‘అనంత’ బెయిలుకు పోలీసు సహకారం

ABN , First Publish Date - 2022-08-13T07:59:46+05:30 IST

‘అనంత’ బెయిలుకు పోలీసు సహకారం

‘అనంత’ బెయిలుకు పోలీసు సహకారం

అందుకనే చార్జిషీటు దాఖలు చేయడం లేదు

హతుని న్యాయవాది ముప్పాళ్ల ఆరోపణ


రాజమహేంద్రవరం, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): తన కారు మాజీ డ్రైవర్‌, దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్యకేసులో నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును శుక్రవారం రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి కేసును ఈ నెల 16కి వాయిదా వేశారు. రిమాండ్‌ను 26వ తేదీ వరకూ పొడిగించారు. అనంతరం బాధిత కుటుంబం తరఫున పోరాడుతున్న న్యాయవాది, ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు విలేకరులతో మాట్లాడారు. ‘‘అనంతబాబుకు బెయిల్‌ రావడానికి వీలుగా పోలీసులు సహకరిస్తున్నారు. సాధారణంగా 90 రోజుల్లోపు చార్జిషీట్‌ వేయకపోతే బెయిల్‌ వస్తుంది. ఈ నెల 20కి 90 రోజులు పూర్తవుతాయి. కేవలం బెయిల్‌ ఇవ్వడం కోసమే చార్జిషీట్‌ దాఖలు చేయడం లేదు. ఇప్పటికీ నేర స్థలం గుర్తించలేదు. ఇతర నేరస్తులను కూడా గుర్తించలేదు. చట్టబద్ధ విధులను పాటించని పోలీసులపై ఇప్పటికే మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు ఉంది. అనంతబాబుపై గతలో రౌడీషీట్‌ నంబరు 22 ఉంది. కానీ కోరినా పోలీసులు సక్రమంగా సమాచారం ఇవ్వడం లేదు. సెంట్రల్‌ జైలులో అతనికి అధికారులు చేస్తున్న రాచమర్యాదలను ప్రత్యక్ష సాక్ష్యాలతో బయటపెడతాం. గవర్నర్‌, ప్రభుత్వం, డీజీపీ వంటి వారు స్పందించకపోవడం వల్లే బాధితులు హైకోర్టును ఆశ్రయించారు’’ అని ముప్పాళ్ల తెలిపారు.

Updated Date - 2022-08-13T07:59:46+05:30 IST