అమాత్యులెవరో?

ABN , First Publish Date - 2022-04-04T16:04:20+05:30 IST

జిల్లాల విభజన పూర్తయిపోయింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రకటన కూడా వచ్చేసింది. సోమవారం నుంచి పరిపాలన మొదలు కాబోతోంది.

అమాత్యులెవరో?

మూడు జిల్లాలకు ఇద్దరు గ్యారంటీ

తనను కొనసాగిస్తారనే విశ్వాసంతో ముత్తంశెట్టి

అనకాపల్లి జిల్లా నుంచి రేస్‌లోముత్యాలనాయుడు, అమర్‌, ధర్మశ్రీ, బాబూరావు

అల్లూరి జిల్లా నుంచి భాగ్యలక్ష్మి, ఫాల్గుణ...

సామాజిక వర్గాల ప్రాతిపదికన

మంత్రుల ఎంపిక ఉంటుందని అధిష్ఠానం సంకేతాలు


 (విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) జిల్లాల విభజన పూర్తయిపోయింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రకటన కూడా వచ్చేసింది. సోమవారం నుంచి పరిపాలన మొదలు కాబోతోంది. కొత్త జిల్లాలకు కలెక్టర్‌, ఎస్‌పీల నియామకం ఉత్వర్వులు వచ్చేశాయి. కొందరు అధికారులు ఆదివారమే బాధ్యతలు చేపట్టారు. ఇదే సమయంలో మంత్రివర్గం మార్పుపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దృష్టిసారించారు. ప్రస్తుత మంత్రుల్లో 90 శాతం వరకు మారవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొత్త మంత్రివర్గం ప్రకటన కూడా చాలా త్వరగానే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉగాది సందర్భంగా అమరావతిలో శనివారం మాట్లాడుతూ, ఈసారి సామాజిక వర్గాల ప్రాతిపదికనే మంత్రుల ఎంపిక వుంటుందని స్పష్టంచేశారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం నిర్ణయించారని, ఆ దిశగా కూర్పు జరుగుతోందని ప్రకటించారు.


ఉమ్మడి విశాఖ జిల్లాలో కేవలం ఒకే ఒక మంత్రిగా ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇప్పటివరకు పర్యాటక శాఖను చూశారు. ఇదే జిల్లా మూడు అయ్యింది. కొత్త విశాఖ జిల్లాలో అధికార పార్టీకి ఇద్దరే ఎమ్మెల్యేలు ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే ముత్తంశెట్టే కొనసాగుతారు. బీసీలకు ఇవ్వాలనుకుంటే గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి అవకాశం దక్కుతుందంటున్నారు. 


అనకాపల్లి జిల్లాను తీసుకుంటే...అక్కడ మంత్రి పదవి కోసం విప్‌, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఎస్‌సీలకు అవకాశం ఇవ్వాలనుకుంటే పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు ఛాన్స్‌ దక్కుతుంది. 


పాడేరు కేంద్రంగా ఏర్పాటయ్యే అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం కూడా ఉంది. అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిలు అదృష్టాన్ని నమ్ముకున్నారు. అయితే ఎస్‌టీల నుంచి సాలూరు ఎమ్మెల్యే (సీనియర్‌) పీడిక రాజన్నదొరకు చక్కటి అవకాశాలు వున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనకు బెర్తు ఇస్తే...పాడేరు జిల్లాకు మంత్రి ఎవరూ ఉండకపోవచ్చు.



జిల్లాకొక మంత్రి తప్పనిసరి కాదు


రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండగా ఇప్పుడు మరో 13 జిల్లాలు అదనంగా చేరాయి. అంటే 26. ప్రతి జిల్లాకు ఒక మంత్రి వుండాలనే నిబంధన లేదని, కొన్ని జిల్లాలకు మంత్రులు లేకపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని అధికార పార్టీ నేతలు అంటున్నారు. సామాజిక వర్గాలు, జిల్లా ప్రాధాన్యం, పార్టీ మనుగడ, భవిష్యత్తు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని మంత్రులను ఎంపిక చేస్తున్నారని సమాచారం. ఏదేమైనా ప్రస్తుత విశాఖ జిల్లా మూడుగా మారుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా మంత్రుల సంఖ్య పెరుగుతుందని జిల్లా పార్టీ నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. విశాఖ జిల్లా కీలకం కాబట్టి ఇక్కడొక మంత్రి ఉంటారు. అనకాపల్లి కొత్త జిల్లా...అక్కడొకరికి అవకాశం ఇవ్వనున్నట్టు తెలిసింది. ఈ లెక్కన...ఇద్దరు మంత్రులు గ్యారంటీ అని ప్రచారం జరుగుతోంది. 

Updated Date - 2022-04-04T16:04:20+05:30 IST