టీ-ఎంసెట్‌లో ఏపీ టాప్‌

ABN , First Publish Date - 2022-08-13T08:09:44+05:30 IST

టీ-ఎంసెట్‌లో ఏపీ టాప్‌

టీ-ఎంసెట్‌లో ఏపీ టాప్‌

ఇంజనీరింగ్‌లో లోహిత్‌రెడ్డికి ఒకటో ర్యాంకు

టాప్‌ 10లో 8 మంది విద్యార్థులు ఏపీవారే

జూటూరి నేహాకు అగ్రికల్చర్‌ మొదటి ర్యాంకు

తొలి 10 ర్యాంకుల్లో తెలంగాణ వారు ముగ్గురే

ఇంజనీరింగ్‌లో 80 శాతం.. అగ్రిలో 88 శాతం ఉత్తీర్ణత


హైదరాబాద్‌, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజనీరింగ్‌ విభాగంలో టాప్‌-10లో ఎనిమిది ర్యాంకులను మన రాష్ట్ర విద్యార్థులే కైవసం చేసుకున్నారు. అగ్రికల్చర్‌లోనూ మొదటి పది ర్యాంకుల్లో ఏడుగురు మన విద్యార్థులే. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జీఎన్‌టీయూహెచ్‌లో శుక్రవారం ఫలితాలను వెల్లడించారు. ఇంజనీరింగ్‌లో 80.41 శాతం, అగ్రికల్చర్‌లో 88.34 శాతం మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ కోసం ఈ నెల 21 నుంచి కౌన్సెలింగ్‌ చేపట్టనున్నారు. మొత్తం మూడు దశల్లో ఈ కౌన్సెలింగ్‌ జరపాలని నిర్ణయించారు. కాగా, ఇంజనీరింగ్‌లో ఏపీ విద్యార్థులు 1, 2, 3, 4, 5, 6, 7, 8వ ర్యాంకులు సాధించగా 9, 10 ర్యాంకులు తెలంగాణ వారికి దక్కాయి. అగ్రికల్చర్‌ విభాగంలో ఏపీ విద్యార్థులు 1, 2, 3, 5, 6, 7, 10 ర్యాంకుల్లో నిలవగా, తెలంగాణ విద్యార్థులు 4, 8, 9 ర్యాంకులు కైవసం చేసుకున్నారు. ఎంసెట్‌ ఫలితాల కోసం జ్ట్టిఞట://్ఛ్చఝఛ్ఛ్టి.్టటఛిజ్ఛి. ్చఛి.జీుఽ వెబ్‌సైట్‌ను, ఈసెట్‌ ఫలితాలకు జ్ట్టిఞట://్ఛఛ్ఛ్టి.్టటఛిజ్ఛి. ్చఛి.జీుఽ వెబ్‌సైట్‌ను చూడవచ్చు. ర్యాంకు కార్డులను ఈ సైట్‌ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 


ఇంజనీరింగ్‌ విభాగంలో....

ఫ ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం పెదఇర్లపాడుకు చెందిన పోలు లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డి ఇంజనీరింగ్‌ విభాగంలో టాపర్‌గా నిలిచాడు. పదో తరగతి వరకు ఏపీలో చదివిన లోహిత్‌... హైదరాబాద్‌ హైటెక్స్‌లోని కార్పొరేట్‌ కళాశాలలో 979 మార్కులతో ఇంటర్‌ పూర్తి చేశాడు. ఏపీఈఏపీ సెట్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో 2వ ర్యాంక్‌ సాధించాడు. జేఈఈ మెయిన్స్‌లో 300 మార్కులకు 290 మార్కులు సాధించి ఆల్‌ ఇండియాలో 27వ ర్యాంక్‌తో మెరిశాడు. 


విజయనగరం జిల్లా రేగిడి మండలం ఖండ్యాం గామ్రానికి చెందిన నక్కా సాయిదీప్తిక ఇంజనీరింగ్‌లో రెండో ర్యాంకు సాధించింది. ఈమె ఏపీ ఎంసెట్‌లో 37వ ర్యాంక్‌ సాధించింది. 4వ తరగతి వరకు హైదరాబాద్‌లో, ఆపై ఇంటర్‌ వరకు విజయవాడలో చదివింది. ఇంటర్‌లో వెయ్యికి 986 మార్కులు సాధించింది. 


ఇంజనీరింగ్‌లో గుంటూరు జిల్లాకు చెందిన పొలిశెట్టి కార్తికేయ 3వ, శ్రీకాకుళంజిల్లా సంతబొమ్మాళి మండలం కాక రాపల్లికి చెందిన పల్లి జలజాక్షి 4వ, శ్రీకాకుళం నగరానికి చెందిన మెండా హిమవంశీ ఐదో ర్యాంకుల్లో నిలిచారు. 


అగ్రికల్చర్‌లో విభాగంలో....


అగ్రికల్చర్‌ విభాగంలో తెనాలికి చెందిన జూటూరి నేహా మొదటి స్థానం సాధించింది. ఇంటర్‌లో 988 మార్కులు సాధించింది. ఢిల్లీ ఎయిమ్స్‌లో చదవాలని, న్యూరాలజిస్ట్‌ కావడమే లక్ష్యమని పేర్కొంది.


రెండో ర్యాంకులో నిలిచిన వంటాకు రోహిత్‌ది అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం పొడుగుపాలెం. పదో తరగతి వరకూ నర్సీపట్నంలో, ఇంటర్‌ రాజమండ్రిలో చదివాడు. 


 ఏపీకి చెందిన కల్లం తరుణ్‌కుమార్‌రెడ్డికి 3వ ర్యాంకు, దక్కాయి. తెలంగాణకు చెందిన కొత్తపల్లి మహీత్‌ అంజన్‌ నాలుగో ర్యాంకు, ఏపీ విద్యార్థి గుంటుపల్లి శ్రీరాం ఐదో ర్యాంకు సాధించారు. 

ఇదిలా ఉండగా తెలంగాణ ఈసెట్‌ ఫలితాల్లో 90.69శాతం విద్యార్థులు అర్హత సాధించారు. రాష్ట్రంలో ఆగస్టు 1న ఈసెట్‌ నిర్వహించారు. 24,055 మంది దరఖాస్తు చేసుకోగా, 22,001 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. 19,954 మంది అర్హతను సాధించారు.


టీఎస్‌ ఈసెట్‌లో టాపర్‌ హేమంత్‌ 

చీడికాడ: ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రవేశ పరీక్ష (టీఎస్‌ ఈసెట్‌-22)లో అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం అప్పలరాజుపురానికి చెందిన కురచా హేమంత్‌ కెమికల్‌ విభాగంలో మొదటి ర్యాంకు సాధించాడు. సామాన్య రైతు కుటుంబానికి చెందిన హేమంత్‌ విశాఖలోని కంచరపాలెం ప్రభుత్వ కెమికల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో డిప్లొమో చేశాడు. తెలంగాణ ఈసెట్‌లో మొదటి ర్యాంకు సాధించిన హేమంత్‌... ఏపీ ఈసెట్‌లో రాష్ట్ర స్థాయిలో ఏడో స్థానంలో నిలిచాడు. 

Updated Date - 2022-08-13T08:09:44+05:30 IST