Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 22 May 2022 03:03:53 IST

ఎమ్మెల్సీకి ఉచ్చు

twitter-iconwatsapp-iconfb-icon

మాజీ డ్రైవర్‌ హత్యకేసులో ఉదయభాస్కర్‌ ఎ1

తొలుత అనుమానాస్పద మృతి కేసు నమోదు

బాధితురాలి ఒత్తిడితో హత్యకేసుగా మార్పు

ఎమ్మెల్సీ కోసం కాకినాడలో ప్రత్యేక బృందాలు

ఏ క్షణమైనా వైసీపీ నాయకుడి అరెస్టు!

శవ పంచనామాపై నెగ్గిన బాధితురాలి పంతం

అరెస్టుకు సంకేతాలొచ్చేదాకా రోజంతా పోరు

పోలీసులు కొట్టారన్న ప్రకటనతో తీవ్ర ఉద్రిక్తత

అర్ధరాత్రి వరకు రహదారిపై నిరసనల హోరు

ఎట్టకేలకు దిగి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం


(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌కు ఉచ్చు బిగుసుకుంది. ఈ కేసులో ఆయనను పోలీసులు ఎ-1 నిందితుడిగా ప్రకటించారు. అనుమానస్పద మృతి కేసును కాస్తా.. హత్యకేసుగా మార్చారు. దీంతో ఏ క్షణమైనా ఎమ్మెల్సీని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. తన భర్త మృతదేహానికి పోస్టుమార్టం చేయడానికి ముందుగా ఎమ్మెల్సీని అరెస్టు చేయాలంటూ సుబ్రహ్మణ్యం భార్య రెండురోజులుగా పోరాడుతున్న విషయం తెలిసిందే. చివరకు ఆమె తన పంతమే నెగ్గించుకున్నారు. దీంతో కుటుంబం.. పోస్టుమార్టం నిర్వహణకు అంగీకరించింది. అంతకుముందు.. పోలీసులు రోజంతా ఎంత ఒత్తిడి తెచ్చినా ఆమె తన ‘పట్టు’ వీడలేదు. ‘నా భర్త మృతిదేహం కుళ్లిపోయినా ఫరవాలేదు.. కానీ, పోస్టుమార్టానికి అంగీకరించేది లేదు’ అని తేల్చిచెప్పారు. మార్చురీ వద్దకు బలవంతంగా తీసుకెళ్లినా శవ పంచనామాకు అంగీకరించలేదు. ఈ దశలో ‘పోలీసులు నన్ను కొట్టారు’ అని ఆమె చేసిన విడుదల చేసిన ఆడియో సందేశం శనివారం తీవ్ర కలకలం రేపింది. బంధువులు, దళిత సంఘాలు రోడ్డెక్కాయి. ఉద్రిక్తతలు పెరగడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద నలుగురు డీఎస్పీలు, 30మంది ఎస్‌ఐలు, 70మంది కానిస్టేబుళ్లు మోహరించారు. ఇంటివద్ద సరైన భద్రత లేకపోవడం, ఉదయభాస్కర్‌ అనుచరుల అనుమానిత కదలికలతో భయభ్రాంతులకు గురై ఇంటికి తాళం వేసి బాధితులు సామర్లకోటలో తలదాచుకున్నారు. పోలీసులు జాడ పసిగట్టి అక్కడకు వెళ్లి వారితో బేరాలాడారు. శవ పంచనామాకు సహకరిస్తే రూ.40లక్షలు,  వైసీపీలో పదవి ఇస్తామని ఆఫర్‌ ఇచ్చారు. అందుకు వాళ్లు అంగీకరించకపోవడంతో పోలీసులు వెనక్కి వచ్చారు. క్రమేపీ ఒత్తిడి పెరగడంతో ఉప్పాడకు సమీపంలోని కొమరగిరిలో బంధువుల ఇంటికి సాయంత్రం బాధితులు వెళ్లారు. అక్కడా వెంటాడిన పోలీసులు అదుపులోకి తీసుకుని బలవంతంగా కారులో ఎక్కించుకుని మార్చురీ వద్దకు తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న జైభీమ్‌ పార్టీ అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్‌ మార్చురీ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మార్చురీ వద్ద మృతుడి భార్య, తల్లిదండ్రులను పోలీసులు కొట్టి బలవంతంగా సంతకాలు చేయిస్తున్నారని దళిత సంఘాలు తీవ్ర ఆందోళనకు దిగాయి. కాకినాడ జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాస్‌.... శ్రవణ్‌కుమార్‌ తదితరులతో చర్చలు జరిపారు. మార్చురీలో పరిశీలించేందుకు శ్రవణ్‌కుమార్‌ ఒక్కరినే పోలీసులు లోపలకు పంపారు. కాసేపటికి బయటకు వచ్చిన శ్రవణ్‌కుమార్‌... మృతుడి కుటుంబీకులు పోస్టుమార్టం కోసం సంతకాలు పెట్టడానికి నిరాకరించారని, పోలీసులు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా వెనక్కి తగ్గడం లేదని వివరించారు. వారికి మద్దతుగా నిలబడాలంటూ తిరిగి మార్చురీ ఎదుట రోడ్డుపై ఆందోళనకు దిగారు. బాధితురాలి డిమాండ్‌పై అర్ధరాత్రి దాటాక రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చేవరకు వారు అక్కడే బైఠాయించారు. మృతుని భార్య, కుటుంబంతో ప్రభుత్వం తరఫున కాకినాడ ఆర్డీవో బీవీ రమణ చర్చలు జరిపారు. పోస్టుమార్టానికి సహకరించాలని కోరారు. అలాచేస్తే.. మృతుని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, మృతుని సోదరుడికి అవుట్‌సోర్సింగ్‌ కొలువు, కుటుంబానికి ఐదు ఎకరాల పొలం, 8.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అప్పటికే ఎమ్మెల్సీ అరెస్టు దిశగా పోలీసులు రంగంలోకి దిగడంతో బాధిత కుటుంబం... ప్రభుత్వ ప్రతిపాదనలకు అంగీకరించింది. 


చంపింది అందుకేనా...!

సుబ్రహ్మణ్యం తనకు రూ.20వేల బాకీ ఉన్నాడని, ఇవ్వకపోతే కాళ్లు, చేతులు విరిచేస్తానని పలుసార్లు ఎమ్మెల్సీ ఉదయభాస్కర్‌ మృతుడి కుటుంబీకులను ఫోన్‌లో హెచ్చరించారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి సజీవంగా తీసుకువెళ్లి 12.30 సమయంలో మృతదేహంగా తీసుకువచ్చారు. అయితే.. కాకినాడకు చెందిన ఓ వ్యాపారి కూతురితో ఉదయభాస్కర్‌కు ఉన్న బంధమే డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్యకు దారితీసిందనే కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పలుసార్లు ఆ యువతిని ఆమె ఇంటివద్ద స్వయంగా సుబ్రహ్మణ్యం దించాడు. ఓసారి అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె.. సుబ్రహ్మణ్యంపై ఉదయభాస్కర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో డ్రైవర్‌ ఉద్యోగంలోంచి తీసేశారని, ప్రస్తుతం ఉదయభాస్కర్‌ వద్ద పనిచేస్తున్న ఓ డ్రైవర్‌ వివరించాడు. ఆ తర్వాత కూడా అతనిపై ఆమె ఫిర్యాదులు చేస్తుండటంతో కక్ష పెంచుకున్నారని, పథకం ప్రకారమే హత్య చేయించారని చెబుతున్నారు. కాగా, సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని, దానిని ఉంచిన కారును శుక్రవారం అర్ధరాత్రి అతని భార్య ఇంటి వద్ద వదిలి పరారైన ఎమ్మెల్సీ.. శనివారమంతా వివాహ వేడుకలతో బిజీ అయ్యారు. రంపచోడవరం, తునిలో జరిగిన పెళ్లిళ్లకు హాజరయ్యారు. ఏజెన్సీలోని రాజవొమ్మంగిలో శనివారం ఉదయం పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఉదయభాస్కర్‌ హాజరువుతారని ప్రకటించి ఫ్లెక్సీ వేశారు. కానీ అక్కడికి వెళ్లలేదు. 


టీడీపీ నిజనిర్ధారణలో ఉద్రిక్తత.. 

సుబ్రహ్మణ్యం మృతిపై వాస్తవాలు తెలుసుకునేందుకు శనివారం ఉదయం టీడీపీ రాష్ట్ర కమిటీ రంగంలోకి దిగింది. మృతదేహన్ని ఉంచిన కాకినాడ జీజీహెచ్‌ మార్చురీలోకి వెళ్లేందుకు కమిటీ సభ్యులు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కమిటీ వస్తుందనే ముందస్తు సమాచారంతో శుక్రవారం ఉదయం నుంచే ఆస్పత్రి పరిసరాలు పోలీసులతో నిండిపోయాయి. మార్చురీ చుట్టుపక్కల బ్యారికేడ్లు అడ్డుగా ఉంచారు. బ్యారికేడ్లను తొలగించుకుని మార్చురీలోకి వెళ్లడానికి ప్రయత్నించిన కమిటీ సభ్యుడు ఎంఎస్‌ రాజును పోలీసులు నెట్టివేశారు. బలంగా తోయడంతో రాజు కిందపడిపోయారు. ఆయనను జీజీహెచ్‌ అత్యవసర విభాగానికి తరలించారు. టీడీపీ నిజనిర్ధారణ బృందంలో మాజీ మంత్రులు కేఎస్‌ జవహర్‌, పీతల సుజాత, నక్కా ఆనందబాబు, పితాని సత్యనారాయణ, గొల్లపల్లి సూర్యారావు, పిల్లి మాణిక్యరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సభ్యులుగా ఉన్నారు.  


సెక్షన్‌ 302, అట్రాసిటీ నమోదు

మాజీ డ్రైవర్‌ మృతి వ్యవహారంలో ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ను అరెస్టు చేసి విచారిస్తామని కాకినాడ జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు ప్రకటించారు. ఆయన అరెస్టు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. సెక్షన్‌ 302తోపాటు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కూడా ఉదయభాస్కర్‌పై నమోదు చేసినట్టు ఎస్పీ చెప్పారు. కేసును వేగవంతంగా దర్యాప్తు చేసి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం, పోలీ్‌సశాఖ ఈ ఘటనను చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ కేసును పారదర్శకంగా దర్యాప్తు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. మృతుని కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఈ విషయాన్ని గమనించి దర్యాప్తు ప్రక్రియకు సహకరించాలి’’ అని రవీంద్రనాథ్‌బాబు కోరారు. ఈ వ్యవహారంలో పోలీ్‌సశాఖపై ఎటువంటి ఒత్తిడి లేదని  అడ్మిన్‌ ఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.