లండన్‌ వెళ్లాలని ముందే నిర్ణయం

ABN , First Publish Date - 2022-05-23T08:00:11+05:30 IST

లండన్‌ వెళ్లాలని ముందే నిర్ణయం

లండన్‌ వెళ్లాలని ముందే నిర్ణయం

జూరెక్‌ విమానాశ్రయానికి ఆ విషయం ముందే చెప్పారు

ఆర్థిక లావాదేవీలు సెటిల్‌ చేసుకోడానికే లండన్‌ హాల్ట్‌

కోర్టుకు దావోస్‌ అని చెప్పి లండన్‌లో చక్కబెట్టుకొన్నారు

జగన్‌ విదేశీ పర్యటనపై టీడీపీ విమర్శలు


అమరావతి, మే 22 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి లండన్‌ వెళ్లి, అక్కడ ఆగి తన ఆర్థిక లావాదేవీలు చక్కబెట్టుకోవాలన్నది ముందే జరిగిన నిర్ణయమని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆదివారం ఇక్కడ ఆ వివరాలు వెల్లడించారు. ‘ప్రత్యేక విమానంలో వెళ్తే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఏ సమయంలో వస్తుందన్నది ముందుగానే సంబంధిత విమానాశ్రయానికి సమాచారం ఇవ్వాలి. జగన్‌ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం లండన్‌ నుంచి 21వ తేదీ సాయంత్రం రాబోతోందని జూరెక్‌ విమానాశ్రయం అధికారులకు ఈ నెల 18వ తేదీనే సమాచారం ఇచ్చారు. ఇస్తాంబుల్‌ విమానాశ్రయంలో ఇంధనం నింపుకోడానికి అనుకోకుండా ఆలస్యం అయిందని, అందువల్ల ముఖ్యమంత్రి అనుకోకుండా లండన్‌ వెళ్లి అక్కడ ఆగాల్సి వచ్చిందని మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, గుడివాడ అమర్‌నాథ్‌ ఇచ్చిన ప్రకటనలు పచ్చి మోసం. లండన్‌ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందన్న విషయాన్ని కప్పిపుచ్చుకోడానికి మంత్రులతో అనేక అబద్ధాలు ఆడించి దొరికిపోయారు. ఇస్తాంబుల్‌లో ఇంధనం నింపుకోడానికి విపరీత జాప్యం జరిగిందన్నది కూడా అబద్ధం. అక్కడ ఆగింది కేవలం రెండున్నర గంటలే. ఏ విమానానికైనా అంతే పడుతుంది. ఇస్తాంబుల్‌ నుంచి జూరెక్‌ విమాన ప్రయాణం వ్యవధి మూడు గంటలు. సాయంత్రం ఏడున్నర గంటలకు జూరెక్‌ చేరుకొనే అవకాశం ఉంది. రాత్రి పది గంటల వరకూ పట్టనే పట్టదు. జూరెక్‌ విమానాశ్రయం రికార్డుల ప్రకారం ఆ రోజు రాత్రి పది గంటల తర్వాత కనీసం ఇరవై విమానాలు అక్కడ దిగాయి. ఆఖరి విమానం రాత్రి పదకొండున్నరకు దిగింది. జూరెక్‌ విమానాశ్రయంలో రద్దీ వల్ల ముఖ్యమంత్రి విమానం అక్కడ దిగలేక లండన్‌ వెళ్లిందని ఇంకో అబద్ధం చెప్పారు. లండన్‌లో పనులు చక్కబెట్టుకోడానికి అనుమతి కావాలంటే సీబీఐ కోర్టు ఇవ్వదు. అందుకని దావోస్‌ సమావేశాల పేరు చెప్పారు. ప్రజలను మోసం చేయడానికి ముఖ్యమంత్రి సొంత పత్రికలో ఆయన నేరుగా దావోస్‌ వెళ్లిపోయారని తప్పుడు వార్తలు రాశారు’ అని పట్టాభి చెప్పారు. రస్‌ అల్‌ ఖైమా దేశంతో జగన్‌కు ఆర్థిక వివాదాలు ఉన్నాయని, ఆయన వెళ్లిన సమయానికి ఆ దేశ ప్రతినిధులు లండన్‌లోనే ఉన్నారని, వారితో ఆ లావాదేవీలపై ఒక అవగాహనకు రావడానికే లండన్‌లో ఆగారని పట్టాభి ఆరోపించారు. ‘ఆ దేశంతో పెట్టుబడి పెట్టించి విశాఖ వద్ద అల్యూమినియం ఫ్యాక్టరీ పెట్టించారు. వ్యాన్‌పిక్‌ పేరుతో ప్రకాశం జిల్లాలో పోర్టు నిర్మాణం కోసం ఆ దేశంతో పెట్టుబడి పెట్టించారు. భూ సేకరణలో కుంభకోణం జరిగి సీబీఐ కేసు నమోదైంది. నిమ్మగడ్డ ప్రసాద్‌ను ఈ వ్యవహారానికి సంబంధించి సెర్బియా దేశంలో అనేక నెలలపాటు నిర్బంధించారు. ఈ కేసులో కూడా జగన్‌ ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన లండన్‌ వెళ్లారు. నల్ల ధనం వ్యవహారాల్లో భాగంగానే ఆయన అక్కడకు వెళ్ళారని అప్పట్లో రాజకీయ పార్టీలు ఆరోపించాయి. ఇప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన మళ్లీ లండన్‌ వెళ్లారు. దీనిపై లోతైన విచారణ జరగాల్సి ఉంది’ అని పట్టాభి చెప్పారు. 

Updated Date - 2022-05-23T08:00:11+05:30 IST