‘తెలుగు మహిళ’పై హత్యాయత్నం!

ABN , First Publish Date - 2022-05-23T08:29:23+05:30 IST

‘తెలుగు మహిళ’పై హత్యాయత్నం!

‘తెలుగు మహిళ’పై హత్యాయత్నం!

స్కూటీపై వెళ్తున్న సమయంలో అటకాయింపు

ఆ వెంటనే విరుచుకుపడిన ముగ్గురు మహిళలు

పిడిగుద్దులు, కత్తితో బెదిరింపులు

పట్టపగలు.. పోలీ్‌సస్టేషన్‌ ఎదుటే బరితెగింపు

పోలీసులు, స్థానికులు రావడంతో పరార్‌

స్పృహతప్పిన రేవతి.. జీజీహెచ్‌కు తరలింపు

మాజీ మంత్రి అనిల్‌ అనుచరుల పనేనని ఆరోపణ

ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు


నెల్లూరు(క్రైం), మే 22: నెల్లూరు నగరంలో సాక్షాత్తు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి నగర పర్యటనలో ఉండగానే, సంతపేట పోలీ్‌సస్టేషన్‌ ఎదుట స్కూటీపై వెళుతున్న తెలుగు మహిళ నెల్లూరు నగర అధ్యక్షురాలు కప్పిర రేవతిపై ముగ్గురు మహిళలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆదివారం మిట్టమధ్యాహ్నం జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. బాధితురాలు రేవతి కథనం మేరకు.. ఆదివారం ఉదయం సంతపేట పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లిన తన భర్త శ్రీనివాసులు మధ్యాహ్నం 12 గంటలు దాటుతున్నా తిరిగి రాకపోవడంతో ఏం జరిగిందోననే గాబరాతో రేవతి స్కూటీపై బయలుదేరారు. సరిగ్గా స్టేషను గోడ వద్దకు వచ్చేసరికి పూటుగా మద్యం తాగిన ముగ్గురు మహిళలు ఆమెను అటకాయించారు. స్కూటీని కింద పడేసి కత్తి చూపి బెదిరిస్తూ పిడిగుద్దులు గుద్దారు. ఆ బాధను తట్టుకోలేక రేవతి గట్టిగా కేకలు వేయడంతో పోలీ్‌సస్టేషన్‌ సిబ్బంది, స్థానికులు వచ్చారు. ఆ ముగ్గురు మహిళలు పరారయ్యారు. రేవతిని స్టేషన్‌లోకి తీసుకువెళ్లారు. వెంటనే టీడీపీ నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అక్కడకు చేరుకుని బాధితురాలితో మాట్లాడారు. స్టేషనులో స్పృహతప్పి పడిపోయిన రేవతిని జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. 


వైసీపీ నాయకుల పనే!

నెల్లూరులో మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అనుచరులు అక్రమ లేఅవుట్‌లు వేశారంటూ కొన్ని రోజులుగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ లేఅవుట్‌ల వెనుక ఆయన హస్తం ఉందని ఆరోపిస్తూ రేవతి శనివారం సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ఈ క్రమంలోనే అనిల్‌ అనుచరులు దాడికి పాల్పడినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా రేవతిపై దాడికి పాల్పడిన వారిలో ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓ మహిళ ఎమ్మెల్యే అనిల్‌ అనుచరుడి భార్యగా తెలుస్తోంది. ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ స్పందించారు. రేవతిని ఫోన్‌లో పరామర్శించారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా రేవతిని ఫోన్‌లో పరామర్శించారు. టీడీపీ నెల్లూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌, తెలుగు మహిళ రాష్ట్ర నేత తాళ్లపాక అనురాధ తదితరులు జీజీహెచ్‌లో రేవతిని పరామర్శించారు.


చంపేయాలని చూశారు!

‘లోకేశ్‌, జిల్లా నేతలపై మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ చేసిన అనుచిత వాఖ్యలను తప్పుబడుతూ మాట్లాడాను. ఈ క్రమంలోనే సాయి అనే రౌడీషీటర్‌ నేను సంతపేట పోలీ్‌సస్టేషన్‌ వద్దకు రావడాన్ని గమనించి మహిళలకు ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో ముగ్గురు మహిళలు నా బైక్‌ ఆపి, కత్తితో బెదిరిస్తూ ఇష్టం వచ్చినట్లు కాళ్లతో, చేతులతో తన్నారు. ‘‘మా ఎమ్మెల్యేనే తిడతావా. నీ అంతు చూడమని మా అనిల్‌ చెప్పాడు. నిన్ను నీ మెగుణ్ని బతకనివ్వం’’ అని తిడుతూ నాపై హత్యాయత్నం చేశారు’ అని రేవతి వెల్లడించారు.

Updated Date - 2022-05-23T08:29:23+05:30 IST