మృగాడిని మట్టుబెట్టారు!

ABN , First Publish Date - 2021-10-18T07:30:54+05:30 IST

మృగాడిని మట్టుబెట్టారు!

మృగాడిని మట్టుబెట్టారు!

వివాహితపై అత్యాచారానికి యత్నం

ప్రతిఘటించిన ఆమెను గొంతు కోసి హత్య

ఆగ్రహంతో అతడిని పోలీసుల సమక్షంలోనే చితకబాది చంపేసిన గ్రామస్థులు

ఘటనా స్థలంలో స్పృహతప్పిన ఎస్సై

ప్రకాశంలో ఘటన.. మృతుడు నాటు వైద్యుడు

మందులు ఇస్తానని మహిళను ఇంటికి పిలిచి ఘోరం


జరుగుమల్లి(కొండపి), అక్టోబరు 17: అతను నాటు వైద్యుడు. తన వద్ద చికిత్స కోసం వచ్చిన మహిళపై కన్నేశాడు. ఆమెకు మందులు ఇస్తానని చెప్పి ఇంటికి పిలిచి లైంగిక దాడికి ప్రయత్నించాడు. ప్రతిఘటించడంతో కత్తితో గొంతు కోసి కడతేర్చాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆగ్రహంతో రగిలిపోయి.. పోలీసులు చూస్తుండగానే.. అతడిని కర్రలతో చితకబాది చంపేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లిలో ఆదివారం జరిగింది. కామేపల్లి గ్రామానికి చెందిన మహిళ(40) కాళ్లు, కీళ్లనొప్పులతో బాధపడుతోంది. ఈ గ్రామంలోనే భూత, నాటువైద్యుడిగా గుర్తింపు పొందిన తన్నీరు ఓబిశెట్టి(60) ఉరఫ్‌ ఓబయ్య వద్ద కొంతకాలంగా ఆమె చికిత్స చేయించుకుంటోంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మందులు ఇస్తానంటూ ఓబిశెట్టి ఇంటికి పిలిచాడు. వైద్యుడి మాటలు నమ్మిన ఆమె అతని ఇంటికి వెళ్లింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఓబిశెట్టి.. ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఈ ఘటనతో ఉలిక్కిపడిన మహిళ.. తేరుకుని ఓబిశెట్టిని ప్రతిఘటించింది. ఈ క్రమంలో ఓబిశెట్టి ఆమె గొంతుకోసి చంపేశాడు. ఆ సమయంలో మహిళ పెద్దగా కేకలు వేసినా.. ఓబిశెట్టి భూతవైద్యం చేస్తున్నాడనుకొని చుట్టుపక్కల వారు పట్టించుకోలేదు. సాయంత్రం ఆరు, ఆరున్నర సమయంలో మహిళను చంపేసిన ఓబయ్య, రాత్రి 8 గంటల వరకు మృతదేహంతో ఇంట్లోనే ఉండి ఆ తర్వాత బయటకు వచ్చాడు. కంగారుగా ఇంటిచుట్టూ తిరుగుతుండటంతో గమనించిన ఓ బాలిక.. తన సోదరుడి సహాయంతో జరుగుమల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. 

బలగాలు వచ్చేలోపే!

ఘటనా స్థలానికి చేరుకున్న జరుగుమల్లి ఎస్‌ఐ రజియా సుల్తానా ఓబయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఈ లోగా అక్కడికి చేరుకున్న స్థానికులు, సదరు మహిళ భర్త, కుమారులు, బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇంతలో గ్రామస్థులు పోలీసుల అదుపులో ఉన్న ఓబయ్యపై దాడికి పాల్పడ్డారు. ఎస్‌ఐ, ఇతర సిబ్బంది నిలువరించినా గ్రామం యావత్తు మూకుమ్మడిగా రావడంతో వారిని అదుపు చేయలేకపోయారు. అదనపు బలగాలకు ఫోన్‌ చేయగా వారు వచ్చేలోపే గ్రామస్థులంతా ఓబిశెట్టిని కర్రలతో కొట్టి చంపేశారు. కళ్లముందే జరిగిన సంఘటనతో ఖిన్నురాలైన ఎస్‌ఐ రజియా సుల్తానా సంఘటనా స్థలంలోనే స్పృహతప్పి పడిపోయారు. సింగరాయకొండ సీఐ ఎం. లక్ష్మణ్‌  అదనపు బలగాలతో కామేపల్లి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఘటనా స్థలంలో మహిళ మృతదేహం ఉన్న స్థితిని బట్టి.. ఓబయ్య ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటాడని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-10-18T07:30:54+05:30 IST