పాఠ్యపుస్తకాల కొరత రానీయొద్దు

ABN , First Publish Date - 2022-08-13T08:54:12+05:30 IST

పాఠ్యపుస్తకాల కొరత రానీయొద్దు

పాఠ్యపుస్తకాల కొరత రానీయొద్దు

పీడీఎఫ్‌ రూపంలో అందుబాటులో ఉంచండి

పాఠశాలల నిర్వహణకు ప్రత్యేకాధికారి: సీఎం జగన్‌


అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): పాఠ్యపుస్తకాల కంటెంట్‌ను పీడీఎఫ్‌ ఫైళ్ల రూపంలో అందరికీ అందుబాటులో ఉంచాలని విద్యాశాఖ అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. దీనివల్ల అందరికీ సులభంగా పుస్తకాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రభుత్వేతర పాఠశాలల్లో వివరాలు తీసుకుని సరఫరా చేయాలన్నారు. ఎక్కడా పాఠ్యపుస్తకాలు కొరత రానీయొద్దని ఆయన స్పష్టంచేశారు. పాఠశాల విద్యపై శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. నాడు-నేడు కింద పనులు పూర్తిచేసుకున్న పాఠశాలల్లో నిర్వహణ కోసం ఎస్‌వోపీ రూపొందించాలన్నారు. పాఠశాలల నిర్వహణ బాధ్యతను ఓ ప్రత్యేకాధికారికి అప్పగించాలని ఆదేశించారు. నిర్వహణ అంశాలపై ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ కూడా రూపొందించాలని సూచించారు. వచ్చే ఏడాది జగనన్న కానుక పంపిణీకి ఇప్పటినుంచే సన్నద్ధం కావాలన్నారు. ఏప్రిల్‌ నాటికే విద్యాకానుకలో అందించే వాటిని సిద్ధం చేయాలన్నారు. ఎనిమిదో తరగతి పిల్లలకు ఇవ్వదలచిన ట్యాబ్‌లకు టెండర్లు ఖరారు చేయాలన్నారు. అన్ని స్కూళ్లల్లోనూ ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాలని ఆదేశించారు. రక్షణ, భద్రత, ఆరోగ్యంపై పాఠశాలల్లో విద్యార్థినులకు అవగాహన కల్పించాలని సూచించారు. మహిళా పోలీసు, ఏఎన్‌ఎం తరచూ పాఠశాలలను సందర్శించి అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలపై కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు ఓ ఉపాధ్యాయురాలిని నియమించాలన్నారు. సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ సమీర్‌ శర్మ, పాఠశాల విద్య కార్యదర్శి రాజశేఖర్‌, కమిషనర్‌ ఎస్‌.సురేశ్‌ కుమార్‌, పాఠశాల విద్య సలహాదారు ఎ.మురళి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-13T08:54:12+05:30 IST