Abn logo
Sep 23 2021 @ 20:02PM

రాజకీయ నేరస్తులు అత్యంత ప్రమాదకరం: జవహర్

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా నేరస్తులకు జడ్పీ చైర్మన్ పదవులిచ్చి జిల్లా కేంద్రాలను అక్రమ మద్యం, పేకాట, క్రికెట్ బెట్టింగులకు డెన్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వైకాసీ చేపడుతున్న జెడ్పీ చైర్మన్, ఎంపీపీ పదవుల నియామకాల్లో నేర చరిత్ర ప్రామాణికంగా తీసుకుంటున్నారని చెప్పారు. పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న వైసీపీ నేత మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డికి కర్నూలు జిల్లా జెడ్పీ చైర్మన్ పదవి కట్టబెట్టాలనుకోవటం దుర్మార్గమన్నారు. వెంకట సుబ్బారెడ్డిపై  క్రికెట్‌ బెట్టింగ్‌, అక్రమ మద్యం, పేకాట శిబిరాలు నిర్వహించటం వంటి పలు కేసులున్నాయన్నారు. ఇలాంటి  వ్యక్తిని జెడ్పీ ఛైర్మన్‌గా నియమించి వైసీపీ అధిష్టానం ప్రజలకు ఏం సంకేతం ఇవ్వాలనుకుంటోందన ప్రశ్నించారు. నేరస్తులకు పదవులివ్వడమంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేయటమేనన్నారు. అణుబాంబుల కంటే రాజకీయ నేరస్తులు అత్యంత ప్రమాదకరమన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన వైసీపీ నేతలు నేరస్తులకే పగ్గాలు ఇచ్చి ప్రజాస్వామ్య స్ఫూర్తికి గునపాలు దించుతున్నారని పేర్కొన్నారు.  వైసీపీ పుట్టుకతో ప్రజాస్యామ్యం ప్రమాదంలో పడిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.