అంబులెన్స్‌ల్లో అవినీతి ‘ఫిటింగ్‌’!

ABN , First Publish Date - 2022-05-23T08:09:33+05:30 IST

అంబులెన్స్‌ల్లో అవినీతి ‘ఫిటింగ్‌’!

అంబులెన్స్‌ల్లో అవినీతి ‘ఫిటింగ్‌’!

ఖరీదు కంటే రూ.98 కోట్లు ఎక్కువ పెట్టి కొన్న వైనం!

రూ.143 కోట్లకు 175 అంబులెన్స్‌లు కొనుగోలు

ఆ లెక్కన ఒక్కోదాని విలువ 81.71 లక్షలు

మార్కెట్లో వాహనం ఖరీదు రూ.17 లక్షల లోపే

ఎక్స్‌ట్రా ఫిటింగ్‌లు కలిపితే రూ.25.50 లక్షలు

అసలు ఖరీదు కంటే రెండు రెట్లు అదనపు వ్యయం

పెద్దమొత్తంలో డబ్బు చేతులు మారినట్టు ఆరోపణలు

ఈ వ్యవహారంలో ఓ ఉన్నతాధికారి కీలక పాత్ర!


మొబైల్‌ వెటర్నరీ అంబులెన్స్‌ల కొనుగోళ్లలో భారీగా అవకతవకలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. అవసరమైన ఫిటింగ్‌లతో కలిపి ఒక్కో అంబులెన్స్‌ ఖరీదు రూ.26 లక్షల లోపే ఉంటుంది. కానీ ఏకంగా 81 లక్షల పైనే చెల్లించినట్లు అధికారులు లెక్కలు చూపుతున్నారు. ఈ కొనుగోళ్ల వెనుక ఓ ఉన్నతాధికారి హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రైతుల ఇంటి వద్దే పశువులకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఇటీవల అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చింది. రూ.143 కోట్ల వ్యయంతో 175 వెటర్నరీ అంబులెన్స్‌లను తీసుకొచ్చామని కోట్లు కుమ్మరించి మరీ ప్రకటనలు ఇచ్చింది. సర్కారు చెప్పిన దాని ప్రకారం ఒక్కో అంబులెన్స్‌ ఖరీదు 81.71 లక్షలు..! పశువులకు వైద్య సేవలు అందించే అంబులెన్స్‌లు అంత విలువ చేస్తాయా? అన్నదే ప్రశ్న. అసలు ఆ వాహనం ఖరీదు ఎంత? అందులో ఏయే సదుపాయాలు ఉన్నాయి? వాటిని సమకూర్చడానికి ఎంత ఖర్చు పెట్టారు? అన్న విషయాలను పరిశీలిస్తే మొబైల్‌ వెటర్నరీ అంబులెన్స్‌ల కొనుగోళ్లలో పెద్దఎత్తున అవకతకవలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కొనుగోలు చేసిన ఒక్కో వాహనం ఖరీదు రూ.17 లక్షల లోపే. నిపుణుల అంచనా, మార్కెట్‌ ధరల ప్రకారం అంబులెన్స్‌లో అవసరమెనౖ పరికరాల ఎక్స్‌ట్రా ఫిటింగ్‌కు గరిష్ఠంగా దాదాపు రూ.8.50 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే.. ఒక్కో అంబులెన్స్‌కు మొత్తం దాదాపు 25.50 లక్షలు అవుతుంది. అయితే ఒక్కో వాహనానికి 81.71 లక్షలు ఖర్చు అయినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. దీనిపై వాహన రంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్స్‌ల కొనుగోలు విలువ కంటే ప్రభుత్వం అదనంగా రెండు రెట్లకు పైగా.. అంటే దాదాపు 98 కోట్లు ఎక్కువగా ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. ఎక్స్‌ట్రా ఫిటింగ్‌ల పేరుతో అధికంగా ఖర్చయినట్లు ప్రభుత్వం, అధికారులు చూపుతున్నారు. సర్కార్‌ సొమ్ము పెద్దమొత్తంలో చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంబులెన్స్‌ల కొనుగోలు వ్యవహారంలో ఓ ఉన్నతాధికారి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. 


ఒక్కో వాహనం ఖరీదు ఎంతంటే.. 

108 తరహాలో పశువులకూ వైద్య సేవలు అందిస్తామని.. ఇందుకు రూ.278 కోట్లతో 340 అంబులెన్స్‌లను కొనుగోలు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 పశువుల అంబులెన్స్‌లను రూ.143 కోట్లతో కొనుగోలు చేసింది. ఈ నెల 19న ముఖ్యమంత్రి జగన్‌ జెండా ఊపి వీటిని ప్రారంభించారు. జగన్‌ సర్కార్‌ కొనుగోలు చేసిన ఈ అంబులెన్స్‌లు ఎక్కువగా ‘టాటా ఆల్ర్టా టీ7’ మోడల్‌వి. బాడీ ఆటోను తలపించే ఆల్ర్టా టీ7 వాహనం ఖరీదు రూ.14.77 లక్షల నుంచి రూ.16.35 లక్షలు. కొన్ని వాహనాలు ఇతర మోడల్‌వి ఉన్నాయి. ఏ వాహనాలైనా ధర 17 లక్షలకు లోపు ఉంది. 


వాహనంలో ఏమున్నాయంటే..  

కేబిన్‌కు రెండు చక్రాలు, బాడీకి నాలుగు చక్రాలతో అంబులెన్స్‌లను తయారు చేయించారు. అంబులెన్స్‌లోకి పశువుల్ని ఎక్కించడానికి హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. లోపల పశువుల మందుల భద్రత కోసం ఒక ఫ్రిజ్‌, సిబ్బంది కోసం ఏసీ ఉన్నాయి. చిన్నపాటి మూగజీవాలు, పక్షులను పరీక్షించడానికి స్ట్రెచర్‌, ఇతర పరికరాలను అమర్చారు. పశువుల పేడ, రక్త పరీక్షలకు మైక్రోస్కోప్‌ వంటి ప్రయోగ పరికరాలు ఏర్పాటు చేశారు. కొన్ని రకాల మందులు అందుబాటులో ఉంచారు. మార్కెట్‌ ధరల ప్రకారం అంబులెన్స్‌లోని పరికరాల విలువ గరిష్ఠంగా రూ.8.50 లక్షలు ఉంటుంది. 108 వాహనాలకు పరికరాలను సమకూర్చిన సంస్థే వెటర్నరీ అంబులెన్స్‌లకు కూడా పరికరాలను ఏర్పాటు చేసినట్టు సమాచారం. 


సహాయకుల మాటేమిటి? 

డాక్టర్‌ వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవ పేరుతో జగన్‌ సర్కార్‌  వెటర్నరీ అంబులెన్స్‌లను ఏర్పాటు చేసింది. అనారోగ్యానికి గురైన పశువులకు వైద్యం చేయించేందుకు పశుపోషకులు టోల్‌ ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేస్తే.. వెంటనే అక్కడకు చేరుకుంటుందని ప్రభుత్వం పేర్కొంది. అంబులెన్స్‌లోకి పశువును ఎక్కించేందుకు హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ సౌకర్యం ఏర్పాటు చేశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన మూగజీవాన్ని  వైద్యశాలకు తరలించేందుకు లిఫ్ట్‌ ఉపయోగపడినా.. దాన్ని కట్టడి చేసి, తరలించడం అంత సులువు కాదు. ఎక్కువ శాతం పశువులు వాహనాలు ఎక్కడానికి, వైద్యం చేయించుకోవటానికి మొరాయిస్తుంటాయని పశువైద్య సిబ్బందే చెబుతున్నారు.  అలాంటప్పుడు పశువును లిఫ్ట్‌ ఎక్కించడానికి పలువురి సహాయం అవసరం ఉంటుంది. కానీ లిఫ్ట్‌ ఆపరేట్‌ చేయడానికి సహాయకులు లేరు. అంబులెన్స్‌ల్లో ఒక పశువైద్యుడు, వెటర్నరీ డిప్లొమా చేసిన సహాయకుడు, డ్రైవర్‌ కమ్‌ అటెండర్‌ను మాత్రమే నియమించారు. ప్రతి నెలా ఒక్కో వాహనం నిర్వహణకు 1.90 లక్షలు చొప్పున రెండేళ్లకు నిధులు విడుదల చేశారు. 


గ్రామీణ సిబ్బందిలో ఆందోళన 

రాష్ట్రంలో ప్రతి మండలంలో ఒకటి, రెండు పశువైద్యశాలలున్నాయి. నాలుగైదు గ్రామాలు కలిపి క్లస్టర్‌ గ్రామాలకు గ్రామీణ పశువైద్యశాల ఉంది. సాధారణంగా పశువులకు ప్రాథమిక వైద్యం అయితే గ్రామీణ పశువైద్యశాలలోనే అందిస్తారు. కాస్త మెరుగైన వైద్యసేవలు మండల కేంద్రంలో లేదా నియోజకవర్గ కేంద్రంలోని డిస్పెన్సరీలో అందిస్తారు. అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తున్నందున రానున్న రోజుల్లో గ్రామీణ పశువైద్యశాలలను ఉంచుతారా? తొలగిస్తారా? అనే సందేహాలు పశుసంవర్థక శాఖ క్షేత్రస్థాయి సిబ్బందిలో వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2022-05-23T08:09:33+05:30 IST