అప్పు, సంక్షేమంపై శ్వేతపత్రం విడుదల చేయాలి: యనమల

ABN , First Publish Date - 2021-10-18T07:20:37+05:30 IST

అప్పు, సంక్షేమంపై శ్వేతపత్రం విడుదల చేయాలి: యనమల

అప్పు, సంక్షేమంపై శ్వేతపత్రం విడుదల చేయాలి: యనమల

తుని, అక్టోబరు 17: ‘‘వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్లలో అప్పు ఎంత చేశారో, సంక్షేమానికి ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. నా 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వాన్ని దేశంలో ఎక్కడా చూడలేదు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని చూస్తున్నా. సీఎం జగన్‌ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం దివాలా తీయడంతోపాటు అభివృద్ధి లేకుండా పోయింది’’ అని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పులు పెంచడంపై ఉన్న శ్రద్ధ రాష్ర్టానికి ఆదాయం పెంచడంలో లేదన్నారు. ప్రభుత్వం తెస్తున్న అప్పులకు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు పొంతనలేదన్నారు. సంక్షేమ పథకాలు 10 మందికి ఇచ్చి 100 మందికి ఇచ్చినట్లు డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. పేదలకు ఒక రూపాయి ఇచ్చి, వారి నుంచి రూ.5 వసూలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం, అమ్మేయడంవల్ల భవిష్యత్‌లో చాలా ఇబ్బందులు ఉంటాయన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగిత పెరిగిందని వివరించారు. సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్యోగులు, దళితులు డిమాండ్‌ చేస్తున్నారన్నారు. కొవిడ్‌ నిబంధనలు కారణంగా రాజకీయ పార్టీలు, ప్రజలు రోడ్లపైకి రావడం లేదన్నారు. వైసీపీ విధానాలపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. వారంతా రోడ్లపైకి వచ్చి జగన్‌ నిర్ణయాలను తప్పుపట్టే రోజులు ఆసన్నమయ్యాయని యనమల స్పష్టం చేశారు. 

Updated Date - 2021-10-18T07:20:37+05:30 IST