంచనాకు రాలేం

‘ఒమైక్రాన్‌’పై అప్రమత్తత అవసరం 

ఆ ఎనిమిది దేశాల నుంచి వచ్చే 

ప్రయాణికుల స్ర్కీనింగ్‌ను కఠినతరం చేయాలి

విదేశీ ప్రయాణికులకు 1 నుంచి కొత్త నిబంధనలు

పరిస్థితిని సమీక్షించాకే.. అంతర్జాతీయ 

విమాన సర్వీసుల పునరుద్ధరణ!

‘ఆఫ్రికా’కు విమానాలు బంద్‌!

యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇటలీ, బెల్జియం,

హాంకాంగ్‌, నెదర్లాండ్స్‌ల్లో ‘ఒమైక్రాన్‌’ కేసులు

అమెరికాలోనూ ఉండొచ్చన్న ఫౌచీ..!

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రయాణ ఆంక్షలు 

ఇజ్రాయెల్‌లో విదేశీయులకు నో ఎంట్రీ

ఆఫ్రికా దేశాలకు అండగా ఉండాలి: బ్లింకెన్‌ 

ప్రయాణాలపై నిషేధం సరికాదు: ఆఫ్రికా దేశాలు


న్యూఢిల్లీ, నవంబరు 28 : కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమైక్రాన్‌’ కలకలం నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఒమైక్రాన్‌ కేసులు వెలుగుచూసిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల స్ర్కీనింగ్‌ను కఠినతరం చేయాలని నిర్దేశించింది. వారిలో ఎవరికైనా కొవిడ్‌ ‘పాజిటివ్‌’ అని తేలితే.. వెంటనే శాంపిళ్లను జన్యుక్రమ విశ్లేషణ (జీనోమిక్‌ సీక్వెన్సింగ్‌) కోసం ఇండియన్‌ సార్స్‌ కరోనా వైరస్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం (ఇన్సాకాగ్‌)కు పంపాలని సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల గత ప్రయాణ వివరాలను సేకరించి తనిఖీ చేయడం కూడా చాలా ముఖ్యమని పేర్కొంది. ఈమేరకు సూచనలతో కూడిన ఓ లేఖను కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాశారు. 


కేంద్రం లేఖలోని వివరాలివీ.. 

రాష్ట్రాలు కొవిడ్‌ కట్టడి చర్యలను పకడ్బందీగా అమలు చేయడంతో పాటు వ్యాక్సినేషన్‌, కొవిడ్‌ పరీక్షలలో వేగాన్ని పెంచాలి. టెస్ట్‌-ట్రాక్‌-ట్రీట్‌- వ్యాక్సినేట్‌ ఫార్ములాకు కట్టుబడి ఉండటంతో పాటు కొవిడ్‌ నిబంధనలను పాటించేలా ప్రజలను చైతన్యపర్చాలి. స్థానికంగా కొవిడ్‌ నిర్ధారణ అయ్యే వారికి సంబంధించిన శాంపిళ్లను కూడా ‘ఇన్సాకాగ్‌’కు పంపించడాన్ని పెంచాలి. కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్‌ పరీక్షలు.. ప్రత్యేకించి ఆర్టీ-పీసీఆర్‌ టెస్టులు బాగా తగ్గాయి. టెస్టులు ఇంతగా తగ్గిపోతే ఇన్ఫెక్షన్‌ వ్యాప్తిరేటు ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడం కష్టతరం అవుతుంది. రాష్ట్రాలు, యూటీలు ఎక్కువగా కొవిడ్‌ కేసులు నమోదవుతున్న హాట్‌ స్పాట్‌లను గుర్తించి, వాటిపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలి. అక్కడి శాంపిళ్లను కూడా ఇన్సాకాగ్‌ ల్యాబ్‌లకు ఎప్పటికప్పుడు పంపాలి. కొవిడ్‌ పాజిటివిటీ రేటును 5 శాతానికి మించకుండా చూడటంతో పాటు కొవిడ్‌ పరీక్షల్లో ఆర్టీ-పీసీఆర్‌ టెస్టుల సంఖ్యను మరింత పెంచేందుకు కృషి చేయాలి. కేంద్రం అందించిన ‘ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ అండ్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ ప్రిపేర్డ్‌నెస్‌’ (ఈఆర్‌సీపీ) 1, 2 ప్యాకేజీలలోని నిధులను రాష్ట్రాలు పొదుపుగా ఖర్చు చేసుకోవాలి. రాష్ట్రాలు, కరోనాకు సంబంధించిన సమాచారాన్ని మీడియా సమావేశాలు, బులెటిన్ల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియపర్చాలి.   


14 రోజుల ప్రయాణ వివరాలు ఇవ్వాల్సిందే.. 

ఒమైక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం సవరించింది. ఇవి డిసెంబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వాటి ప్రకారం.. ఇకపై ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులు గత 14 రోజుల ప్రయాణ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. దీంతోపాటు ప్రయాణానికి 72 గంటల ముందు తీసుకున్న ఆర్‌టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ నివేదిక, స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని ప్రయాణానికి ముందే ‘ఎయిర్‌ సువిధ’ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఐరోపా దేశాలు, బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, బంగ్లాదేశ్‌, బోట్స్వానా, చైనా, మారిషస్‌, న్యూజిలాండ్‌, జింబాబ్వే, సింగపూర్‌, హాంకాంగ్‌, ఇజ్రాయెల్‌ నుంచి వచ్చే వారికి విమానాశ్రయంలోనే తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్‌ పరీక్ష నిర్వహిస్తారు. మరోవైపు డిసెంబరు 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని ఇటీవల తీసుకున్న నిర్ణయంపై కేంద్రం పునరాలోచనలో పడింది. కరోనా వ్యాప్తి స్థితిగతులను సమీక్షించాకే సర్వీసులను పునరుద్ధరించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా నేతృత్వంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. కాగా, ఒమైక్రాన్‌ కేసులున్న దేశాల నుంచి వచ్చే విమాన సర్వీసులను నిషేధించాలని ఢిల్లీ, కర్ణాటక సీఎంలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.గత 24గంటల్లో దేశంలో కొవిడ్‌తో 621 మందిమృతిచెందారు. ఇక దక్షిణాఫ్రికా నుంచి ముంబైకు వచ్చిన ఓ వ్యక్తికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అతడి శాంపిల్‌ను జన్యుక్రమ విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపారు. 


వ్యాక్సిన్ల ప్రభావశీలత తగ్గిపోవచ్చు: ఎయిమ్స్‌ 

కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌లోని 30కిపైగా ఉత్పరివర్తనాలు (మ్యుటేషన్లు).. మానవ రోగ నిరోధక వ్యవస్థను తప్పించుకునే సామర్థ్యాన్ని దానికి అందించే ముప్పు ఉందని ఢిల్లీ ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా హెచ్చరించారు. ఆ వేరియంట్‌పై వ్యాక్సిన్లు ఎంతమేర పనిచేస్తున్నాయనే అంశాన్ని శాస్త్రీయ అధ్యయనాల ద్వారా నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైర్‌సలోని కీలక భాగమైన స్పైక్‌ ప్రొటీన్‌లో పెద్దసంఖ్యలో ఉత్పరివర్తనాలు జరగడంతో.. వ్యాక్సిన్ల ప్రభావశీలత తగ్గిపోవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  

Updated Date - 2021-11-29T09:05:32+05:30 IST