స్మారక కేంద్రంగా ‘దామోదరం’ ఇల్లు

ABN , First Publish Date - 2021-10-18T07:18:20+05:30 IST

స్మారక కేంద్రంగా ‘దామోదరం’ ఇల్లు

స్మారక కేంద్రంగా ‘దామోదరం’ ఇల్లు

మాజీ సీఎం సేవలకు గుర్తుగా ఏర్పాటు..

కోటితో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తాం

సంజీవయ్య విలక్షణ నాయకుడు: పవన్‌ 


కర్నూలు (న్యూసిటీ), అక్టోబరు 17: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దివంగత దామోదరం సంజీవయ్య సేవలకు గుర్తుగా ఆయన ఇంటిని స్మారక కేంద్రంగా మారుస్తామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. కర్నూలు సమీపంలో పెద్దపాడు గ్రామంలోని సంజీవయ్య ఇంటిని స్మారక కేంద్రంగా మార్చేందుకు రూ.కోటితో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. సమతావాదులు, ప్రజాసేవకులు నిత్యం స్మరించుకోవాల్సిన విలక్షణ నాయకుడని ఆదివారం ఒక ప్రకటనలో కొనియాడారు. కవి, రచయిత అయిన ఆయన తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో అనర్గళంగా ఉపన్యసించేవారని పేర్కొన్నారు. మాతృభాష తెలుగుపై ఆయనకు మక్కువ అని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరపాలని నిర్దేశించి అమలు చేశారని గుర్తు చేశారు. సామాజికంగా వెనుకబడిన బోయలు, కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఇతర అనుబంధ కాపు కులాలను వెనుకబడిన జాబితాలో చేర్చి వారి అభ్యున్నతికి పాటుపడ్డారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన అణగారిన వర్గాలకు చెందిన తొలి నాయకుడిగా కీర్తిగడించారని ప్రశంసించారు. సంజీవయ్య చనిపోయేనాటికి ఆయన ఆస్తులు రూ.17 వేల నగదు, ఒక పాత ఫియట్‌ కారు ఉన్నాయన్నారు. సంజీవయ్యను నిత్యస్మరణీయుడని, ఆయన సేవలకు గుర్తుగా ఆయన ఇంటిని స్మారక చిహ్నంగా మార్చాలని జనసేన సంకల్పించిందని పవన్‌ పేర్కొన్నారు.

Updated Date - 2021-10-18T07:18:20+05:30 IST