కేంద్ర ఫోరెన్సిక్‌ ల్యాబ్‌తో పరీక్ష చేయించండి

ABN , First Publish Date - 2022-08-13T08:20:26+05:30 IST

కేంద్ర ఫోరెన్సిక్‌ ల్యాబ్‌తో పరీక్ష చేయించండి

కేంద్ర ఫోరెన్సిక్‌ ల్యాబ్‌తో పరీక్ష చేయించండి

హోంమంత్రి అమిత్‌ షాకు హైకోర్టు న్యాయవాది లేఖ

అనంత ఎస్పీపై విచారణ జరపాలని డీజీపీకి విజ్ఞప్తి 


అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన అశ్లీల వీడియోపై కేంద్ర ఫోరెన్సిక్‌ ల్యాబ్‌తో విచారణ చేయించాలని హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు శుక్రవారం లేఖ రాశారు. ‘ఎంపీ నగ్న వీడియో సమాజంలో అనేకమందికి దిగ్ర్భాంతిని, ఏహ్యభావాన్ని కలిగించింది. చట్టసభల్లోని సభ్యుల నైతికతకు సంబంధించిన ఈ అంశంపై కేంద్రం సీరియ్‌సగా దృష్టి సారించాలి. ఈ వీడియోను పరీక్షకు  పంపడానికి ఏపీ ప్రభుత్వం, పోలీస్‌ శాఖ ముందుకు రావడంలేదు. అది ఫేక్‌ అని, ఆ వీడియోను ఏ పరీక్షకు పంపకుండానే అనంతపురం ఎస్పీ ఫకీరప్ప తన తీర్పు ఇచ్చేసి చేతులు దులుపుకొన్నారు. అధికార పార్టీ ఒత్తిడితో ఇక్కడి పోలీస్‌ అధికారులు తమ విధిని నిష్పాక్షికంగా నిర్వర్తించే పరిస్థితి లేరు. ఈ వీడియో పరీక్షకు మీరు ఆదేశాలు జారీ చేయాలని  మనవి’ అని ఆ లేఖలో ఆయన కోరారు. కాగా, అనంతపురం ఎస్పీ ఫకీరప్పపై చర్య తీసుకోవాలని కోరుతూ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డికి న్యాయవాది లక్ష్మీనారాయణ మరో లేఖ రాశారు. ‘వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో క్లిప్‌పై విచారణ జరుగుతుండగానే అనంతపురం ఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించి ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారు. వాస్తవాలను వక్రీకరించారు. పోలీస్‌ శాఖ నైతిక విధి విధానాలు, స్టాండింగ్‌ ఆర్డర్స్‌కు ఇది విరుద్ధం. రాష్ట్రంలోని ఐపీఎస్‌ అధికారులు సక్రమ ప్రవర్తనతో మెలిగేలా చూడటం కోసం ఎస్పీపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి’ అని ఆయన లేఖలో కోరారు. 

Updated Date - 2022-08-13T08:20:26+05:30 IST