జగన్‌ పాలనలో ఏపీకి తీరని నష్టం

ABN , First Publish Date - 2022-05-22T08:21:48+05:30 IST

జగన్‌ పాలనలో ఏపీకి తీరని నష్టం

జగన్‌ పాలనలో ఏపీకి తీరని నష్టం

అధికార మార్పుతోనే రాష్ట్ర పునర్నిర్మాణం

టీడీపీని అఽధికారంలోకి తేవటానికి ఎన్నారైలు తోడ్పడాలి

బోస్టన్‌ మహానాడులో చంద్రబాబు ఆన్‌లైన్‌ ప్రసంగం 

టీడీపీకి ప్రవాసులు సహకరించాలి: బుచ్చయ్య


(బోస్టన్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రత్యేక ప్రతినిధి కిలారు ముద్దుకృష్ణ)


ఏపీలో జగన్‌ పాలనతో రాష్ట్రంలో ఎన్నడూ జరగనంత నష్టం జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 2024లో మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పునర్నిర్మాణం జరపాల్సి ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి రావాలని ప్రజలు ఏకపక్షంగా కోరుకుంటున్నారని తెలిపారు. శనివారం అమెరికాలోని బోస్టన్‌ నగరంలో టీడీపీ మహానాడు జరిగింది. ఈ మహానాడులో చంద్రబాబు ఆన్‌లైన్‌ ద్వారా పాల్గొని మాట్లాడారు. టీడీపీ ఆవిర్భావం తర్వాతే తెలుగు ప్రజల జీవితాల్లో పెనుమార్పులు వచ్చాయని, ఇప్పుడు లక్షల మంది ఉన్నత చదువులతో ఐటీ రంగంలో స్థిరపడటానికి నాడు టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పాలసీలే కారణమని చెప్పారు. జగన్‌ పాలనలో రాష్ట్రం కోలుకోనంతగా నష్టపోయిందని చెప్పారు. పోలవరం, అమరావతి వంటి కీలక ప్రాజెక్ట్‌లను జగన్‌ ఎలా ధ్వంసం చేశారో ప్రజలు చూశారన్నారు. తెలంగాణలో కొన్ని కులాలను బీసీ జాబితా నుంచి తొలగిస్తే.. నోరెత్తని ఆర్‌.కృష్ణయ్య లాంటి వారికి, తనతోపాటు కేసుల్లో ఉన్న వారికి జగన్‌ రాజ్యసభ సీట్లు ఇచ్చారని దుయ్యబట్టారు. తాను ప్రకటించినట్లు వచ్చే ఎన్నికల్లో 40ు సీట్లు యువతకు ఇస్తానని  ఉద్ఘాటించారు. 2024లో టీడీపీని అఽధికారంలోకి తీసుకురావడంలో ఎన్నారైలు తమవంతు పాత్ర పోషించాలని చంద్రబాబు కోరారు. బోస్టన్‌లో 2,200 మందితో మహానాడు నిర్వహించడం గర్వకారణమని అన్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావడానికి ఎన్నారైలు సహకరించాలని ఆ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి కోరారు. బోస్టన్‌ మహానాడులో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రవాసాంధ్రులు తమ ప్రాంతాలకు వచ్చి పార్టీకి మద్దతు పలకాలని కోరారు. పార్టీ ఎన్నారై కన్వీనర్‌ కోమటి జయరాం, ఎమ్మెల్సీ ఎంవీఎస్‌ఎస్‌ ప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, వైవీ ప్రభాకరచౌదరి, పార్టీ నేతలు గౌతు శిరీష, నన్నూరి నర్సిరెడ్డి, మన్నవ సుబ్బారావు తదితరులు ప్రసంగించారు.

Updated Date - 2022-05-22T08:21:48+05:30 IST