భూముల సర్వే ఇలాగేనా..?

ABN , First Publish Date - 2022-05-22T09:02:39+05:30 IST

భూముల సర్వే ఇలాగేనా..?

భూముల సర్వే ఇలాగేనా..?

మేడిపండు చందంగా రీ సర్వే పనులు

సర్కారు చెబుతోంది ఒకటి.. చేస్తున్నదొకటి

క్షేత్రస్థాయి పరిశీలనలో వెలుగులోకి అనేక వాస్తవాలు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘‘రాష్ట్రవ్యాప్తంగా సామాన్యుల భూములు, ఆస్తుల రక్షణ కోసం 100 సంవత్సరాల తర్వాత భూ వివాదాలకు చరమగీతం పాడి, భూ లావాదేవీలను సులభతరం చేసేలా భూ రికార్డుల ప్రక్షాళనకు రూ.1000 కోట్లతో చేపట్టిన ఆధునిక సమగ్ర భూ రీ సర్వేలో భూ రికార్డులు భద్రం’’... గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కోసం సర్కారు ప్రచురించిన మూడేళ్ల ప్రగతి బ్రోచర్‌లో పేర్కొన్న అంశమిది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కూడా ఇదే చెబుతున్నారు. మరి ఆచరణలో ఇదే జరుగుతోందా..? సీఎం జగన్‌ చెబుతున్నట్టుగానే పక్కాగా రీ సర్వే జరుగుతోందా..? అంటే మేడిపండు చందమే అని తాజా క్షేత్రస్థాయి పరిశీలనలో బయటకొస్తోంది. రాష్ట్రంలో 2020, డిసెంబరు 21న భూముల రీ సర్వే ప్రారంభమైంది. ఈ 17 నెలల వ్యవధిలో రీ సర్వే ఎలా సాగుతోంది..? రైతులు ఏమంటున్నారు..? క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమ్యలేమిటో తెలుసుకునేందుకు సర్వేశాఖ తన అధికారులకు జిల్లాలకు పంపించింది. ఒక్కో సీనియర్‌ అధికారి ఒక్కో జిల్లాలో పర్యటించి రీ సర్వే జరుగుతున్న తీరు, పరిస్థితులను ఆరాతీసి.. ఆ తర్వాత ఆ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ను కలిసి నివేదిస్తున్నారు. జిల్లా పరిధిలో రీ సర్వే మరింత మెరుగ్గా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, లోపాలను అధిగమించేందుకు అవసరమైన కార్యాచరణ, ఇతర అంశాలపై సవివర నివేదికలు ఇస్తున్నారు. కొన్ని జిల్లాల్లో పరిశీలన పూర్తవ్వగా, మరి కొన్ని జిల్లాల్లో కొనసాగుతోంది. వీరిచ్చిన సమాచారం ఆధారంగా జేసీలు ఆయా జిల్లా పరిధిలో రీ సర్వేపై కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. ఈ నివేదికలు, క్షేత్రస్థాయి పరిశీలనలను గమనిస్తే సర్కారు గొప్పగా చెబుతున్నట్లుగా.. సర్వే మహా అద్భుతంగా ఏమీ సాగడం లేదని తేటతెల్లమవుతోంది.  

ఉన్నతస్థాయి పరిశీలనలో గుర్తించిన లోపాలు..

రీ సర్వే పూర్తిచేసిన  గ్రామాల్లో 13 నోటిపికేషన్‌లో పేర్కొన్న వివరాలు, రీ సర్వే అనంతరం రూపొందించిన రిజిస్టర్‌కు, ఇంకా పాత భూమిచిత్రపటాలకు సరిపోలడం లేదు. అయినా డ్రాఫ్ట్‌ ల్యాండ్‌ రిజిస్టర్‌ను తయారు చేసి 13 నోటిఫికేషన్‌ ఇచ్చినట్లు తెలిసింది. 


ఏ గొడవా లేని, వివాదంలో లేని భూములకు సర్వేసరిహద్దుల చట్టం ప్రకారం 9(2) నోటీసులు ఇస్తున్నారు. గట్లు, సరిహద్దుల వద్ద వివాదం ఉన్న కేసుల్లో ఈ నోటీసులు జారీ చేయడం లేదని తెలిసింది.

జూ ఒక గ్రామంలో 1200 ఎకరాల భూమి ఉంటే... పాత రికార్డులు, తాజా సర్వే రికార్డుల ప్రకారం మొత్తం భూమిపై 5 శాతం ఎక్కువ లేదా తక్కువ రావాలి. కానీ చాలా కేసుల్లో 10 శాతంపైనే తక్కువ వచ్చిందని, కొత్త మ్యాపులు, పాత ఎఫ్‌ఎమ్‌బీలతో సరిపోలడం లేదని తెలిసింది. 


సర్వేసరిహద్దుల చట్టం ప్రకారం 9(2) నోటిఫికేషన్‌లపై 60 రోజుల్లో రైతులు అభ్యంతరాలు తెలపాలి. సర్కారు ఆ గడువును 30కి తగ్గించింది. నిబంధనల ప్రకారం కనీసం ఆ గడువు వ రకైనా అభ్యంతరాలను స్వీకరించాలి. అయితే, ఉన్నత స్థాయిలోని ఓ అధికారి సూచనల మేరకు రైతులకు 9(2) నోటీసులు ఇచ్చే సమయంలోనే రీ సర్వేలో తమకు ఏ అభ్యంతరాలు లేవని రాయించుకుంటున్నట్లు తెలిసింది. 


భూముల సర్వే అంటేనే ఉన్నవివాదాలను పరిష్కరించి, కొత్తగా ఎలాంటి చిక్కులు రాకుండా చూడటం. దీని ప్రకారం ముందు సర్వే రాళ్లను పాతి భూములను కొలుస్తారు. ఆ తర్వాత ఏ వివాదమూ ఉండదు. కానీ.. ముందుగా రాళ్లు పాతకుండా రోవర్‌తో కొలుస్తున్నారు. ఆ తర్వాత కార్మికులు వచ్చి రాళ్లు పాతున్నా రు. అవి సరిగ్గా ఉన్నాయా? లేవా? అని తేలాలంటే మరోసారి రోవర్‌తో పరిశీలించాలి. కానీ ఆ పనిచేయడంలేదు. అంటే, రోవర్‌తో చేసిన కొలతలకు, రాళ్లు పాతాక వచ్చే లెక్కలకు పొంతన లేకుండా పోతోంది.


రీ సర్వేపూర్తిచేసిన గ్రామాల్లో సర్వేసరిహద్దుల చట్టంలోని సెక్షన్‌ 13 నోటిఫికేషన్‌లు ఇస్తున్నారు. నిబంధనల ప్రకారం రీ సర్వేపూర్తయిన గ్రామంలో భూములకు సంబంధించిన వెబ్‌ల్యాండ్‌ అడంగల్‌ ఆర్‌ఓఆర్‌ 1బీ కింద మారాలి. ఇక్కడా చిక్కులు ఎదురవుతున్నట్లు క్షేత్రస్థాయిలో గుర్తించినట్లు తెలిసింది. 


ఒక గ్రామంలో సర్వే పూర్తయితే, 13 నోటిఫికేషన్‌ ఇచ్చాక పాస్‌బుక్‌లు, వెబ్‌ల్యాండ్‌ అడంగల్‌ మారాలి. అయితే, రీ సర్వేకు అనుగుణంగా వెబ్‌ల్యాండ్‌ అడంగల్‌ను అప్‌డేట్‌ చేయడం లేదని రైతుల ఆందోళన.


భూముల సర్వేలో అన్నింటికంటే కీలకమైనది కో-రిలేషన్‌. గ్రామంలో సర్వేపూర్తయ్యాక పాత రికార్డులు, ఎఫ్‌ఎమ్‌బీలతో కొత్తగా సర్వేచేసిన రికార్డులు సరిపోలాలి. ఇందులో భూముల విస్తీర్ణం, సరిహద్దులు, ఇతర అంశాలు సరిపోలాలి. కానీ ఇది శాస్త్రీయంగా చేయడం లేదని అధికారవర్గాలే చెబుతున్నాయి.


ప్రభుత్వ భూములకు సంబంధించిన రికార్డు పక్కాగా లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఉదాహరణకు సర్వేకు ముందు గ్రామంలో ప్రభుత్వం వద్ద ఎంత భూమి ఉంది? గిఫ్ట్‌ రూపంలో, ఇతర పద్దుల కింద ఎంత భూమి వచ్చింది? భూ సేకరణ కింద ఎంత భూమి వచ్చింది? భూ కేటాయింపుల వల్ల ఎంత భూమి కోల్పోయారు? అన్న అంశాలపై సమగ్ర రికార్డులు సరిగ్గా రూపొందించడం లేదని తెలిసింది. 


ఇటీవల కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. కానీ సరిహద్దులను ఇప్పటి వరకు ఫిక్స్‌ చేయలేదు. మండలం, డివిజన్‌, జిల్లా వారీగా సరిహద్దులు ఖరారు చేయాలి. ఈ విషయంలో ఇప్పటి వరకు సర్కారు మార్గదర్శకాలు ఇవ్వలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2022-05-22T09:02:39+05:30 IST