గరిష్ఠ ఉత్పత్తి చేయండి

ABN , First Publish Date - 2021-10-24T08:10:47+05:30 IST

గరిష్ఠ ఉత్పత్తి చేయండి

గరిష్ఠ ఉత్పత్తి చేయండి

థర్మల్‌ విద్యుత్కేంద్రాల్లో తగినన్ని బొగ్గు నిల్వలు ఉంచుకోండి

లేకుంటే గ్రిడ్‌పై భారం పడుతుంది

కరెంటు ధరలూ పెరిగే అవకాశం 

రాష్ట్రాలకు కేంద్ర ఇంధన శాఖ లేఖ 


అమరావతి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): థర్మల్‌ విద్యుత్కేంద్రాలన్నీ పూర్తి సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేయాలని రాష్ట్రాలకు కేంద్ర ఇంధన శాఖ ఆదేశాలు జారీ చేసింది. గరిష్ఠ స్థాయిలో ఇంధనోత్పత్తి జరిగేలా బొగ్గు నిల్వలను ఉంచుకోవాలని స్పష్టం చేసింది. పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేయకుంటే గ్రిడ్‌పై భారం పడుతుందని హెచ్చరించింది. ఇలాంటి ఉపద్రవం ఎదురుకాకుండా రాష్ట్రాల లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్లు తగు చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చింది. గ్రిడ్‌పై భారం పడి దెబ్బతింటే దాని ప్రభావంతో కరెంటు ధరలు ఆకాశాన్ని అంటుతాయని హెచ్చరించింది. రాష్ట్రాల ఇంధన శాఖలకు, జెన్కో సీఎండీలకు ఈ మేరకు ఆదేశించింది. ఈ నెల 20వ తేదీన రాష్ట్రాల ఇంధన శాఖలకు కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఘనశ్యామ్‌ ప్రసాద్‌ లేఖ రాశారు. దేశీయంగా విద్యుత్తు సంక్షోభం నెలకొన్నప్పటికీ థర్మల్‌ విద్యుత్కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తిని చేపట్టడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యుదుత్పత్తికి సంబంధించి ఈ నెల 10వ తేదీన మార్గదర్శకాలు జారీ చేశామని, వాటిని ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్రాలను కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ ప్రశ్నించింది. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు తమ థర్మల్‌ విద్యుత్కేంద్రాల్లో పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తిని చేయ డం లేదని.. ఇంకొన్నింటిని ఉత్పత్తి చేయకుండా ఉదాసీనంగా వదిలేశాయని ఆక్షేపించింది. కేంద్ర ఇంధన సంస్థ(సీఈఏ) సూచనల మేరకు ఇంధనోత్పత్తి చేయకుంటే.. దాని ప్రభావం డిమాండ్‌-సప్లయ్‌ మీద పడుతుందని హెచ్చరించింది. డిమాండ్‌ పెరిగి సప్లయ్‌ తగ్గితే విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలగడమే కాకుండా, ధరలూ అమాంతం పెరిగిపోతాయంది. 2016 విద్యుత్తు టారిఫ్‌ పాలసీ మేరకు పూర్తి సామర్థ్యంతో ఉత్ప త్తి జరగాల్సిందేనని స్పష్టం చేసింది. ఇప్పటికీ కొ న్ని రాష్ట్రాల థర్మల్‌ విద్యుత్కేంద్రాల్లో తగినన్ని బొ గ్గు నిల్వలు ఉంచుకోకపోవడం వల్ల నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేయడంలో విఘాతం కలుగుతోందని పేర్కొంది. విద్యుత్కేంద్రాలు తగునన్ని బొగ్గు నిల్వలు ఉంచుకోవాలని.. దేశీయ బొగ్గుతో 15 శాతం వరకూ విదేశీ బొగ్గును మిళితం చేసుకోవచ్చని కూడా సూచించింది.

Updated Date - 2021-10-24T08:10:47+05:30 IST