ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం

ABN , First Publish Date - 2022-04-04T14:19:28+05:30 IST

ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శస్త్ర చికిత్స కోసం వెళ్లిన మహిళ ఫుటేజీ సీసీ కెమెరాలో రికార్డు చేయడంపై ఆమె బంధువులు ఆదివారం రాత్రి ఆందోళనకు దిగారు.

ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం

ఆపరేషనకు వెళ్లిన మహిళ ఫుటేజీ సీసీ కెమెరాలో రికార్డు

ఆస్పత్రి వద్ద బంధువుల గొడవ 

బాధ్యులపై కేసు నమోదు  


అనంతపురం: ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శస్త్ర చికిత్స కోసం వెళ్లిన మహిళ ఫుటేజీ సీసీ కెమెరాలో రికార్డు చేయడంపై ఆమె బంధువులు ఆదివారం రాత్రి ఆందోళనకు దిగారు. డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బాధితులు తెలిపిన మేరకు నగరంలోని 5వ రోడ్డుకు చెందిన ఓ మహిళ మొలల నొప్పితో బాధపడుతుండేది. ఆపరేషన కోసం రామ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్‌, సిబ్బంది ఆదివారం ఆపరేషన చేయడానికి మహిళను తీసుకెళ్లారు. సర్జరీ చేసే దృశ్యాలు ఆ గదిలో ఉన్న సీసీ కెమెరాలో నమోదయ్యాయి. బాధితురాలి బంధువులకు అనుమానం వచ్చి సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా.. ఆపరేషన దృశ్యాలు రికార్డయినట్లు బయటపడింది. దీంతో ఆ మహిళ బంధువులు పెద్దఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. సీసీ కెమెరాలో రికార్డుపై గొడవకు దిగారు. ఆపరేషన థియేటర్‌లో సీసీ కెమెరా ఉందని చెప్పినా డాక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితురాలితో పాటు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డాక్టర్‌, సిబ్బందిపై మండిపడ్డారు. ఒక దశలో దాడిచేసేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న 4వ పట్టణ పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆందోలనకారులతో సమస్యను అడిగి తెలుసుకుని, గొడవకు దిగకుండా శాంతింపజేశారు. అనంతరం బాధితులు స్టేషనకు వెళ్లి, సీసీ కెమెరా రికార్డు వ్యవహారంపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. దీనిపై సంబంధిత వైద్యుడు రామును ఆరా తీయడానికి ‘ఆంధ్రజ్యోతి’ ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

Updated Date - 2022-04-04T14:19:28+05:30 IST