పొత్తులతో పని లేదు!

ABN , First Publish Date - 2022-05-23T08:11:13+05:30 IST

పొత్తులతో పని లేదు!

పొత్తులతో పని లేదు!

పవన్‌ను సీఎం చేయడమే లక్ష్యం.. జనసేన వెంటే ‘మెగా’ అభిమానులు

విజయవాడలో ‘అఖిల భారత’ మెగా ఆత్మీయ కలయిక


విజయవాడ, మే 22 (ఆంధ్రజ్యోతి): ‘జనసేన ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటుందా.. ఇతర పార్టీలు దానితో చేతులు కలుపుతాయా అన్న విషయంతో మనకు సంబంధం లేదు. ఇక నుంచి మనమంతా జనసేన క్రియాశీల కార్యకర్తలుగా పనిచేద్దాం. 2024లో పవన్‌ కల్యాణ్‌ను సీఎంని చేయడమే మన ముందున్న ఏకైక లక్ష్యం’ అని మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులు తీర్మానించారు. అఖిల భారత మెగా అభిమానుల ఆత్మీయ కలయికను ఆదివారమిక్కడ ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి మెగా అభిమానులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సినీదర్శకుడు బాబీ, సినీనటుడు భద్రం, చిరంజీవి అభిమానుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు, అధ్యక్షుడు మహేశ్‌, అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు సుగుణబాబు తదితరులు హాజరయ్యారు. త్వరలో విశాఖపట్నం, తిరుపతిలోనూ మెగా అభిమానులతో సమావేశాలు నిర్వహించిన తర్వాత రాష్ట్రంలో భారీస్థాయిలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అదేవిధంగా తెలంగాణలోనూ ఓ సభను నిర్వహించాలని భావిస్తున్నారు. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే జనసేనకు క్రియాశీల కార్యకర్తలుగా పనిచేయాలని వక్తలు సమావేశంలో పిలుపిచ్చారు. జనసేన ఏ పార్టీతో పొత్తులు పెట్టుకుందన్న విషయాన్ని పక్కనపెట్టి 2024లో విజయానికి పునాదులు వేయడం ప్రారంభించాలని సూచించారు. 2009లో ఎంతో ప్రజాదరణ వచ్చినప్పటికీ ప్రజారాజ్యం విజయం సాధించలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఓటమిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. జనసేనలో మెగా అభిమానులకు కచ్చితంగా సముచిత స్థానం కచ్చితంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో పవన్‌ను సీఎం చేస్తామని అభిమానులు ప్రతిజ్ఞ చేశారు. సినిమా టికెట్‌ ధరల విషయంలో సీఎం జగన్‌ వద్ద చిరంజీవి వ్యవహరించిన తీరుపై జనసేన రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర సమావేశంలో కాస్తంత ఘాటుగానే స్పందించారు. ‘నమస్కారానికి ప్రతినమస్కారం చేయాలన్న సంస్కారం లేని వ్యక్తుల వద్దకు వెళ్లడం ఎందుకు? సినిమా టికెట్‌ ధరల పెంపు కోసం జగన్‌ వద్దకు వెళ్లిన చిరంజీవి.. రెండు చేతులూ జోడించి నమస్కారం చేశారు. ఆ సంస్కారం లేని జగన్‌ గర్వంతో తలూపుతూ కూర్చుకున్నారు. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత అభిమానుల తల తీసేసినట్లుగా అనిపించింది’ అని వ్యాఖ్యానించారు. ‘ఎన్నికల్లో విజయం సాధించాలంటే 51 శాతం ఓటింగ్‌ ఉండాలి. జనసేన ఏడు శాతంలో మాత్రమే ఉంది. ఇంకా 44 శాతం బలపడాలి’ అని అభిప్రాయపడ్డారు.

Updated Date - 2022-05-23T08:11:13+05:30 IST