రక్తమోడిన రహదారులు

ABN , First Publish Date - 2022-05-23T08:45:07+05:30 IST

రక్తమోడిన రహదారులు

రక్తమోడిన రహదారులు

వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతి

వైఎస్సార్‌ కడప, అన్నమయ్య జిల్లాల్లో ఐదుగురు

అనంతపురం జిల్లాలో ఇద్డరు దుర్మరణం


మైలవరం/సంబేపల్లె/యాడికి, మే 22: రాష్ట్రంలో రహదారులు ఆదివారం రక్తమోడాయి. మూడు జిల్లాల్లో జరిగిన ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వైఎస్సార్‌ కడప జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వైఎస్సార్‌ కడప జిల్లా మైలవరం మండల పరిధిలోని కరమలవారిపల్లి గ్రామ సమీపంలోని జమ్మలమడుగు-తాడిపత్రి ప్రధాన రహదారిలో శనివారం అర్ధరాత్రి ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వారిలో దొమ్మరనంద్యాల గ్రామానికి చెందిన దండె వెంకట సుబ్బయ్య (43), కుండా వెంకట సుబ్బమ్మ (73), మోరగుడికి చెందిన చౌడం లక్ష్మీ మునెమ్మ (52) మృతి చెందగా.. కారు డ్రైవర్‌ కుమార్‌, చిన్నారి గీతాంజలి గాయపడ్డారని మైలవరం ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. మోరగుడి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు చౌడం తిరుమల కొండయ్య, చౌడం లక్ష్మీ మునెమ్మల కుమార్తెకు పది రోజుల క్రితం నంద్యాల జిల్లా అవుకు మండలం సంగపట్నానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. శనివారం ఉదయం మోరగుడి నుంచి రెండు వాహనాల్లో కూతురికి చీరె సారె తీసుకుని సంగపట్నం వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి వస్తుండగా రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. అన్నమయ్య జిల్లా సంబేపల్లె గుట్టపల్లె ఆంజనేయస్వామి జాతరకు వెళ్లిన విద్యార్థులు శనివారం రాత్రి తిరిగి వస్తుండగా ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొనడంతో ఇద్దరు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. కలకడ మండలం ఝరిగడ్డ పాలెంకు చెందిన జ్యోతీశ్వర్‌నాయుడు (20), బాటవారిపల్లెకు చెందిన సోమశేఖర్‌ (18) జాతర చూసి శనివారం అర్ధరాత్రి బైక్‌ ఇంటికి వెళుతుండగా బాలయ్యగారిపల్లె క్రాస్‌ రోడ్డు వద్ద ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో జోతీశ్వర్‌నాయుడు, సోమశేఖర్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వాహనంపై ఉన్న బ్రహ్మంఆచారి, చింతం కృష్ణారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం జిల్లా పామిడి మండలం రామరాజుపల్లికి చెందిన ఒక వ్యక్తి తాడిపత్రి మండలం ఇగుడూరు గంగమ్మ ఆలయం వద్ద దేవర నిర్వహిస్తుండగా.. అదే ఊరికి చెందిన లక్ష్మిరెడ్డి(32), రంగనాథ్‌రెడ్డి (25), ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మల్లికార్జునరెడ్డి వెళ్లారు. మధ్యాహ్నం భోజనం అనంతరం వీరు ముగ్గురు కలిసి ద్విచక్రవాహనంపై రామరాజుపల్లికి బయల్దేరారు. వేములపాడు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఆటోను ద్విచక్రవాహనం వేగంగా ఢీకొనడంతో రెండు వాహనాలూ బోల్తాపడ్డాయి. ఈ ప్రమాదంలో లక్ష్మిరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన రంగనాథరెడ్డిని స్థానికులు తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. మల్లికార్జునరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. మల్లికార్జునరెడ్డిని చికిత్స నిమిత్తం అనంతపురం తరలించారు.

Updated Date - 2022-05-23T08:45:07+05:30 IST