విద్యుదీకరణలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు

ABN , First Publish Date - 2022-04-04T16:43:23+05:30 IST

విద్యుదీకరణలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు

విద్యుదీకరణలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు

తెలంగాణలో 326 కి.మీ, 

ఏపీలో 331 కి.మీ, మహారాష్ట్రలో 

87 కి.మీ, కర్ణాటకలో 27 కి.మీ పనులు


హైదరాబాద్‌,   (ఆంధ్రజ్యోతి): దక్షిణ మధ్య రైల్వే రికార్డు సృష్టించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 770 కిలో మీటర్ల విద్యుదీకరణ పనులు పూర్తి చేసింది. భారతీయ రైల్వే జోన్ల పరిధిలో ఎక్కడాలేని విధంగా సికింద్రాబాద్‌ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే అధికారుల చొరవతో విద్యుదీకరణ పనులు చేపట్టి నిర్దిష్ట గడువులోగా పూర్తి చేసి రికార్డు నెలకొల్పారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణలో 326 కి.మీ, ఆంధ్రప్రదేశ్‌లో 331 కి.మీ, మహారాష్ట్రలో 87 కి.మీ, కర్ణాటకలో 27 కి.మీ పనులు పూర్తి చేసినట్టు రైల్వే అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో చేపట్టిన 326 కి.మీ విద్యుదీకరణ పనుల్లో భాగంగా ఉందానగర్‌-మహబూబ్‌నగర్‌ మధ్య 85.60 కి.మీ, గద్వాల్‌-రాయచూర్‌ మధ్య 57.70 కి.మీ, మోర్తాడ్‌-నిజామాబాద్‌ మధ్య 45.10 కి.మీ విద్యుదీకరణతో లింగంపేట జగిత్యాల-నిజామాబాద్‌ ప్రాజెక్టు పూర్తయినట్టు అధికారులు తెలిపారు. నిజామాబాద్‌-బోధన్‌ మధ్య 25.85 కి.మీ, భద్రాచలం-భవనపాలెం మధ్య 40.13 కి.మీ, పింపల్‌కుట్టి-కొసాయి (తెలంగాణ భాగం), 33.72 కి.మీ, కోహిర్‌దక్కన్‌-ఖానాపూర్‌ స్టేషన్‌ల మధ్య విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. ఏపీలోని ఆరవల్లి- భీమవరం-నర్సాపూర్‌ మధ్య 45.53 కి.మీ, కదిరి-తుమ్మనంగుట్ట మధ్య 53.30 కి.మీ, పాకాల-కలికిరి మధ్య 55.80 కి.మీ, డోన్‌-కర్నూలు సిటీ మధ్య 54.20 కి.మీ, ఎర్రగుంట్ల-నంద్యాల మధ్య 122.32 కి.మీ పనులు పూర్తిచేసినట్టు అధికారులు పేర్కొన్నారు. 


మహారాష్ట్రలో పూర్తి చేసిన 87 కి.మీ విద్యుదీకరణలో లోహోగడ్‌-వాసిం మధ్య 45.30 కి.మీ, ఆంకాయ్‌- రోటేగావ్‌ 37.15 కి.మీ, పింపల్‌కుట్టి-కోసాయి మధ్య 4.17 కి.మీ ఉన్నాయి. కర్ణాటకలో 26 కి.మీ విద్యుదీకరణ కోహిర్‌ డక్కన్‌-ఖానాపూర్‌ స్టేషన్‌ల మధ్య పూర్తయింది. రైల్వే లైన్ల విద్యుదీకరణతో రైలింజన్‌ మార్పు చేయాల్సిన అవసరం ఉండదని, దీంతో ఆయా రూట్లలో రైళ్లను నిరాటంకంగా నడిపే అవకాశం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. రైళ్ల సగటు వేగం మెరుగుపడుతుందన్నారు సెక్షనల్‌ సామర్థ్యం మెరుగవడంతో మరిన్ని రైళ్లను నడిపేందుకు అవకాశాలు పెరుగుతాయి. విద్యుదీకరణ పనుల నిర్వహణలో శ్రమించిన జోన్‌ సిబ్బంది, అధికారుల బృందాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (ఇన్‌చార్జి) అరుణ్‌ కుమార్‌ జైన్‌ అభినందించారు. దక్షిణ మధ్య రైల్వే నెట్‌వర్క్‌లో అధిక భాగం విద్యుదీకరించడంతో రానున్నకాలంలో జోన్‌ 100 శాతం విద్యుదీకరణను సాధించడానికి తోడ్పడుతుందన్నారు. 

Updated Date - 2022-04-04T16:43:23+05:30 IST