సీమ కాలువల్లో కన్నీటి ప్రవాహం..!

ABN , First Publish Date - 2022-08-13T08:19:00+05:30 IST

సీమ కాలువల్లో కన్నీటి ప్రవాహం..!

సీమ కాలువల్లో  కన్నీటి ప్రవాహం..!

పంట కాలువల తవ్వకాల్లో అంతులేని జాప్యం

హామీ ఇచ్చి గాలికొదిలేసిన ముఖ్యమంత్రి జగన్‌ 

ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాని గాలేరు-నగరి, హంద్రీ-నీవా

గండికోట నింపినా అదనంగా ఒక్క ఎకరాకూ నీరివ్వని వైనం

గద్దెనెక్కే ముందు, తర్వాత ఎన్నెన్నో హామీలిచ్చిన జగన్‌

పడకేసిన గాలేరు-నగరి.. చాలా పనులు ఆపేస్తూ జీవోలు

‘రివర్స్‌’ టెండర్లు వైసీపీ నేతలకే అయినా పురోగతి అంతంతే 

సర్వరాయసాగర్‌ నుంచి సాగునీరు ఇవ్వరు.. భారతి సిమెంట్‌కు 

తరలింపు.. ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల చేపల చెరువులకూ..


‘‘రాయలసీమలో నీళ్లు పారిస్తా. శ్రీశైలం జలాశయం ఎగువన సిద్ధేశ్వరం అలుగు నిర్మిస్తా. సుంకేసుల జలాశయం ఎగువన 20 టీఎంసీల సామర్థ్యంతో తుంగభద్రపై గుండ్రేవుల జలాశయం పూర్తి చేస్తా. హంద్రీ నీవా కాలువకు సమాంతరంగా 10 వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో మరో కాలువ తవ్విస్తా. హంద్రీ నీవా ప్రాజెక్టు ఫేజ్‌-2 పనులు పూర్తి చేస్తా! కడప జిల్లాలో గండికోట దిగువన 20 టీఎంసీల సామర్థ్యంతో దేనపల్లి జలాశయం నిర్మిస్తా!’’..జగన్‌ పలు సందర్భాల్లో ఇచ్చిన హామీలు ఇవి! రాయలసీమ ఆయన సొంతగడ్డ అయినా ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటీ నెరవేరలేదు. ఈ మూడేళ్లలో ఒక్క ఎకరాకూ అదనంగా నీరు అందలేదు!


 (కర్నూలు-ఆంధ్రజ్యోతి)

రాయలసీమ ప్రాజెక్టులపై పాదయాత్ర సందర్భంగా, ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నేతగా, అధికారం చేపట్టాక ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పలు హామీలు ఇచ్చారు. కొన్ని ప్రాజెక్టులు కార్యరూపం దాల్చినా నిధులు లేక పడేశాయి. పలు ప్రాజెక్టులు హామీలుగానే మిగిలిపోయాయి. రాయలసీమ అంటేనే గుర్తుకొచ్చేది కరువు.. దుర్భిక్షం. ఎడారిని తలపించే పంట చేలు.. కబేళాలకు తరలిపోతున్న మూగజీవాలు. పిల్లాజెల్లతో మూటాముల్లే సర్దుకుని సుగ్గిబాటన సాగిపోయే మట్టిమనుషుల జీవన చిత్రాలు. ఈ పరిస్థితి మార్చాలనే సంకల్పంతో కృష్ణా జలాలు కరువు పల్లెకు మళ్లించాలని ఎన్టీఆర్‌ శ్రీశైలం జలాశయం ఎగువన పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌, తెలుగుగంగ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. తర్వాతి ప్రభుత్వాలు గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులు చేపట్టాయి. రూ.వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేశాయి. కానీ ఏళ్లు గడుస్తున్నా ప్రధాన కాలువలు, పంట కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు తవ్వకపోవడంతో కన్నీళ్లతో మెట్ట పొలాలు తడపాల్సిన దుస్థితి. రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన్‌ ద్వారా కాలువల సామర్థ్యం పెంపు.. కొత్తగా ఎత్తిపోతల ప్రాజెక్టులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినా.. క్షేత్రస్థాయిలో బీడు పొలాలను తడిపే పంట కాలువలు, అసంపూర్తి పనులు వదిలేసి భారీ ప్రాజెక్టులు చేపట్టడంలోని ఆంతర్యమేంటి..? సీమ కరువు శాశ్వత నివారణకు భారీ ప్రాజెక్టులు అవసరమే.. అదే క్రమంలో అసంపూర్తి కాలువలపైనా దృష్టి సారించాలి కదా!


గాలేరు-నగరి పనులు అంతంతే..

కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగు నీరు.. 640 గ్రామాలు, పలు పట్టణాల్లోని 5.50 లక్షల జనాభాకు తాగునీటి లక్ష్యంగా 2004-05లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు చేపట్టింది. సీఎం జగన్‌ సొంత జిల్లా కడపలోనే సుమారు లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. శ్రీశైలం జలాశయం ఎగువన పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 38 టీఎంసీల కృష్ణా వరద జలాలు తీసుకునేలా డిజైన్‌ చేశారు. కర్నూలు జిల్లాలో ఫేజ్‌-1 పనులకు రూ.6,448 కోట్లు ఖర్చు చేసినా అవుకు ట్విన్‌ టన్నెల్స్‌లో ఓ టన్నెల్‌ నేటికీ అసంపూర్తిగా ఉంది. కడప, చిత్తూరు జిల్లాల్లో ఫేజ్‌-2 కింద రూ.2,189 కోట్లతో ప్రధాన, పంట కాలువలు, జలాశయాల పనులు 14 ప్యాకేజీలుగా చేపట్టారు. పాలకుల్లో లోపించిన చిత్తశుద్ధి.. కాంట్రాక్టర్ల అలసత్వం.. భూ సేకరణలో జాప్యం.. వెరసి పురోగతి పడకేసింది. ప్యాకేజీ-3 కాంట్రాక్టరు మినహా మిగిలిన కాంట్రాక్టు సంస్థలు చేతులెత్తేశాయి. 2018-19లో ఆనాటి సీఎం చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ ప్రతిపాదనలు తయారు చేస్తే అంచనా విలువ రూ.3,177.34 కోట్లకు చేరింది. అందులో ప్యాకేజీ-1, 2 పనులకు టెండర్లు పిలిచారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ కుటుంబానికి చెందిన రిత్విక్‌ సంస్థ పనులు దక్కించుకుంది. 2019 మేలో అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం టెండర్లు రద్దు చేసింది. అదే ఏడాది డిసెంబరులో రివర్స్‌ టెండర్లు పిలిచింది. రూ.391 కోట్లతో చేపట్టిన ప్యాకేజీ-1 పనులు పీఎల్‌ఆర్‌ కాంట్రాక్టు సంస్థ, ప్యాకేజీ-2 కింద రూ.344 కోట్లతో చేపట్టిన పనులు ఎంఆర్‌కేఆర్‌ కాంట్రాక్టు సంస్థ దక్కించుకున్నాయి. ఈ సంస్థలు అఽధికార వైసీపీ ముఖ్య ప్రజా ప్రతినిధులకు చెందినవే. అయినా పనుల్లో పురోగతి అంతంతే.  


ఒక్క ఎకరాకు నీళ్లిస్తే ఒట్టు..

గాలేరు-నగరి ప్రాజెక్టులో కీలకమైనది అవుకు ట్విన్‌ టన్నెల్స్‌ నిర్మాణం. అప్పటి సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక టన్నెల్‌ పూర్తి చేసి 2018లో గండికోట జలాశయానికి కృష్ణా జలాలు మళ్లించారు. ఆ ఏడాది 12 టీఎంసీలు నిల్వ చేశారు. జగన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులకు తొలిసారిగా కృష్ణా జలాలు మళ్లించిన ఘనత  చంద్రబాబుకే దక్కింది. జగన్‌ సీఎం అయ్యాక అంతకంటే రెట్టింపు నిల్వ చేయాలనే రాజకీయ స్వలాభంతో.. రైతులు, మహిళలు, దళితులు రోడ్డెక్కి ఆందోళనలు చేసినా వాళ్ల ఆవేదనను పట్టించుకోకుండా రాత్రికి రాత్రే తాళ్లప్రొద్దుటూరు గ్రామాన్ని ముంచేసి 26 టీఎంసీలు నిల్వ చేశారు. ప్రస్తుతం గండికోటలో 23.150 టీఎంసీలు, వామికొండలో 1.054 టీఎంసీలు, సర్వరాయసాగర్‌లో 0.576 టీఎంసీలు, పైడిపాలెంలో 4.866 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. సర్వరాయసాగర్‌, వామికొండ జలాశయాల కింద 35 వేల ఎకరాలకు సాగునీరు అందించే కుడి, ఎడమ ప్రధాన కాలువ (మెయిన్‌ కెనాల్స్‌)లు, ఫీల్డ్‌ చానల్స్‌ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. 2005 మే 9న గామన్‌ ఇండియా సంస్థ ఈ పనులు రూ.301.84 కోట్లతో చేపట్టింది. పదేళ్ల తర్వాత 2015లో ఆ సంస్థ చేతులెత్తేయడంతో అదే ఎస్‌ఎ్‌సఆర్‌ రేట్లకు పనులు చేసేలా కోరమాండల్‌ ఇన్ర్ఫాస్ట్రక్చర్‌ సంస్థను ఆనాటి టీడీపీ ప్రభుత్వం ఒప్పించి పనులు మొదలు పెట్టించింది. రూ.261.74 కోట్లు ఖర్చు చేసి జలశయాలు, మెయిన్‌ కెనాల్స్‌ 85 శాతం వరకు పూర్తి చేశారు. జగన్‌ ప్రభుత్వం వచ్చి మూడేళ్లు గడిచినా మిగిలిన 15 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయింది. కాంట్రాక్టు సంస్థలు పెట్టుకున్న ప్రీక్లోజర్‌ విన్నపాన్ని ఆమోదించి రీ-ఎస్టిమేషన్లు తయారు చేశారు. అసంపూర్తి పనులు సహా 840 ఎకరాల భూ సేకరణ కోసం రూ.238 కోట్లు ఇవ్వాలని గాలేరు-నగరి ఇంజనీర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపితే రెండేళ్లుగా ఆ ఊసే లేదు. ఫలితంగా జలాశయాల్లో నీళ్లున్నా ఇవ్వలేకపోతున్నారు. సర్వరాయసాగర్‌ జలాశయం నుంచి జగన్‌ కుటుంబానికి చెందిన భారతి సిమెంట్‌ పరిశ్రమకు, వైసీపీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల చేపల చెరువులకు నీళ్లు ఇస్తున్నారు. ఫేజ్‌-2 కింద చేపట్టిన పనులను ప్రీ క్లోజర్‌ జీవో జారీ చేసి ఆపేశారు. 


నిధులు లేక ఆగిన హంద్రీ-నీవా పనులు

రాయలసీమలో 6.05 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల జనాభాకు తాగునీరు అందించే హంద్రీ-నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. జగన్‌ ప్రభుత్వం వచ్చాక పైసా కూడా ఖర్చు చేయలేదని ఇంజనీర్లే అంటున్నారు. కర్నూలు జిల్లా మల్యాల నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లి వరకు ఫేజ్‌-1 కింద 215.30 కి.మీ. ప్రధాన కాలువ, 12 లిఫ్టులు, కృష్ణగిరి, పందికోన (పత్తికొండ), అనంతపురం జిల్లా జీడిపల్లె రిజర్వాయర్లు నిర్మాణం చేశారు. ఇప్పటికే రూ.4,313 కోట్లు ఖర్చు చేశారు. కానీ ఆయకట్టుకు సాగునీరందడం లేదు. కర్నూలు జిల్లా పందికోన జలాశయం కుడి, ఎడమ కాలువల కింద పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో 66,500 ఎకరాలకు సాగు నీరు ఇవాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వంలో కొంత వరకు పనులు చేయడం వల్ల 32వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. జగన్‌ వచ్చాక ఒక్క పైసా నిధులు ఇవ్వలేదు. పైగా 2020 జూలై 8న ఎక్కడి పనులు అక్కడే ఆపేస్తూ జీవో 365 జారీ చేశారు. మరో ఐదేళ్ల వరకు ఎలాంటి ప్రతిపాదనలు పంపవద్దని స్పష్టమైన ఉత్తర్వులివ్వడం గమనార్హం. రాయలసీమ జిల్లాల్లో అసంపూర్తి ప్రాజెక్టులు, కాలువలను పట్టించుకోని జగన్‌ ప్రభుత్వం రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన్‌ (ఆర్‌డీఎంపీ) పేరుతో హడావుడి చేస్తోందని సీమ సాగునీటి నిపుణులు విమర్శిస్తున్నారు.


హామీ: సిద్ధేశ్వరం అలుగు, గుండ్రేవుల జలాశయం పూర్తి చేసే బాధ్యత తీసుకుంటా.

ఆచరణ: సిద్ధేశ్వరం అలుగును అటకెక్కించారు. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తలేదు. ఇక... గుండ్రేవుల విషయంలో మొదటికే మోసం తెచ్చారు. ఈ జలాశయం నిర్మాణం కోసం టీడీపీ ప్రభుత్వం రూ.2వేల కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు ఇచ్చింది. జగన్‌ ఆ జీవోను తుంగలో తొక్కారు.


జగన్‌ ఏం చెప్పారు - ఏం చేశారు?


హామీ: హంద్రీ-నీవాకు సమాంతరంగా పదివేల క్యూసెక్కుల సామర్థ్యంతో మరో కాలువ తవ్విస్తా. హంద్రీ-నీవా రెండో దశ పనులూ పూర్తి చేస్తా!

ఆచరణ: హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా 3,880 క్యూసెక్కులు ఎత్తిపోయాలన్నది లక్ష్యం. ఇందుకు 12 పంపులు (ఒక్కో పంపు 330 క్యూసెక్కులు) ఏర్పాటు చేశారు. కానీ కాలువ సామర్థ్యం దృష్ట్యా 2 వేల క్యూసెక్కులకు మించి ఎత్తిపోయలేని పరిస్థితి. పూర్తి స్థాయిలో నీటిని ఎత్తిపోసేలా గత టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కాలువ విస్తరణకు రూ.1,030 కోట్లు మంజూరు చేసింది. మూడు ప్యాకేజీలుగా పనులు చేపట్టి రూ.296 కోట్లు ఖర్చు చేసింది. జగన్‌ వచ్చాక ఆ పనులు ఆపేసి... సమాంతర కాలువ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన విస్తరణ పనులు పూర్తి చేసి ఉంటే 3,880 క్యూసెక్కులు లిఫ్ట్‌ చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు సమాంతర కాలువ సంగతీ మరిచిపోయారు. ఫేజ్‌-2 ప్రతిపాదననూ అటకెక్కించారు.


హామీ: గండికోట దిగువన 20 టీఎంసీల సామర్థ్యంతో దేనపల్లి జలాశయం నిర్మిస్తా.

ఆచరణ: కొత్త జలాశయం సంగతి పక్కన పెడితే... గండికోటలో నింపే నీటినే సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారు.


Updated Date - 2022-08-13T08:19:00+05:30 IST