‘హర్‌ ఘర్‌ తిరంగా’ను విజయవంతం చేయండి: సీఎస్‌

ABN , First Publish Date - 2022-08-13T08:02:23+05:30 IST

‘హర్‌ ఘర్‌ తిరంగా’ను విజయవంతం చేయండి: సీఎస్‌

‘హర్‌ ఘర్‌ తిరంగా’ను విజయవంతం చేయండి: సీఎస్‌

అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ మేరకు శుక్రవారం విజయవాడలోని సీఎస్‌ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటిపైనా, భవనంపైన జాతీయ జెండా ఎగరాలని చెప్పారు. గత వారం రోజులుగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను సీఎస్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా రజత్‌భార్గవ 12 నుంచి 15వ తేదీ వరకూ చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. కాగా, ఈ నెల 15న విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని సమీర్‌శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రొటోకాల్‌ విభాగం సంచాలకులు సుబ్రహ్మణ్యంరెడ్డి మాట్లాడుతూ.. వివిధ శాఖల వారీగా చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. సమాచార కమిషనర్‌ విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై 15 శకటాల ప్రదర్శనను ఈ వేడుకల్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2022-08-13T08:02:23+05:30 IST