వైసీపీ నేత అక్రమ రిజిస్ట్రేషన్‌

ABN , First Publish Date - 2022-05-23T08:57:17+05:30 IST

వైసీపీ నేత అక్రమ రిజిస్ట్రేషన్‌

వైసీపీ నేత అక్రమ రిజిస్ట్రేషన్‌

అమరావతిలో ఇతరుల భవనం తన భార్య పేరుతో రిజిస్టర్‌ 


అమరావతి, మే 22: ఇతరులకు చెందిన సుమారు రూ.2 కోట్ల విలువైన స్థిరాస్తిని ఓ వైసీపీ నాయకుడు తన భార్య పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. తన పూర్వీకుల ఆస్తిగా దొంగ పత్రాలు సృష్టించారు. అనంతరం తన భార్యకు గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు తప్పుడు రిజిస్ర్టేషన్‌ చేయించారు. ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న భవన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా అమరావతిలోని క్రోసూరు రోడ్డులోని పాత స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ భవనం హైదరాబాద్‌కు చెందిన లాయర్‌ కురగంటి వీరేశ్వర్‌కు తన తండ్రి కేవీవే భగవత్‌ శాస్త్రి ద్వారా సంక్రమించింది. ఈ భవనం విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుంది. అయితే, అమరావతి మాజీ ఉపసర్పంచ్‌, వైసీపీ నేత నందిగామ కోటేశ్వరరావు అనే వ్యక్తి ఆ భవనం తనకు తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తిగా పంచాయతీ కార్యాలయంలో నకిలీ పత్రాలు సృష్టించారు. అనంతరం 2021 డిసెంబరు 21న పిడుగురాళ్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆ పత్రాలను చూపి, ఆ భవనాన్ని తన భార్య ఆదిలక్ష్మికి బహుమతిగా ఇస్తున్నట్లు రిజిస్ట్రేషన్‌ చేయించాడు. ఆలస్యంగా ఈ సంగతి తెలుసుకున్న భవన యజమాని వీరేశ్వర్‌ శనివారం హైదరాబాద్‌ నుంచి పిడుగురాళ్ల చేరుకుని రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో విచారించి తన భవనానికి అక్రమ రిజిస్ట్రేషన్‌ జరిగినట్లు గుర్తించి రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే అమరావతిలో తన ఆస్తిని కాజేయాలనుకున్న కోటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి మోహన్‌చంద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఇంటిపై వచ్చే అద్దెతో జీవనం సాగిస్తున్న సమయంలో ఆ ఇంటినే కాజేయాలని చూశారని, తన ఆస్తికి సంబందించి జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్‌ను రద్దుచేసి తనకు అప్పగించాలని,  పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - 2022-05-23T08:57:17+05:30 IST