దేశమంతా మీవైపే చూస్తుంది

ABN , First Publish Date - 2022-08-13T08:27:57+05:30 IST

దేశమంతా మీవైపే చూస్తుంది

దేశమంతా మీవైపే చూస్తుంది

నగ్న వీడియో వివాదంలో చిక్కుకున్న మాధవ్‌కు 500 కార్లతో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లా? 

విజయమ్మ కారు ప్రమాదంపై సీఎం స్పందించాలి

ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చాలి: రఘురామ


న్యూఢిల్లీ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ‘‘రాజ్యాంగాన్ని అనుసరించాలని చెప్పినందుకు నన్ను దేశద్రోహిగా చిత్రీకరించి, కాళ్లు కట్టేసి కొట్టారు. కానీ.. నగ్న వీడియో వివాదంలో చిక్కుకున్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు మా పార్టీ నేతలు 500 కార్లతో భారీ ఊరేగీంపుగా స్వాగతం పలికి తీసుకెళ్లాలని ఏర్పాట్లు చేయాలనుకుంటారా? ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి.. అభినందనలు.. ఇలాగే ప్రోత్సహించండి. దేశమంతా మన వైపే చూస్తుందని సీఎం జగన్‌ తరచూ చెబుతుంటారు. ఈ రకంగా ప్రోత్సహించడం ద్వారా దేశమంతా ఇప్పుడు మీ వైపే చూస్తుంది’’ అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియోపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రతిష్టాత్మక ప్రైవేటు పరిశోధన కేంద్రానికి పంపి నివేదికను తెప్పించాలని సూచించారు. ప్రతిపక్షాలు ప్రైవేటు పరిశోధన కేంద్రా న్ని ఆశ్రయించి నివేదిక తెప్పించాలని, లేదంటే తానే నివేదిక తెప్పిస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై రూ.2000 కోట్ల ట్రూఅప్‌ చార్జీల భారాన్ని మోపేందుకు సిద్ధమైందని తెలిపారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విద్యుత్‌ చార్జీల పెంపును నిరసిస్తూ జగన్‌ మాట్లాడిన వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఇప్పుడు మనం చేస్తున్నది ఏమిటని నిలదీశారు. విజయమ్మ కారు ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్‌ వెంటనే స్పందించాలన్నారు. ఒకేసారి రెండు టైర్లు పగిలిపోవడం ఏంటని, ఈ కుట్ర వెనుక ఎవరు ఉన్నది తేల్చాలని డిమాండ్‌ చేశారు.


రాష్ట్రపతితో రఘురామ భేటీ 

‘‘ప్రాథమిక విద్య మాతృభాషలో కొనసాగించేలా చూడాలని పార్లమెంటులో కోరినందుకు నాపై అనర్హత వేటు వేయాలని చూశారు. వాళ్ల ఎత్తులు ఫలించక కేసులు పెట్టి, కాళ్లు కట్టేసి చితక్కొట్టారు’’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూకు రాసిన లేఖలో రఘురామ వివరించారు. శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మూతో రఘురామ కుటుంబ సభ్యులతో కలసి భేటీ అయ్యారు. 20 నిమిషాల పాటు మాట్లాడేందుకు సమయం ఇచ్చిన రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు. 

Updated Date - 2022-08-13T08:27:57+05:30 IST