కొన్ని గంటల్లో పెళ్లి... ఛాతీనొప్పితో వరుడు మృతి

ABN , First Publish Date - 2022-05-23T08:31:54+05:30 IST

కొన్ని గంటల్లో పెళ్లి... ఛాతీనొప్పితో వరుడు మృతి

కొన్ని గంటల్లో పెళ్లి... ఛాతీనొప్పితో వరుడు మృతి

మరో వ్యక్తితో పెళ్లి జరిపించిన మత పెద్దలు


హొళగుంద/పెద్దకడుబూరు, మే 22: కొన్ని గంటల్లో పెళ్లి అనగా.. ఛాతతీనొప్పితో విలవిల్లాడిన వరుడు తుదిశ్వాస విడిచాడు. దీంతో మరో యువకుడితో పెళ్లి జరిపించిన మతపెద్దలు ఆ వధువు జీవితాన్ని నిలబెట్టారు. కర్నూలు జిల్లా హొళగుంద మండల పరిధిలోని గజ్జెహళ్లిలో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దకడుబూరు మండలం చిన్నతుంబళం గ్రామానికి చెందిన చాంద్‌బాషా రెండో కుమారుడు అబ్దుల్‌ హనీఫ్‌ (21)కు గజ్జెహళ్లి యువతితో ఈ నెల 22న నిఖా నిశ్చయించారు. శనివారం సాయంత్రమే గజ్జెహళ్లి చేరుకున్న వరుడు, బంధువులు ఆ రాత్రి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో బస చేశారు. ఆదివారం తెల్లవారుజామున వరుడికి తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో హుటాహుటిన కర్ణాటకలోని శిరుగుప్ప ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. హనీఫ్‌ మృతదేహాన్ని బంధువులు చిన్నతుంబళం తీసుకెళ్లిపోయారు. పెళ్లికొడుకు మరణవార్త గజ్జెహళ్లి చుట్టు పక్కల గ్రామాలకు తెలిసిపోయింది. వధువు కుటుంబానికి దగ్గరి బంధువు, వందవాగిలి గ్రామానికి చెందిన  మహ్మద్‌ కుమారుడు నబీరసూల్‌ వధువును పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు. దీంతో మత పెద్దల ఆధ్వర్యంలో ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి జరిపించారు. అమ్మాయి జీవితం అభాసుపాలుకాకుండా పెద్ద మనసు చాటుకున్న నబీరసూల్‌ను గ్రామస్థులు, బంధువులు అభినందించారు.

Updated Date - 2022-05-23T08:31:54+05:30 IST